రేవంతే ముఖ్యమా ? రాహుల్‌పై రగిలిపోతున్న టీ కాంగ్రెస్ సీనియర్లు !

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్లు … పార్టీలో ఎలాంటి బాధ్యతలు లేకపోయినా పార్టీని నడిపించేస్తున్న రాహుల్ గాంధీపై గుర్రుగా ఉన్నారు. ఆయన నిన్నగాక మొన్న పార్టీలోకి వచ్చిన రేవంత్ రెడ్డి మాటలకే ప్రాధాన్యమిస్తున్నారని వారు రగిలిపోతున్నారు. ఢిల్లీలో జరిగిన స్ట్రాటజీ మీటింగ్ లో వారు ఎంత చెప్పినా రాహుల్ గాంధీ పెద్దగా వినిపించుకోలేదు.
పార్టీని ఎప్పటినుంచో నమ్ముకున్న వారిని పట్టించుకోని రాహుల్

తెలంగాణలో పార్టీ టిక్కెట్ల అంశం పూర్తిగా కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ చూసుకుంటుందని.. టిక్కెట్ల అంశంపై ఒక్క నేత కూడా ఎలాంటి ప్రకటన చేయవద్దని రాహుల్ గాంధీ సీనియర్లను ఆదేశించారు. ముఖ్యంగా కోమటిరెడ్డి, ఉత్తమ్ లను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా చెబుతున్నారు. ఈ స్ట్రాటజీ సమావేశంలో చాలా మంది కాంగ్రెస్ నేతలు తమ అసంతృప్తి స్వరాన్ని వినిపించేందుకు ప్రయత్నించారు. అయితే రాహుల్ గాంధీ మాత్రం ఎవర్నీ నోరు మెదపనీయలేదని అంటున్నారు. తమపై పార్టీలో దుష్ప్రచారం చేస్తున్నారని స్ట్రాటజీ మీటింగ్ లో తేల్చుకుంటామని సమావేశానికి వెళ్లే ముందు మీడియాతో కూడా చెప్పిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డి వంటి వారు నోరు మెదపలేకపోయారు. ఓ దశలో జగ్గారెడ్డి ఏదో మాట్లడటానికి ప్రయత్నించడంతో తెలంగాణ పార్టీలో ఎవరెవరు ఏమిటో తనకు పూర్తిగా తెలుసని ఏమీ చెప్పాల్సిన పని లేదని స్పందించినట్లుగా తెలుస్తోంది.

సీనియర్లపై దుష్ప్రచారం చేయిస్తున్న రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ ను నమ్ముకుని ఉన్న అనేక మంది సీనియర్లపై ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. వారంతా కోవర్టులని.. రేపో మాపో పార్టీ మారిపోతారని చెప్పడం ప్రారంభించారు. వ్యక్తిత్వ హనానికి పాల్పడుతున్నారు. చివరికి సహనం నశించి ఉత్తమ్ కుమార్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందులో యూత్ కాంగ్రెస్ వాళ్లే ఈ ప్రచారం చేస్తున్నారని తేలింది. దీని వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారని ఉత్తమ్ రెడ్డి పది పేజీల లేఖను.. హైకమాండ్ కు రాశారు. కానీ ప్రయోజనం లేకపోయింది. ఆయననే మందలించారు రాహుల్ గాంధీ. జగ్గారెడ్డి బాధ కూడా అదే. తమపై దుష్ప్రచారం జరుగుతున్నా పట్టించుకోవడం లేదంటున్నారు.

సీనియర్లను బయటకు పంపేలా చేయాలనుకుంటున్నారా ?

ఇంత కాలం పార్టీని కాపాడుకున్న సీనియర్లను బయటకు పంపాలన్న రేవంత్ రెడ్డి వ్యూహానికి తగ్గట్లుగానే రాహుల్ గాంధీ కూడా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో సీనియర్లు తమ దారి తాము చూసుకోవడం మంచిదన్ననిర్ణయానికి వారు వస్తున్నట్లుగా చెబుతున్నారు. ఎంత కష్టపడినా చివరికి తమకు ఇవే అవమానాలు వస్తాయన్న అభిప్రాయంలో వీరున్నట్లుగా చెబుతున్నా రు. అందుకే కొద్ది రోజుల్లో తెలంగాణ కాంగ్రెస్ లో బ్లాస్ట్ ఉంటుందని అంచనా వేస్తున్నారు.