భద్రతా బలగాల ఉదాసీనతే మావోయిస్టు దాడులకు కారణమా… ?

భద్రతా బలగాల ఉదాసీనతే మావోయిస్టు దాడులకు కారణమా… ?

ఒక తప్పు నుంచి ఎవరైనా గుణపాఠాలు నేర్చుకుంటారు. తప్పులను సరిదిద్దుకునేందుకు ప్రయత్నిస్తారు. కొంత వరకైన సక్సెస్ అవుతారు. మావోయిస్టులు,నక్సలైట్ల విషయంలో మాత్రం భద్రతా బలగాలు గుణపాఠాలు నేర్చుకోలేకపోతున్నాయి. అందుకే ఛత్తీస్ గఢ్ దంతేవాడలోని అరన్పూర్ ప్రాంతంలో ఐఈడీ పేలుడుతో బుధవారం 11 మంది జవాన్లను మావోయిస్టులు పొట్టనపెట్టుకున్నారు..

13 ఏళ్లతో ఏడు భారీ దాడులు

జార్ఖండ్,ఒడిశాలో మావోయిస్టులు బలహీనపడిపోయారు. భద్రతా దళాల ఎన్ కౌంటర్లలో చనిపోయిన వారు పోగా.. మిగిలిన వాళ్లు ఛత్తీస్ గఢ్లోని బస్తర్ ప్రాంతానికి చేరుకుని అక్కడ తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. భద్రతా దళాలపై దాడులు చేస్తున్నారు. 2010 నుంచి ఇప్పటి వరకు జరిగిన ఏడు పెద్ద మావోయిస్టు దాడుల్లో ఆరన్పూరు అటాక్ ను ఒకటిగా భావిస్తున్నారు.

2010 ఏప్రిల్ లో దంతెవాడలో మావోయిస్టులు జరిపిన దాడిలో ఏకంగా 76 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు వదిలారు. 2013లో దంతేవాడలోని ఝూరం గ్రామంలో మావోయిస్టులు దాడి చేసినప్పుడు కాంగ్రెస్ నేతలు చాలా మంది చనిపోయారు. 2017లో సుక్మా దాడితో మావోయిస్టులు మళ్లీ తమ ఉనికిని చాటుకున్నారు. అందులో 15 మంది చనిపోయారు. 2020లో భూపేష్ భాగెల్ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత 2020 మార్చిలో దాడి చేసి 17 మంది భద్రతా సిబ్బందిని చంపేశారు. ఐఈడీ పేలుడు ద్వారానే వాళ్లు ఈ దాడి చేయగలిగారు. 2021లో బస్సును పేల్చేసి ఐదుగురిని చంపేశారు. నెల తిరగకుండానే సుక్మాలో 22 మంది సెక్యూరిటీ సిబ్బందిని అత్యంత కిరాతకంగా హతమార్చారు..

వేసవిలోనే దాడులు

ఛత్తీస్ గఢ్ మావోయిస్టులు చేసి దాడులు ఎక్కువగా వేసవిలోనే జరుగుతున్నాయని నిర్ధారణకు వచ్చారు. మార్చి నుంచి జూన్ వరకు మావోయిస్టులపై దాడులకు భద్రతా దళాలు దీన్ని వ్యూహాత్మక చర్యల సమయం..అంటే టీసీఓసీ.. అని పిలుస్తారు. అయితే మార్చి నుంచి జూన్ వరకు మావోయిస్టులే పైచేయిగా ఉంటున్నారు. అడవులు ఎండిపోయి దూర ప్రాంత లక్ష్యాలు సులభంగా కనిపించడంతో భారీ దాడులకు ఈ సమయాన్ని వేరు ఎంచుకుంటున్నారు. రోడ్డు నిర్మాణంతో పాటు ఆపరేషన్ బేస్ లను సీఆర్పీఎఫ్ ఏర్పాటు చేసినప్పటికీ మావోయిస్టు హిడ్మా నాయకత్వంలో దాడులు జరుగుతున్నాయి. భారీ దాడులన్నీ మార్చి నుంచి జూన్ మధ్యనే జరుగుతున్నాయి..

ఎస్ఓపీలను పట్టించుకోని భద్రతా దళాలు..

డ్రోన్ టెక్నాలజీ సైతం వాడకంలోకి వచ్చిన తర్వాత కూడా మావోయిస్టు దాడులను ఎందుకు నిరోధించలేకపోతున్నారన్న ప్రశ్నలు తెలెత్తుతున్నాయి. అదీ భద్రతా దళాల తప్పేనని, వాళ్లు స్టాండర్ట్ ఆపరేటింగ్ ప్రొసీజర్.. ఎస్ఓపీలను అమలు చేయడం లేదని తాజా విశ్లేషణలు చెబుతున్నాయి. భద్రతా దళాల కాన్వాయ్ ఎటు వైపు వెళ్లాలి… రోడ్ ఓపెనింగ్ పార్టీలు ఎంత ముందు వెళ్లాలి.. తిరుగు ప్రయాణంలో రూటు మార్చి ఎటు నుంచి రావాలి… పదాది దళాలు చేయాల్సిన పనేమిటి.. ఇంటెలిజెన్స్ ను ఎలా వినియోగించాలి లాంటి ఎస్ఓపీలను పాటించడం లేదు. ఆరాన్పూర్ ఐఈడీ దాడికి కూడా అదే కారణమని చెబుతున్నారు..

నిజానికి మావోయిస్టుల బలగం తగ్గిపోయింది. వారి వద్ద ఆయుధాలు లేవు. అయినా వాళ్లు పైచేయిగా ఉంటున్నారు. ఎందుకంటే మావోయిస్టులు తమ దాడులకు ఐఈడీ టెక్నాలజీని వాడుతున్నారు. మందు పాతరలు పేల్చి భద్రతా సిబ్బందిని చంపేస్తున్నారు. తమ వైపు నుంచి ఎలాంటి ప్రాణనష్టం ఉండకుండా చూసుకుంటున్నారు. మావోయిస్టు దాడులు 77 శాతం తగ్గాయని చెప్పుకుంటూ తిరుగుతున్న భద్రతా దళాలు తమకు తెలియకుండానే వారి ట్రాప్ లో పడిపోతున్నారు. అందుకే ఎస్ఓపీని సక్రమంగా అమలు చేస్తేనే ప్రాణహాని లేకుండా మావోయిస్టులను అరికట్టే వీలుంటుంది…