విడదల రజనీకి టిక్కెట్ లేనట్లేనా ? చిలుకలూరిపేటలో లావు ?

ఏపీలో యువ మంత్రి విడదల రజనీకి ఈ సారి టిక్కెట్ గల్లంతు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చిలుకలూరిపేటలో ఎన్ని సర్వే సంస్థలో సర్వేలు చేయించినా పాజిటివ్ ఫీడ్ బ్యాక్ రాకపోవడంతో సీఎం జగన్ అక్కడ అభ్యర్థిని మార్చాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి విజ్ఞాన్ వారసుడు.. నర్సరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయులు రేసులో ఉన్నారని చెబుతున్నారు. ఆయన ఇటీవలి కాలంలో సీఎంను కలవలేదు. కానీ సత్తెనపల్లి నుంచి మాజీ ఎమ్మెల్యే యర్రం వెంకటేశ్వరరెడ్డి చేరిక కార్యక్రమం కోసం తాడేపల్లి నుంచి పిలుపు వచ్చింది. దాంతో సీఎం జగన్ కూడా ఆయన అభ్యర్థిత్వం మొగ్గు చూపుతున్నారన్న ప్రచారం జరుగుతోంది.

విడదల రజనీ చుట్టూ వివాదాలు

2019 ఎన్నికలకు ముందు టీడీపీకి గుడ్ బై చెప్పిన విడదల రజిని వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆర్థికంగా, యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉండటంతో.. మర్రి రాజశేఖర్‌ను పక్కనపెట్టి మరీ రజినికి ఎమ్మెల్యే టికెట్ కట్టబెట్టారు వైఎస్ జగన్. అంతేకాదు.. రెండోసారి మంత్రివర్గ విస్తరణలో కీలక శాఖ అయిన వైద్య ఆరోగ్య శాఖకు మంత్రిని కూడా చేశారు జగన్. కానీ ఇలా మంత్రిని చేసిన తర్వాత ఆమె గ్రాఫ్ పడిపోయిందన్న ప్రచారం ఊపందుకుంది. దీనికి కారణం క్యాడర్ కూడా ఆెమెను వ్యతిరేకిస్తూ ఉండటమే.

రజనీపై మూడు మండలాల నేతల తిరుగుబాటు

రానున్న ఎన్నికల్లో రజినికి టికెట్ ఇస్తే తాము సహకరించబోమని మూడు మండలాల నేతలు హైకమాండ్‌కు తేల్చి చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది. కచ్చితంగా చిలకలూరిపేట అభ్యర్థిని మార్చాల్సిందేనని అసమ్మతివర్గం పట్టుబడుతోంది. వీరంతా.. చిలకలూరిపేట టౌన్‌, నాదెండ్ల, యడ్లపాడు మండలాలకు చెందిన నేతలు. విడదల రజినికి మంత్రి పదవి వచ్చిన తర్వాత ఏకపక్ష నిర్ణయాలు ఎక్కువయ్యాయని సొంత పార్టీ నేతల నుంచే ఆరోపణలు వెల్లువెత్తిన సందర్భాలు చాలానే ఉన్నాయి. నియోజకవర్గ స్థాయిలో జరిగే ముఖ్య నాయకుల సమావేశానికి కనీసం మండలాల కీలకంగా వ్యవహరించే నేతలకు ఎలాంటి సమాచారం ఇవ్వట్లేదని అసమ్మతి వర్గం ఆరోపిస్తోంది. ఇలా ఈ మూడు మండల్లాలోనే కాదు దాదాపు నియోజకవర్గం మొత్తమ్మీద ఇవే పరిస్థితులున్నాయని ఇన్‌సైడ్ టాక్ నడుస్తోంది.

సీఎంను పొగుడుతూ తనకే టిక్కెట్ అన్న ఆశలో రజనీ

ఇటీవల చిలకలూరిపేటలో జరిగిన ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమంలో సీఎం జగన్ ఎదుటే మంత్రి రజిని బోరున విలిపించారు. ఆ తర్వాత సీఎంపై ఓ రేంజ్‌లో పొగడ్తల వర్షం కురిపించారు. రజిని కామెంట్స్, బావేద్వేగానికి లోనయ్యారు. ఇదంతా అసమ్మతి వర్గం సమావేశం ఎఫెక్టేనని జగన్ కు తనపై అభిమానం తగ్గకుండా చూసుకోవడమేనని అంటున్నారు. అయితే గెలుపోటములు మాత్రమే చూస్తామని.. అభ్యర్థుల ఎంపికలో మరే ప్రాతిపదిక లేదనిసీఎం చెబుతున్నారు. అందుకే అక్కడ లావు కృష్ణదేవరాయులు అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఆయన కూడా దీనికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే విడదల రజనీపై ఆయనకూ కోపం ఉంది మరి !