కురుపాం కోటలో హోరాహోరీ – పుష్పశ్రీవాణీకి ఈ సారి కేక్ వాకేనా ?

ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొలదీ కురుపాం నియోజకవర్గంలో రోజురోజుకు ఎన్నికల వేడి హీటెక్కుతుంది. ఒకవైపు టిడిపి జనసేన ఉమ్మడి అభ్యర్థి తోయక జగదీశ్వరి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. గుమ్మలక్ష్మీపురం, కురుపాం మండలాలపై ప్రత్యేక దృష్టి సారించారు. గ్రామాల్లో సభలు, సమావేశాలు నిర్వహిస్తూ ప్రజలకు మరింత చేరువవుతున్నారు. అనేక ఏళ్ల తర్వాత ఒక గిరిజన బిడ్డకు అవకాశం వచ్చిందని, తనను గుర్తించి ఎమ్మెల్యేగా గెలిపించాలంటూ జగదీశ్వరి అభ్యర్థిస్తున్నారు.

వైసీపీకి కంచుకోటగా కురుపాం

కురుపాం వైసిపి ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి కూడా రానున్న ఎన్నికల్లో ముచ్చటకు మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపు కోసం వ్యూహ రచన చేస్తున్నారు. ఐదు మండలాల్లో ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు, ఎంపిటిసిలు, ఎంపిపిలు, జడ్పిటిసిలు, గృహ సారధులతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో పార్టీ అనుకూల, ప్రతికూల పరిణామాలు తెలుసుకుంటూ వాటిని సరి చేసే పనిలో ఉన్నారు. కొన్ని మండలాల్లో వైసిపి నాయకులు, ప్రజాప్రతినిధులు పుష్పశ్రీవాణి ఎమ్మెల్యేగా గెలవాలంటూ పూజలు చేసి ప్రచారం ప్రారంభించారు.

కురుపాం టీడీపీలో రెండు గ్రూపులు

ఎన్నికలు సమీపిస్తున్నా కురుపాంలో టిడిపి నేటికీ రెండు గ్రూపులుగానే పనిచేస్తుంది. ఇది రానున్న ఎన్నికలకు చాలా ఇబ్బందికర పరిస్తితులు తీసుకువచ్చేలా ఉందని ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికీ ఈ సమస్యపై అధిష్టానం దృష్టి సారించకపోవడంతో గ్రూపుల ఎడబాటుతో టిడిపిలో తడబాటు తప్పదని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు కలిసికట్టుగా ఉన్న కొందరు నాయకులు కూడా టిడిపి, జనసేన ఉమ్మడి నేతలు జగదీశ్వరి ఎన్నికల ప్రచారంలో కనిపించడంలేదు. స్థానికంగా ఉన్న నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారంలో ఆమె దూకుడు పెంచారు. మొన్నటి వరకు ఎమ్మెల్యే టికెట్‌ కోసం ఆశించిన రెండో వర్గం ఆశావాహులు, నాయకులు రానున్న ఎన్నికలకు ఏం చేయాలనే ఆలోచనతో ఎన్నికల భవిష్యత్‌ కార్యాచరణ ఆలోచనతో ఉన్నారు. నేటి వరకు అధిష్టానం తమను ఎందుకు గుర్తించలేదని, గ్రూపులను కలిపే ఆలోచన కూడా ఎందుకు చేయలేదని గుర్రుగా ఉన్నారు.

టీడీపీ గ్రూపులు కలవకపోతే వైసీపీకి కేక్ వాక్

మొన్నటి వరకు టిక్కెట్‌ ఆశించిన కురుపాం వైరిచర్ల వీరేష్‌దేవ్‌ కూడా సైలెంట్‌ గానే ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆశావాహులు ఎమ్మెల్యే అభ్యర్థి జగదీశ్వరితో కలిసి పనిచేస్తారా? లేదా ప్రత్యామ్నాయ మార్గం పోటీలో నిలబడతారా? అనే ప్రశ్నలు ప్రస్తుతం ప్రజల్లో చర్చ వినిపిస్తోంది. మొదటి నుంచి కురుపాంలో టిడిపి రెండు గ్రూపులుగా విడిపోయి ఒకరిపై ఒకరు ఆరోపణలకు దిగుతుంటే వైసిపిలో ఆ సమస్య లేకపోవడంతో ప్రశాంతంగా ఎన్నికలకు వెళ్తున్నారు. ఏది ఏమైనా టిడిపిలో గ్రూపులు కలిస్తేనే రానున్న ఎన్నికలకు వైసిపికి గట్టి పోటీ ఉంటుందని భావిస్తున్నారు. లేదంటే మూడోసారి కూడా వైసిపి గెలుపు సులభతరమవుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. .