ఎండలు పోయాయ్..వానల జోరు తగ్గింది..చలి పుంజుకుంటోంది. ఈ సీజన్లో మనల్ని మనం రక్షించుకోవడంతో పాటు మనం తీసుకునే ఆహారాల్లో కూడా మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. చలికాలంలో శరీరాన్ని వేడిగా ఉంచే ఆహారాలతో పాటు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలను తీసుకోవాలి. అలాంటి ఆహారాల విషయానికొస్తే ఆకుకూరల్లో మెంతికూర చాలా మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. మెంతి ఆకుల్లో కాల్షియం, ఐరన్, ప్రొటీన్, ఫాస్పరస్ ఉంటాయి. వీటివల్ల తేలికగా జీర్ణమవుతాయి. ఇంకా చాలా ప్రయోజనాలున్నాయి…
గొంతు ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది
మెంతికూరతో రకరకాల కూరలు, పప్పు తయారు చేస్తారు. మెంతికూర తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు శరీరానికి అవసరం అయిన వెచ్చదనం అందిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి ఇన్పెక్షన్ ల బారిన పడకుండా కాపాడడంలో దోహదపడతాయి. అలాగే చలికాలంలో జీవక్రియల రేటు తక్కువగా ఉంటుంది.. మెంతికూరను తీసుకోవడం వల్ల జీవక్రియల రేటు మెరుగుపడుతుంది.
రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి
మెంతికూర తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. దీనిని తరుచూ తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ బారిన పడే అవకాశాలు చాలా తక్కువ.
నెలసరి పెయిన్ తగ్గుతుంది
మెంతికూర తీసుకోవడం వల్ల స్త్రీలలో నెలసరి సమయంలో వచ్చే నొప్పి తగ్గుతుంది. మెంతికూరను తీసుకోవడం లేదా మెంతులతో టీ తయారు చేసి తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. హార్మోన్ల అసమతుల్యత వంటి సమస్యలు తగ్గుతాయి.
బరువు తగ్గుతారు
మెంతికూరలో ఉండే క్యాలరీలు బరువు తగ్గించడంలో సహకరిస్తాయి. . ఎందుకంటే మెంతి ఆకుల్లో పీచు ఎక్కువగా ఉంటుంది. ఇది ఎక్కువ సేపు కడుపు నిండిన భావన కలిగిస్తుంది. దీని వల్ల ఆకలిగా అనిపించదు. ఈ విధంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
స్కిన్ కేర్
చలికాలంలో చర్మం పగలడం చాలా సాధారణం. మెంతి ఆకులలో యాంటీ-ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మొటిమలను తొలగించడంలో సహాయపడతాయి. మెంతి ఆకులను పేస్ట్ లా చేసి ముఖానికి అప్లై చేయాలి. ఇది ముఖంపై ఉన్న మొటిమలు, మచ్చలని తొలగించడంలో సహాయపడుతుంది.
గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.