టెక్కలి నియోజకవర్గానికి కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి పేరును కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఖరారు చేయడంతో, మూడు ప్రధాన రాజకీయ పక్షాలకు చెందిన అభ్యర్థులపై స్పష్టత వచ్చింది. వైసిపి నుంచి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, ఎన్డిఎ కూటమి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు, ఇండియా వేదిక నుంచి కాంగ్రెస్ పార్టీ తరుపున కృపారాణి బరిలో నిలవనున్నారు.
ముక్కోణపు పోటీ ఖాయమే !
వైసిపి, టిడిపి అభ్యర్థుల మధ్యే ప్రధానంగా పోటీ ఉంటుందని ఇప్పటివరకు అంతా భావించినా, కాంగ్రెస్ పార్టీ కృపారాణిని పోటీకి నిలపడంతో ముక్కోణపు పోరు నెలకొంది. టిడిపి అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు మూడో పర్యాయం బరిలో దిగుతున్నారు. హ్యాట్రిక్ కొట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. అయితే ప్రభుత్వం నియోజకవర్గాలకు కేటాయించే నిధులతో రోడ్లు, మంచి నీటి పథకాలు నిర్మించడం తప్ప అధికారంలో ఉన్న ఐదేళ్లు, ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఆయన మార్కు అభివృద్ధి పెద్దగా లేదనే చర్చ నియోజకవర్గంలో సాగుతోంది.
పథకాల లబ్దిదారులపై దువ్వాడ ఆశలు
ఎమ్మెల్సీ, వైసిపి అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ కేవలం ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలనే నమ్ముకున్నట్లుగా కనిపిస్తోంది. దానిపై ఆయన ప్రధానంగా దృష్టిసారించి ప్రచారం సాగిస్తున్నారు. వైసిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆఫ్షోర్ అంచనాలను మళ్లీ పెంచి ప్రారంభించినా ఇప్పటికీ పూర్తి కాలేదు. ప్రభుత్వ వ్యతిరేకత ఏమీ ఉండదని పైకి చెప్తున్నా, ఐదేళ్ల పాలనలో కచ్చితంగా కొన్ని తరగతుల్లో వ్యతిరేకత సహజం. ప్రత్యేకించి సిపిఎస్ విషయంలో ప్రభుత్వం మాట మార్చడం, అంగన్వాడీలపై నిరంకుశంగా వ్యవహరించడం వంటి చర్యలు, విద్యుత్ ఛార్జీల పెంపు, రోడ్ల పరిస్థితి దారుణంగా ఉండటం వంటి చర్యలతో ఓటు బ్యాంకుకు గండి పడే అవకాశం కనిపిస్తోంది
కిల్లి కృపారాణి ఎవరి ఓట్లును చీలుస్తారు ?
కృపారాణి ఎవరి కాళింగ వర్గానికి చెందిన వారు. వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ కూడా అదే వర్గానికి చెందిన వారు. వారి మధ్య ఓట్లు చీలిపోయి అచ్చెన్నాయుడు కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు. గత రెండు ఎన్నికల్లో యాభై శాతానికిపైగా ఓట్లుతెచ్చుకున్న అచ్చెన్నాయుడు ఈ సారి గట్టిపోటీ ఎదుర్కొంటున్న సమయంలో ముక్కోణపు పోటీ కలసి వస్తుందని అంచనా వేస్తున్నారు.