ఆంధ్రప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీపై ఓ రకమైన దుష్ప్రచారాన్ని చేయడంలో రెండు ప్రాంతీయ పార్టీలు ఎప్పుడూ ఒకే రకమైన స్ట్రాటజీని పాటిస్తూ ఉంటాయి. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీతో అంటగట్టేస్తూ ఉంటారు. ఆ పార్టీకి బీజేపీ విపరీతంగా సహకరిస్తుందని ప్రచారం చేస్తారు. ఆ రెండు పార్టీలు ఒకటేనని ప్రచారం చేస్తారు. చివరికి ఓటింగ్ దగ్గరకు వచ్చే సరికి బీజేపీ ఓటర్లు కూడా కన్ప్యూజ్ కు గురై.. ఆ పార్టీ, బీజేపీ ఒక్కటే కదా.. ఆ పార్టీకి ఓటు వేస్తే బెటరే కదా అనుకునే పరిస్థితి తెస్తున్నారు. ఇలా ఓట్లు లేకుండా చేసి.. తర్వాత తమ రాజకీయం చేస్తున్నారు.
కేంద్రం సహకరిస్తున్నది ప్రభుత్వానికే !
కేంద్ర ప్రభత్వం వైరు.. బీజేపీ వేరు. బీజేపీ రాజకీయ పార్టీ. ఆ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. అంత మాత్రాన బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వ అధికారాన్ని దుర్వినియోగం చేస్తుందా ? అలాంటి చాన్స్ లేదు. రాజ్యాంగంలో రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం మధ్య అధికారాల విభజన స్పష్టంగా ఉంది. ఆ మేరకు కేంద్రం సహకరిస్తుంది. అంతకు మించి ఎలాంటి అదనపు ప్రయోజనాలు చట్ట విరుద్ధంగా కేంద్రం.. ఏపీ ప్రభుత్వానికి సాయం చేయడం లేదు. ఇక్కడ పూర్తి స్థాయిలో రాష్ట్ర, కేంద్ర సంబంధాలు మత్రమే కీలకం.
వైసీపీపై నిరంతరం బీజేపీ పోరాటం !
పార్టీలు రాష్ట్ర స్థాయి యూనిట్ల ద్వారానే పోరాటాలు చేస్తుంది. ఏపీలో బీజేపీ వైసీపీ ప్రభుత్వంపై పోరాడటం లేదనే అభిప్రాయాన్ని పెంచడానికి మీడియా ప్రయత్నించింది కానీ..శక్తికి మించి పోరాటం చేసింది బీజేపీనే. ప్రజా పోరు సభలు గల్లీ గల్లీలో నిర్వహించింది. చార్జిషీట్ల ఉద్యమంలో ప్రజల్ని భాగస్వామ్యం చేశారు. ఇంకా చెప్పాలంటే.. వారికి ఉన్న క్యాడర్, బలానికి వంద రెట్లకుపైగా శక్తితో పోరాడుతున్నారు. ప్రజల మద్దతు పొందుతున్నారు. టీడీపీ నేతలు అనేక మంది వైసీపీతో కుమ్మక్కయ్యారని.. వ్యాపార ప్రయోజనాలు నెరవేర్చుకున్నారన్న ప్రచారం జరిగుతోంది.. కానీ ఒక్క బీజేపీ నేత అయినా వైసీపీ నుంచి అలాంటి ప్రయోజనాలు పొందారని ఎవరయినా నిరూపించగలరా ? ఎవరైనా అలాంటి ఆరోపణలను ఆధారాలతో చేయగలరా ? చాన్సే లేదు. ఎందుకంటే ఏపీ బీజేపీలో ఉన్న వారంతా కొట్లాడి పోరాడేవారే కానీ.. వ్యాపారస్తులు కాదు.
మీడియా బలంతో దుష్ప్రచారం చేసినా ప్రజలు తెలుసుకుంటారు !
బీజేపీ, వైసీపీ ఒకటే అనే ముద్ర వేయడానికి రాజకీయ పార్టీలు మీడియా, సోషల్ మీడియా బలాన్ని వాడుకుంటున్నాయి. కానీ ప్రజలు ప్రతీ సారి మోసపోరు కదా. ఈ సారి వారికి నిజం తెలుస్తోంది. బీజేపీ క్షేత్ర స్థాయి పర్యటనల్లో లభిస్తున్న స్పందనే దీనికి సాక్ష్యమని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.