అవిశ్వాస తీర్మానంపై లోక్ సభలో చర్చ రసవత్తరంగా సాగింది.కాంగ్రెస్ సహా విపక్షాలు చేసిన ప్రతీ ఆరోపణకు బీజేపీ నేతలు పది రెట్లు శక్తిమంతమైన సమాధానాలు చెప్పారు. తొలుత స్మృతీ ఇరానీ, తర్వాత కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఓ రేంజ్ లో కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు.
రాసి పెట్టుకోండి – 2024లో గెలుపు బీజేపీదే..
ఎవరెన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా 2024 లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని మోదీ నేతృత్వ బీజేపీ ఘనవిజయం సాధిస్తుందని అమిత్ షా విశ్వాసం వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత విపక్ష నేతలు తనకు ఫోన్ చేయొచ్చని షా వారికి అవకాశమిచ్చారు. 1947లో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మూడింటా రెండు వంతుల మెజార్టీతో గెలిచిన ప్రభుత్వం మోదీది మాత్రమేనని అమిత్ షా గుర్తుచేశారు. గత తొమ్మిదేళ్లతో దేశ ఆర్థిక ప్రగతి పరుగులు తీసిందని 11వ స్థానం నుంచి 5వ స్థానానికి ఎగబాకిందని అమిత్ షా గణాంకాలతో సహా చెప్పారు. 2027 నాటికి భారత్ మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందన్నారు. ఇవన్నీ తాను సృష్టించిన గణాంకాలు కాదని, ఐఎంఎఫ్ ఇచ్చిన వివరాలని ఆయన గుర్తు చేశారు. దేశంలోనే మోదీ అత్యంత ప్రజాదరణ ఉన్న నాయకుడని అంటూ ఆయన రోజుకు 17 గంటలు పనిచేస్తారని వెల్లడించారు.
14 దేశాల్లో అత్యున్నత పురస్కారం..
మోదీకి లభించిన అంతర్జాతీయ ఖ్యాతి ఎవరినీ అందలేదని ఇక్కడ ప్రస్తావించాల్సిన అంశం. 14 దేశాలు వారి అత్యున్నత పురస్కారాలతో మోదీని సత్కరించి ఆయన సేవాతత్పరతను గుర్తించాయి. 130 కోట్ల భారతీయులతో పాటు ప్రపంచ దేశాలు కూడా మోదీ గొప్పదనాన్ని ప్రశంసిస్తున్నాయి. అమిత్ షా కూడా అదే విషయాన్ని ప్రస్తావిస్తూ విపక్షాలకు మోదీ నాయకత్వంపై విశ్వాసం లేకున్నా, దేశంలో ప్రతీ ఒక్క పౌరుడికి ఆ విశ్వాసం ఉందని చెప్పుకొచ్చారు. రాుహల్ గాంధీపై ఓ రేంజ్ లో విరుచుకుపడుతూ 13 సార్లు ఆయన రాజకీయాల్లోకి వచ్చేందుకు ప్రయత్నించి ప్రతీ సారీ విఫలమయ్యారన్నారు.
మోదీ తెల్లవారుఝామున 4 గంటలకు ఫోన్ చేశారు…
మణిపూర్ పరిణామాలను రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్న విపక్షాల చర్యలను అమిత్ షా తీవ్రంగా ఖండించారు. అక్కడ రాష్ట్రపతి పాలన పెట్టాల్సిన అవసరం లేదని, ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ప్రభుత్వం కేంద్రానికి సహకరిస్తోందని హోంమంత్రి అన్నారు. మణిపూర్ వ్యవహారంపై చర్చించేందుకు ప్రధాని మోదీ తనకు తెల్లవారఝామున నాలుగు గంటలకు ఫోన్ చేశారని అది ఆయన చిత్తశుద్ధికి నిదర్శనమని అమిత్ షా అన్నారు. సభ్యసమాజం సిగ్గుపడాల్సిన ఘటనలు మణిపూర్లో జరిగాయని, వాటిని కొందరు రాజకీయం చేయడం మరింత సిగ్గుచేటైన అంశమని ఆయన అన్నారు. సంప్రదింపులకు సిద్దంగా ఉన్నామంటూ తాను అన్ని పార్టీలకు లేఖలు రాశానని, పార్లమెంటులో చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్పినప్పటికీ విపక్షాలు రాజకీయ ప్రయోజనాల కోసమే గందరగోళం సృష్టిస్తున్నాయన్నారు. గత ఆరేళ్లలో ఒక బంద్, ప్రతిష్టంభన జరగలేదని, రాష్ట్రప్రభుత్వం చేపడుతున్న చర్యలకు అది నిదర్శనమని అమిత్ షా అన్నారు. ప్రధాని మోదీ తనకు రెండు సార్లు ఫోన్ చేసిన తర్వాత మణిపూర్ చీఫ్ సెక్రటరీ, డీజీపీలను మార్చామన్నారు. తాను మూడు రోజులు, కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్ 23 రోజులు మణిపూర్లో పర్యటించి పరిస్థితులు అదుపుకు వచ్చేందుకు చేయూతనిచ్చామన్నారు.