హైదరాబాద్‌ను లండన్, న్యూయార్క్, ఇస్తాంబుల్ చేసేశామని తెలంగాణ మంత్రి కేటీఆర్ తరచూ ఐటీ కారిడార్‌లో తీసిన కొన్ని ఫోటోలను పోస్ట్ చేసి మురిసిపోతూంటారు. అభివృద్ది గురించి అందరూ తమ దగ్గర నేర్చుకోవాలన్నట్లుగా మాటలు చెబుతూంటారు. దానికి తోడు.. అద్భుతంగా ఉన్న భవనాల్ని కూల్చేసి పదిహేను వందల కోట్లు ఖర్చు పెట్టి రెడీ చేసిన ఇంజినీరింగ్ కాలేజీ లాంటి భవనానికి కొన్ని కోట్లు పెట్టి పబ్లిసిటీ చేసుకుంటున్నారు. ఆహా..ఓహో అనుకుంటున్నారు. కానీ ఈ ప్రచార పటోటోపం మొత్తాన్ని ఒక్క వర్షం తుడిచి పెట్టేసింది. అది కూడా తుపాను కాదు. వర్షాకాలం జడివాన కాదు. ఎండాకాలంలో కురిసిన అకాల వర్షం.
గంట పాటు కురిసిన వర్షానికి హైదరాబాద్ అతలాకుతరం
తెల్లవారుజామున గంట పాటు కురిసిన వర్షానికి హైదరాబాద్ అతలాకుతలం అయిపోయింది. రోడ్లన్నీ చెరువులయ్యాయి. ఓపెన్ నాలా కారణంగా ఓ చిన్నారి ప్రాణం కోల్పోవడంతో అసలు హైదరాబాద్ మౌలిక వసతులపై చర్చలు ప్రారంభమయ్యాయి. ఎన్ని వాహనాలు కొట్టుకుపోయాయో లేెక్కలేదు. అసలు ఇది వర్షా కాలం కాదు. ఎండా కాలం. క్యూములో నింబస్ లేదా మరో కారణంతో పడే వర్షాలు.. అంత తీవ్రంగా ఉండవు. ఓ గంట.. అరగంట దంచి కొడతాయి . దానికే కాలనీలకు కాలనీలు మునిగిపోతున్నాయి. ఇది ఎప్పుడూ ఉండేదే. అయితే ఎందుకు బాగు చేయడం లేదన్నది అసలు ప్రశ్న. సమైక్యాంద్ర పాలకుల పాపం అంటూ అదే పనిగా ప్రచారం చేసుకుంటూ ఉంటారు. సొంత రాష్ట్రంలో పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ నేతలు ఏం చేశారు. పరిస్థితి ఇంకా ఎందుకు రాను రాను దిగజారిపోతోంది.
బీఆర్ఎస్ నేతలు నాలాల కబ్జాలు – అధికార యంత్రాంగంలో నిర్లక్ష్యం
బీఆర్ఎస్ నేతలు అధికారం అందిందని ఇష్టారాజ్యంగా దోపిడీ చేయడం ప్రారంభించారు. చివరికి నాలాల్ని వదల్లేదు. మరో వైపు గ్రేటర్ పాలకుల నిర్లక్ష్యం తోడైంది. ఇలాంటి వరదలు వచ్చినప్పుడు అదిగో ఇదిగో అని హడావుడి చేస్తాయి. పోయిన ప్రాణాలు పోతాయన్నట్లుగా ఉంటారు. మళ్లీ షరామామూలే. ఇదంతా పాలనలో స్పష్టంగా కనిపించే లోపం. కానీ ఇలాంటివి జరిగినప్పుడు జరలేదన్నట్లుగా కళ్లు మూసుకుని ప్రపంచ నగరం అన్నట్లుగా హైదరాబాద్ గురంచి పబ్లిసిటీ చేసుకుంటూ ఉంటారు. ఓ వైపు ఐటీ కారిడార్‌లో పైవేటు సంస్థలు పెట్టుబడులుతో అభివృద్ధి చెందుతోంది. మరి మిగతా నగరం గురించి ఎందుకు పట్టించుకోరు ?
కొత్త సచివాలయం ప్రారంభించుకోవడానికి సిగ్గుపడరా ?
ఐటీ కారిడార్ లో ఆకాశ హర్మ్యాలు సరే అసలు జనం ఉండే కాలనీల సంగతేమిటన్న ప్రశ్న ఇప్పుడు ప్రధానంగా వస్తోంది. తెలంగాణ సచివాలయం విషయంలో పబ్లిసిటీ పీక్స్‌కు చేరిన సమయంలో.. అదీ కూడా సచివాలయం ప్రారంభం రోజునే.. ఓ గంట పాటు కురిసిన వర్షానికి హైదరాబాద్‌లో బీభత్సం సృష్టించడంతో ఉత్సాహం అంతా నీరు కారిపోయింది.
ఎంత కాదనుకున్నా.. మహా నగరంలో మరో కోణాన్ని ఈ వర్షం బయట పట్టింది. సహజంగానే చేసుకుంటున్న పబ్లిసిటీకి.. వాస్తవానికి తేడా ఏమిటో వర్షం బయట పెట్టిందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఈ ఘటనలపై ప్రభుత్వం వీలైనంత తక్కువగా స్పందించేందుకు ప్రయత్నిస్తోంది. కానీ జరగాల్సిన నష్టం మాత్రం జరిగిపోయింది. కొత్త సచివాలయం బడాయిని ప్రజల్లోకి తీసుకెళ్లడం కూడా మైనస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా నిజం ఒప్పుకుని హైదరాబాద్ అభివృద్ధి కి కనీసం వర్షాలకు ప్రజలు నాలాల్లో పడి కొట్టుకుపోకుండా అయినా అభివృద్ది చేయాల్సి ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది.