ఎన్ని స్థానాలు కాదు గెలుపు చాన్స్‌లు ముఖ్యం – రాజకీయం నేర్చుకున్న పవన్ !

తెలంగాణ ఎన్నికల్లో జనసేన పార్టీ ఎనిమిది సీట్లలో పోటీ చేస్తోంది. పొత్తులు లేకపోయినా ఆ పార్టీ పోటీ చేయాలనుకుంది 32 స్థానాల్లోనే కాబట్టి ఈ ఎనిమిది సీట్లు జనసేనకు కేటాయించడం సముచితమేనని బీజేపీ భావించి ఉంటుంది. తమ బలాన్ని మదింపు చేసుకుని పవన్ కూడా ఎనిమిది సీట్లకు సర్దుకుపోయారు. అయితే రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు అంత ఆషామాషీగా జరగలేదు. పక్కా సర్వేలతో .. పరస్పర ప్రయోజనాలకు అనుగుణంగానే జరిగాయి.

రాశి కాదు వాసి ముఖ్యమని తెలుసుకున్న పవన్ కల్యాణ్

ఎన్ని సీట్లలో పోటీ చేశామన్నది కాదు.. ఎన్ని సీట్లలో గెలిచామన్నదే ముఖ్యం. పవన్ ఈ విషయాన్ని తెలుసుకున్నారు. యాభై సీట్లలో పోటీ చేసి ఒక్క చోట కూడా గెలవకపోవడం కన్నా ఎనిమిది సీట్లలో పోటీ చేసి ఐదు చోట్ల గెలిస్తే వచ్చే ఇంపాక్ట్ వేరుగా ఉంటుంది. జనసేన, బీజేపీ కలిస్తే ఖచ్చితంగా గెలిచే నియోజకవర్గాలనే జనసేనకు కేటాయించారు. కూకట్ పల్లి ఖమ్మం వంటి చోట్ల తనదైన మార్క్ చూపించి జనసేన సులువుగా గెలవగలదు. తమ పార్టీ తెలంగాణ ఇంచార్జ్ పోటీ చేస్తున్న తాండూరులో నూ గట్టి పోటీ ఇచ్చేందుకు బీజేపీ బలం సరిపోతుంది.

కూటమి కోసం విస్తృత ప్రచారం చేయనున్న పవన్

కూటమి కోసం పవన్ కల్యాణ్ విస్తృత ప్రచారం చేసే అవకాశం ఉంది. జనసేన పోటీ చేస్తున్న చోట్లే కాకుండా… గ్రేటర్ పరిధిలో పవన్ ప్రచారాన్ని విస్తృతంగా చేయించుకోవాలని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. పవన్ కూడా సిద్ధంగానే ఉన్నారు. రెండు పార్టీల మధ్య పొత్తులు పరస్పర సహకారంతోనే సక్సెస్ అవుతాయి. ఈ విషయంలో మరో మాటకు తావు ఉండదు. తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ , జనసేన కూటమి ఓ సంచలనం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

టీడీపీ సానుభూతిపరుల మద్దతు పొందడం కీలకమే.

తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఎన్నికల నుంచి విరమించుకుంది. తమ దృష్టి పూర్తిగా ఏపీపైనే ఉందని చెప్పింది. కాబట్టి టీడీపీ జనసేన ఉన్నందున ఆ కూటమికి ఓటు వేయమని అడిగే అవకాశం లేదు. టీడీపీ సానుభూతిపరులకు ప్రత్యేకమైన సందేశాలు ఇచ్చే పరిస్థితి ఉండదు. తమకే మద్దతివ్వాలని బీజేపీ, పవన్ కూడా అడగలేరు. కానీ ఏపీలో పొత్తులు పెట్టుకున్న జనసేనకు.. టీడీపీ తెలంగాణలో సహకించడం నైతికత అవుతుంది. టీడీపీ సానుభూతి పరులు జనసేనను బలపరిస్తే.. ఏపీ లో కలసి పని చేస్తామన్న పవన్ కు గౌరవం ఇచ్చినట్లవుతుంది.