Mahabharat: మహాభారతం చదివాం అని చెప్పడం కాదు..ఇవి నేర్చుకున్నారా!

పంచ‌మ వేదంగా పేరొందిన మహాభార‌తంలో సమాధానం లేని ప్రశ్నఉండదు. పరిష్కారం దొరకని సమస్య ఉండదు.జీవితాన్ని ప్రభావితం చేసే జ్ఞానదీపం, వ్యక్తిని నడిపించే పాఠం, ఉత్తమ గురువు మహాభారతం. అందుకే మహాభారతాన్ని మత గ్రంధంగా కాదు.. జీవితాన్ని నడిపే దిక్సూచీగా చూడాలి. జీవితంలో చేయాల్సిన‌వి, చేయ‌కూడ‌న‌వి, ఉండాల్సిన‌వి, ఉండ‌కూడ‌ని ల‌క్ష‌ణాలు గురించి సూటిగా వివరించింది మహాభారతం.

అసూయ, దురాశ , పగ మిమ్మల్నే ముంచేస్తాయి
అసూయ, పగ, దురాశ జీవితాన్ని నాశనం చేస్తాయి. ధర్మమార్గంలో నడుస్తున్న పాండవులను, వారి అభివృద్ధిని, ఆదరణను దుర్యోధనుడు చూడలేకపోయాడు. రాజ్యం కావాలనే దురాశ ఓవైపు, పాండవులపై అసూయ మరోవైపు, వాళ్లని నాశనం చేయాలనే పగ మరోవైపు. వారికి అధికారం ఇస్తే త‌న‌కు మనుగడ లేదని భావించి వారిని క‌ష్టాల‌పాలు చేయాల‌ని సుయోధ‌నుడు భావించ‌డమే వారి పతనానికి దారితీసింది.

ధ‌ర్మం కోసం నిలబడండి
ధ‌ర్మంవైపు నిలబడడం చాలా ముఖ్యం. కురుక్షేత్ర యుద్ధమే దీనికి నిదర్శనం. ఎంతో ధైర్యవంతుడైన‌ అర్జునుడు యుద్ధ‌భూమిలో తన బంధువుల‌తో, గురువుల‌తో ఎలా పోరాడాలో తెలియక తికమకపడ్డాడు. ఈ గందరగోళంలో ఉన్న అర్జునుడికి శ్రీకృష్ణ భ‌గ‌వానుడు భ‌గ‌వ‌ద్గీత ఉపదేశించాడు. ప్రతి ఒక్కరూ ధ‌ర్మం కోసం నిలబడాలని కృష్ణుడు పార్థునికి యుద్ధభూమిలోనే జ్ఞాన‌బోధ చేశాడు. ధ‌ర్మ స్థాప‌న ఆవ‌శ్య‌క‌త గుర్తించిన అర్జునుడు గొప్ప యోధునిగా తన బాధ్యత నెరవేర్చాడు.

స్నేహం
స్నేహం గొప్పతనం గురించి మహాభారతంలో చెప్పుకోదగిన పాత్రలు చాలా ఉన్నాయి. శ్రీకృష్ణుడు- అర్జునుడి మ‌ధ్య‌ స్నేహ బంధం అద్భుతమైనది. కృష్ణుడి స్నేహం, ప్రేమ పాండవులకు గొప్ప బలం. పాండవులు మాయాజూదంలో ఓడిపోయినప్పుడు కిక్కిరిసిన కౌర‌వ‌ సభలో ద్రౌపదికి అన్యాయం జరిగినప్పుడు ఆదుకున్నది శ్రీకృష్ణుడే. కౌరవుల శిబిరంలో కూడా దుర్యోధనుడు- కర్ణుడి మ‌ధ్య మైత్రీ బంధం ఒక అందమైన స్నేహానికి సాక్షి. ఆఖరి క్షణం వరకు తన స్నేహితుడి కోసం పోరాడాడు కర్ణుడు.

పిరికితనం దరిచేరనీయకూడదు
కౌరవుల శిబిరంలో ఉన్నప్పటికీ, క‌ర్ణుడు తన దాన గుణంతో అందర్నీ మెప్పించాడు. ‘సూత పుత్రుడు’ అన్న సూటిపోటి మాటలు పడ్డాడు, అందరి ముందూ అవమానాలు భరించాడు, నేర్చుకున్న విద్య పనికిరాదని పరుశరాముడి శాపానికి గురయ్యాడు. అడుగడుగునా అవమానాలు పడినా ధైర్యాన్ని కోల్పోలేదు. స్నేహహస్తం చాచిన దుర్యోధనుడికోసం చివరి నిముషం వరకూ నిలబడ్డాడు. మారు వేషంలో వ‌చ్చిన‌ ఇంద్రుడు కవచ కుండలాలు ఇవ్వాల‌ని అడిగితే..ప్రాణం పోతుందని తెలిసినా దానమిచ్చాడు కర్ణుడు.

సరైన ప్రణాళిక
సంతోషకరమైన, నిజాయితీగల జీవితం కోసం మన భవిష్యత్తు కోసం సరైన ప్రణాళికను రూపొందించుకోవాలి. దీనికి ఉదాహరణ శ్రీ కృష్ణుడు. కౌరవుల నుంచి పాండవులను రక్షించడానికి శ్రీకృష్ణుడు తెలివిగా ప్రణాళికలు రచించాడు. అందుకే కొన్నాళ్లు కష్టాలుపడినా చివరకు విజయం సాధించారు పాండవులు. సరైన ప్రణాళికలు వేసుకోవడంతో పాటూ మంచి స్నేహితులు ఉండడం కూడా అవసరం.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం కొన్ని పుస్తకాలు, పండితుల నుంచి సేకరించినది మాత్రమే. దీనిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.