వచ్చే ఎన్నికల్లో నారా లోకేష్ పోటీ చేసే నియోజకవర్గం మంగళగిరిపై వైసీపీ అధినేత ప్రత్యేక దృష్టి పెట్టారు. రెండో సారి లోకేష్‌ను ఓడిస్తే ఆయన రాజకీయ జీవితం ముగిసిపోతందని గట్టి నమ్మకంతో ఉన్నారు. అయితే ఇందు కోసం జగన్ చేస్తున్న ప్రయత్నాలు… ఐ ప్యాక్ టీం చేస్తున్న ప్రయోగాలు మాత్రం ఇదేనా రాజకీయం అనిపించేలా ఉంటున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేను ఉద్దేశపూర్వకంగా అవమానిస్తున్నట్లుగా వ్యవహరిస్తూండటం.. ఆయన వ్యతిరేకులకు పెద్ద పీట వేస్తూండటమే దీనికి కారమం.
ఆళ్ల అనుచరుల్ని తప్పి కొత్త వారికి మంగళగిరిలో పార్టీ పదవులు
మంగళగిరి నియోజకవర్గంలో సగ భాగానికి పైగా ఉండే మంగళగిరి, తాడేపల్లి ఉమ్మడి నగర పార్టీ అధ్యక్షుడుగా తాడేపల్లికి చెందిన మాజీ ఎంపీపీ దొంతిరెడ్డి వేమారెడ్డిని నియమించారు. వేమారెడ్డికి ఆర్కేకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్నాయి. గతంలో మంగళగిరి సీటును ఆశించిన వేమారెడ్డి అది దక్కకపోవటంతో సైలెంట్ అయ్యారు. ఆయనకు మరే పదవి దక్కకుడా ఆర్కే చూశారు. ఎమ్మెల్సీ కూడా రానివ్వలేదు. కొత్తగా పార్టీలో చేరిన మురుగుడు హనుమంతరావుకు ఇప్పించారు. గత ఎన్నికల్లో తన గెలుపునకు సహకరించిలేదని కూడా అప్పట్లో ఆర్కే అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. అలాంటి నేతకు ఆర్కేకు తెలియకుండనే పార్టీ పదవి ఇచ్చేశారు. ఇప్పటి వరకు మంగళగిరి పట్టణపార్టీ అధ్యక్షుడుగా కొనసాగుతున్న మునగాల మల్లేశ్వరరావును, తాడేపల్లి పట్టణ పార్టీ అధ్యక్షులుగా ఉన్న బుర్ర ముక్కు వేణు గోపాలస్వా మిరెడ్డిలను పదవుల నుంచి త ప్పించేశారు. వీరిద్దరు కూడా ఎమ్మెల్యే ఆర్కేకు విధేయులు
ఆర్కే అవసరం లేదనుకుంటున్న వైసీపీ!
ఇటీవల ఆర్కేకు వైసీపీలో పెద్దగా ప్రాధాన్యం దక్కడం లేదు. ఆయన కూడా దూరంగానే ఉంటున్నారు. కుమారుడి పెళ్లికి జగన్ ను ఆహ్వానించలేదని చెబుతున్నారు. పార్టీ సూచించిన కార్యక్రమాలను కూడా నిర్వహించడం లేదు. అప్పటి మంత్రి లోకేష్‌పై విజయం సాధించిన ఆర్కే తనకు జగన్ కేబినెట్లో తప్పనిసరిగా చోటు లభిస్తుందని ఆశించారు. అయితే ఆయనకు తొలి విడత కానీ విస్తరణలో కానీ అవకాశం దక్కలేదు. దీంతో వారిద్దరి మధ్య అగాధం ఏర్పడింది. పార్టీ కార్యక్రమాలు నిర్వహించవలంసిందిగా సూచిం చినా ఏం ముఖం పెట్టుకొని జనం ముందుకు వెళ్ళాలంటూ ఇంటింటికి స్టిక్కర్లు అంటించే కార్యక్రమాన్ని బహిష్కరించారని చెబుతున్నారు. దీంతో ఇక ఆర్కేను పక్కన పెట్టాలని డిసైడ్ చేసుకున్నట్లుగా చెబుతున్నారు.
లోకేష్‌కు పోటీగా బలమైన నేత దొరుకుతారా ?
లోకేష్ పై పోటీ పెట్టాలంటే బలమైన నేత ఉండాలి. గంజి చిరంజీవిని టీడీపీ నుంచి చేర్చుకుని ఆయనకు టిక్కెట్ ఇస్తామని ప్రచారం చేస్తున్నారు. బీసీ నినాదం వినిపిస్తున్నారు. అయితే ఆయన లోకేష్ ను ఎలా తట్టుకుంటారన్న ప్రశ్న వైసీపీలోనే వస్తోంది. ఇంకా బలమైన నేత రావాలని కోరుకుంటన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేను అవమానకరంగా పంపితే.. ఆయన పార్టీకి వ్యతిరేకమవుతారని అప్పుడు గెలుపు క్లిష్టమవుతుందని ఆందోళన చెందుతున్నారు. అయితే అంతా ఐ ప్యాక్ ప్లాన్ ప్రకారం జరుగుతోందని.. లోకేష్ ను ఓడించే అభ్యర్థి ఖచ్చితంగా వస్తారని వైసీపీ శ్రేణులు నమ్మకంతో ఉన్నాయి.