ఇండియా గ్రూపులో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఒక పార్టీ అంటే మరో పార్టీకి పడటం లేదు. కాంగ్రెస్ పార్టీ పట్ల భాగస్వామ్య పక్షాలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నాయి.కాంగ్రెస్ ఆధిపత్యాన్ని తాము ఎందుకు ఒప్పుకోవాలని కొన్ని పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. తమ రాష్ట్రాల్లో అస్సలు బలం లేని కాంగ్రెస్ ను నెత్తిన పెట్టుకోవాల్సిన అగత్యం ఏమి వచ్చిందని కూడా నిలదీస్తున్నాయి. కూటమి నుంచి ఎప్పుడు బయటకు వద్దామా అని పార్టీలు ఎదురు చూస్తున్నాయి…
రెండు సీట్లు ఇస్తామంటున్న దీదీ
తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇప్పుడు కాంగ్రెస్ తీరుపై మండిపడుతున్నారు. గ్రాండ్ ఓల్డ్ పార్టీ స్థాయిని తగ్గించేందుకు ఆమె వెనుకాడటం లేదు. బెంగాల్ లో 42 లోక్ సభా స్థానాలుండగా కాంగ్రెస్ కు రెండుకు మించి కేటాయించలేమని తృణమూల్ తెగేసి చెబుతోంది. గత రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ కు వచ్చిన ఓట్ షేర్ ఆధారంగా తాము ఈ ప్రతిపాదన చేస్తున్నట్లు తృణమూల్ వర్గాలు చెబుతున్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు వచ్చాయని కొందరు తృణమూల్ నేతలు గుర్తు చేస్తున్నారు. ఖచితంగా చెప్పాలంటే 3.03 శాతం ఓట్లు వచ్చాయి. అందుకే రెండు సీట్లకు మించి ఇవ్వలేమని తేల్చేస్తున్నారు..
ఈశాన్య రాష్ట్రాల సంగతేంటి..
బెంగాల్ లో సీట్ల సర్దుబాటు చర్చలను ఇతర రాష్ట్రాలతో లింకు పెట్టేందుకు తృణమూల్ ప్రయత్నిస్తోంది. అసోం, మేఘాలయలో లెక్కలు తేల్చాలని డిమాండ్ చేస్తోంది. మేఘాలయలో ఒక స్థానం, అసోంలో నాలుగు సీట్లు కావాలని తృణమూల్ కోరుతోంది. గోవాలో రెండు లోక్ సభా స్థానాల్లో ఒకటి తమకు కేటాయించాలంటోంది. అయితే ఆ మూడు రాష్ట్రాలకు సంబంధించిన సీట్ల సమస్య వల్ల ఇండియా గ్రూపుకు ఇబ్బంది కలిగించబోమని తృణమూల్ అంటోంది. పశ్చిమ బెంగాల్ వ్యవహారంలో మాత్రం తాము ఇచ్చినన్ని సీట్లు కాంగ్రెస్ తీసుకోవాల్సిందేనని దీదీ అనుచరులు తేల్చిచెబుతున్నారు…
ఇంకొక్క సీటు ఇచ్చినా చాలా..
కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. అందులో పశ్చిమ బెంగాల్ కూడా ఒకటి. అక్కడ గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి ఒక సీటు కూడా రాలేదు. దానితో డిమాండ్ చేసే అవకాశాలు లేకుండా పోయాయి. తృణమూల్ చెబుతున్నట్లు రెండు లోక్ సభా సీట్లు కాకుండా ఇంకొకటి ఇచ్చినా సర్దుకుపోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఎందుకంటే అధికార తృణమూల్ కాంగ్రెస్ తో చేయి కలిపితే వాళ్లిచ్చిన అన్ని నియోజకవర్గాల్లో పార్టీ గెలుస్తుందన్న విశ్వాసం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉంది. రాష్ట్రంలో తృణమూల్ అత్యంత శక్తిమంతమైన పార్టీగా ఉంది. ఒక్క సారి పొత్తులు కుదిరితే ఇక బీజేపీ వారికి దరిదాపుల్లోకి కూడా రాలేదు. అయితే తృణమూల్ మాత్రం కాంగ్రెస్ ను అదనపు లగేజీగా భావిస్తోంది….