సామాన్యుల పార్టీ అంటారు.. వారినే దోచుకుంటుంటారా..

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఢిల్లీ, పంజాబ్ రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. అవినీతి వ్యతిరేకోద్యమంతో మొదలై, తర్వాత రాజకీయ పార్టీగా అవతరించి తొలుత ఢిల్లీని తర్వాత పంజాబ్ ను కైవశం చేసుకుంది. నీతిని వదిలేసి అవినీతిని వంటపట్టించుకున్న ఆప్ , ఢిల్లీ లిక్కర్ స్కాంలోనూ ఇరుక్కుంది. పార్టీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా బెయిల్ పొందలేక ఇంకా జైల్లోనే ఉన్నారు..

ఉచితాలతో గాలం

ఉచితాలతో సగటు ఓటర్లకు గాలం వేయడంతో ఆప్ దిట్ట. ఉచిత విద్యుత్,తాగు నీరు లాంటి స్కీములతో జనాన్ని ఆకట్టుకుని రెండు రాష్ట్రాలను చేజిక్కించుకుందన్న ఆరోపణలున్నాయి. ఈ స్కీముల అమలు కారణంగా ప్రజాధనం మొత్తం వృథాగా పోయి, రాష్ట్రాల ఖజానాకు గండి పడి, స్టేట్ దివాలా తీస్తున్నా ఆప్ కు చీమకుట్టినట్లుగా లేదు. నా దారి ఫ్రీ దారి అన్నట్లుగా ఆప్ ముందుకు సాగుతూనే ఉంది.

పంజాబ్ లో ఛార్జీలు పెంపు

మెత్తగా కబుర్లు చెప్పే ఆప్ ఇప్పుడు జనాన్ని బాదడం మొదలు పెట్టింది పంజాబ్ లో ఉచిత విద్యుత్ అమలు జరుపుతూనే సామాన్యులకు కరెంట్ ఛార్జీలు పెంచింది గృహ వినియోగంతో పాటు వాణిజ్య వినియోగానికి టారిఫ్ గణనీయంగా పెరిగింది. ఈ ఆర్ధిక సంవత్సరంలో పరిశ్రమలకు అదనంగా లక్షల రూపాయలు విద్యుత్ ఛార్జీలు చెల్లించే పరిస్థితి ఏర్పడింది.

జీరో బిల్స్ కు ఇబ్బంది లేదట.. కట్టే వాళ్లకే బాదుడు

పంజాబ్ కొత్త ప్రభుత్వం గతేడాది ద్వితీయార్థంలో కరెంట్ ఫ్రీ చేసింది. అక్కడ రెండు నెలలకోసారి కరెంట్ బిల్లులు వస్తాయి. రెండు నెలలకు ఆరు వందల యూనిట్లు అంటే నెలకు 300 యూనిట్ల కరెంట్ ఉచితంగా పంపిణీ చేస్తోంది. 51 లక్షల మంది గృహ వినియోగదారులకు ఈ పథకాన్ని వర్తింపజేస్తోంది. రాష్ట్ర ఖజానాకు వేల కోట్లు గండి పడుతున్నా భగవంత్ సింగ్ మాన్ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు యూనిట్ రేటున పెంచడం ద్వారా బిల్స్ కట్టే 23 లక్షల కుటుంబాలతో పాటు చిన్న, పెద్ద పరిశ్రమలపై అదనపు భారం పడుతోంది.

పారిశ్రామికవేత్తల ఆగ్రహం

పంజాబ్ ప్రభుత్వ తీరుపై పారిశ్రామిక వేత్తలు తీవ్ర ఆగ్రహం చెందుతున్నారు. ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు అధికారికంగా కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉచిత విద్యుత్ అందుకునే వారికి ఎలాంటి ఇబ్బందీ లేదని, ఛార్జీలు కట్టే వారిపైనే అదనపు భారం పడుతోందని జనం ఆందోళనను పరిశ్రమల పెద్దలు పంజాబ్ ప్రభుత్వానికి విన్నవించేందుకు ప్రయత్నించారు. అసలే పరిశ్రమల నష్టాల్లో ఉన్నాయని, ఉత్పత్తుల అమ్మకాలు లేక చిన్న, మధ్య తరహా పరిశ్రమలు కూనారిల్లుతున్నాయని వారు గుర్తు చేశారు. ప్రభుత్వ వైఖరి కారణంగా చిన్న పరిశ్రమలు మూతబడే ప్రమాదం కూడా ఉందని చెబుతున్నారు. మరో పక్క ఛార్జీలు పెరగడంతో ఉత్పత్తి వ్యయం గణనీయంగా పెరిగి, వస్తువుల ధరలు ఆకాశానికి చేరితే ఎవరు బాధ్యత వహించాలో తేల్చుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు…