చీపురుపల్లి నియోజకవర్గం రాష్ట్రంలో కీలకమైనది. అది మంత్రి బొత్స ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. ఈ సారి ఆయన గడ్డు పరిస్థితి ఎదుర్కొంటారన్న చర్చ జరుగుతోంద. మంత్రి బొత్స సత్యనారాయణకు ఇక్కడ మంచి పట్టుంది. 2014లో మాత్రమే ఆయన ఓడిపోయారు. కానీ రెండో స్థానంలో నిలిచారు. దాదాపుగా నలభై ఐదు వేల ోట్లు సాధించారు. 2004లో తొలిసారి చీపురుపల్లి నుంచి అసెంబ్లీకి ఎన్నికైన బొత్స.. ఆ తర్వాత అదే జోష్ కంటిన్యూ చేశారు. 2009లో మళ్లీ గెలిచి మంత్రిగానూ అవకాశం దక్కించుకున్నారు. అయితే ఆయితే ఆయన మెజార్టీ ఎప్పుడూ అసాధారణ స్థాయిలో లేదు. ఐదు, పదివేల మధ్యలోనే ఉంటోంది.
సత్తిబాబుగా అందరికీ తెలుసు – కానీ పనితీరుపైనే ప్రజల్లో అపనమ్మకం
ఉమ్మడి ఏపీలో పీసీసీ ప్రెసిడెంటుగానూ బాధ్యతలు నిర్వర్తించి.. రాష్ట్రస్థాయి నేతగా గుర్తింపు పొందారు సత్తిబాబు. వైఎస్ మరణం తర్వాత సీఎం ఎవరనే విషయంలో.. ఆయన పేరు కూడా తెరమీదకొచ్చింది. అయితే, విభజన సెగ దెబ్బతో 2014లో ఓడిన ఆయన..2015లో జగన్‌తో చేతులు కలిపారు. ఆ తర్వాత 2019లో వైసీపీ తరపున పోటీచేసి… విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో మూడోస్థానానికి పరిమితమైన పార్టీని.. చీపురుపల్లిలో ఫస్టు ప్లేసుకు తీసుకొచ్చారు. ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, జడ్ పి ఛైర్మన్ కమ్ వైసిపి జిల్లా ప్రెసిడెంట్ చిన్న శ్రీనులిద్దరూ ఈ నియోజకవర్గం నుంచే ప్రాతినిథ్యం వహిస్తున్నారు. బెల్లాన బొత్సకు వ్యతిరేకమయ్యారు.
బొత్సపై యువకుడు కిమిడి నాగార్జున పోరాటం
ఇక్కడ నాలుగుసార్లు జెండా ఎగరేసిన టీడీపీ… 1999 తర్వాత చతికిలపడింది. మళ్లీ, రాష్ట్రవిభజన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లోనే సైకిల్ పార్టీకి విజయం దక్కింది. అనూహ్యంగా తెరమీదకు వచ్చిన కిమిడి మృణాళిని… టీడీపీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019 వచ్చేసరికి.. ఆమె స్థానంలో కుమారుడు కిమిడి నాగార్జునను బరిలో దింపిన టీడీపీకి… వైసీపీ తరపున బరిలో నిలిచిన బొత్స చేతిలో ఓటమి తప్పలేదు. ఓడినా సరే, నియోజకవర్గంలోనే ఉంటూ వచ్చేసారైనా విక్టరీ కొట్టాలనే ప్రయత్నంలో ఉన్నారు నాగార్జున. వ్యక్తిగత వైరమేమీ లేకపోయినా.. టీడీపీ ఇంచార్జ్‌గా ఉంటూ ప్రత్యర్థి బొత్సతో సై అంటే సై అంటున్నారు.
వచ్చే ఎన్నికల్లో నాగార్జున వర్సెస్ బొత్స కుమారుడు ?
వచ్చేసారి బొత్స సత్యనారాయణ ప్లేసులో… ఆయన కుమారుడు సందీప్ పోటీచేస్తారనే ప్రచారం జరుగుతోంది. తాను ఎంపీగా పోటీచేసి.. వారసుణ్ని అసెంబ్లీ బరిలో నిలపాలని ఈ సీనియర్ నేత ఆలోచిస్తున్నట్టు సమాచారం. అయితే, ఇప్పట్లో వారసులకు నో ఛాన్స్ అంటూ… కొన్నాళ్లక్రితమే సీఎం జగన్ కుండబద్ధలు కొట్టేశారు కాబట్టి, బొత్స ప్లాన్ వర్కవుట్ అవుతుందా? అన్నదే ఇప్పుడు ఆసక్తికరాంశం. ఒకవేళ సీఎం జగన్ ఓకే అంటే మాత్రం.. వచ్చేసారి చీపురుపల్లిలో యువనాయకుల మధ్యే పోరు ఉండే అవకాశం ఉంది. అదే జరిగితే అటు టీడీపీ నుంచి నాగార్జున.. ఇటు వైసీపీ నుంచి సందీప్ పోటీ చేస్తే రాజకీయం కీలకంగా మారుతుంది.