కేసీఆర్‌లో ఇంత భయమా ? – సిట్టింగ్‌ల బెదిరింపులకు లొంగిపోయారా ?

భారత రాష్ట్ర సమితి తరపున పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాలో మెరుపులేం లేవు. కానీ మరకలు పడిన నేతలందరికీ జాబితాలో చోటు దొరికింది. ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉందని ఐ ప్యాక్ టీం సర్వేలు చేసినప్పుడు పార్టీ అంతర్గత సమావేశాల్లో చెప్పుకున్నారు. యాభై మందిని మారుస్తారని లీకులు వచ్చాయి. చివరికి ఏడుగురి విషయంలోనే నిర్ణయం తీసుకున్నారు. నిజానికి ఈ ఏడుగురు కూడా తిరగబడేవారు కాదు.. భారీగా అవినీతికి పాల్పడిన నేతలకు చోటు కల్పించారు. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యేల బెదిరింపులకు కేసీఆర్ భయపడ్డారన్న ప్రచారం జరుగుతోంది.

మైనంపల్లి తిట్టినా టిక్కెట్ ప్రకటన

కేసీఆర్ తెలంగాణ భవన్‌కు రాక మందే ముందే తిరుమలలో ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన హరీష్ రావునే అన్నారు కానీ… టార్గెట్ చేసింది మాత్రం కేసీఆర్ నే అని ఆయన మాటల్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కానీ ఆ తర్వాత చేసిన అభ్యర్థుల జాబితాలో మైనంపల్లి పేరు ఉంది. ఆయన రెండు టిక్కెట్ల కోసం కాంగ్రెస్ తో మాట్లాడుకుని విమర్శలు చేశారని ప్రచారం జోరుగా సాగుతున్నా చర్యలు తీసుకోలేని పరిస్థితి. కేసీఆర్ లో ఈ తీరు గతంలో చూడలేదని.. ఎక్కువ మంది అనుకున్నారు. నిజానికి మొత్తం జాబితా చూస్తే కేసీఆర్ లో ఇంత ఆత్మరక్షణ ధోరణి ఎందుకు అని రాజకీయవర్గాలు సైతం ఆశ్చర్యపోతున్నాయి.

ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత

కనీసం బలమైన వాళ్లు కాదు. వారిని మార్చినా మార్చపోయినా పోయేదేం లేదు. మరి కేసీఆర్ తీవ్ర వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేల విషయంలో ఎందుకు కఠిన నిర్ణయాలు తీసుకోలేకపోయారు . పదేళ్లుగా ఉన్న ఎమ్మెల్యేలపై ప్రజాగ్రహం తీవ్రంగా ఉంటుంది. అందులో డౌట్ లేదు. అందుకే విపక్ష పార్టీలన్నీ దమ్ముంటే సిట్టింగ్‌లను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. వారి సవాల్ స్వీకరించినట్లుగా అయింది కేసీఆర్ పరిస్థితి. గజ్వేల్ లో పోటీ చేస్తానని బీజేపీ నేత ఈటల రాజేందర్ చెబుతున్నారు. అక్కడ ఆయన పర్యటిస్తున్నారు కూడా. సీఆర్ రెండు చోట్ల పోటీ చేయడం అంటే ఓటమి భయం ఆయనలో ఉందని విపక్షాలు ఖచ్చితంగా ప్రచారం చేస్తాయి. ఇలాంటి పరిస్థితి చూస్తే కేసీఆర్ లిస్టులో ఆత్మరక్షణ ధోరణి ప్రస్ఫుటమవుతోంది.

హవ్వ.. మహేందర్ రెడ్డికి ఇప్పుడు మంత్రి పదవా ?

టిక్కెట్టే ఇవ్వలేనని చెబుతున్న మహేందర్ రెడ్డిని మూడు నెలలకు మంత్రిని చేయాలని నిర్ణయించారు కేసీఆర్. కొత్తగా ప్రమాణ స్వీకారం చేసే వారి పదవి కాలం చాలా స్వల్పమే. ఎన్నికలు జరిగి ఫలితాలు వచ్చే వరకూ మాత్రమే పదవిలో ఉంటారు. ఒక వేళ బీఆర్ఎస్ గెలిచినా వారికి మళ్లీ చాన్సిస్తేనే మంత్రులు అవుతారు. లేకపోతే పదవి కోల్పోతారు. నిజానికి మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసినా వారు చేయగలిగిందేమీ ఉండదు. ఎందుకంటే.. ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన తరవాత మంత్రులుగా కూడా చేయడానికి ఏమీ ఉండదు. ఏ నిర్ణయాలూ తీసుకోలేరు. ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తోంది. అయితే మంత్రులుగా మాత్రమే ఉంటారు. పార్టీ మారకుండా కేసీఆర్ ఈ ఆఫర్ ఇచ్చారు. పట్నం మహేందర్ రెడ్డి కీలక నేత. ఆయన పార్టీ నుంచి వెళ్లిపోతే.. ఆయన సోదరుడు కొడంగల్ అభ్యర్థి కూడా వెళ్లిపోతారు. వికారాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ కు గట్టి దెబ్బ తగులుతుంది. అలాగని ఫామ్ హౌస్ కేసులో బీజేపీపై కుట్ర చేసిన పాత్రధారుల్లో ఒకరైన రోహిత్ రెడ్డిని కాదనలేరు. కాదంటే ఆయన మొత్తం బయటపెడతారు. అందుకే.. మహేందర్ రెడ్డికి మంత్రి పదవి ఖరారు చేశారు.

కేసీఆర్ లో ఈ తరహా భయం.. గతంలో ఎప్పుడూ చూడలేదని తెలంగాణ రాజకీయవర్గాలూ ఆశ్చర్యపోతున్నాయి.