ఆ గిరిజన డిప్యూటీ సీఎంకు టిక్కెట్ లేనట్లేనా ? సీఎం సంకేతాలు అవే !

డిప్యూటీ సిఎం రాజన్నదొర రాజకీయ భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి, డిప్యూటీ సిఎం రాజన్నదొర విషయంలో వైసిపి అధినేత, సిఎం జగన్‌ మోహన్‌ రెడ్డి మాటతీరులో స్పష్టమైన తేడా కనిపించింది. కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ శంకుస్థాపన సభలో డిప్యూటీ సీఎం గురించి కనీసం ఒక్క మాట కూడా చెప్పలేదు. నియోజకవర్గ అభివృద్ధికి ఒక్క వరం కూడా ప్రకటించలేదు. సిఎం జగన్‌ మోహన్‌ రెడ్డి మాట్లాడిన సమయంలో డిప్యూటీ సిఎం రాజన్నదొర పక్కనే నిలబడ్డారు.

రాజన్న దొర ప్రస్తావన చేయని సీఎం జగన్

జగన్‌ 35 నిమిషాల ప్రసంగంలో దొర గురించి ప్రస్తావించకపోవడం సరికొత్త చర్చకు తెరలేపింది. మరో ఆరు నెలల్లో ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో సిఎం జగన్‌ డిప్యూటీ సిఎంగా రాజన్నదొర పనితీరు గురించి పల్లెత్తు మాట అనలేదు. 2024లో జరిగే ఎన్నికల్లో వైసిపి అభ్యర్థిగా మళ్లీ రాజన్నదొరని ఆశీర్వదించాలని చెప్పకపోవడం ఆయన రాజకీయ భవిష్యత్తుపై అనుమానాలకు తావిస్తోంది. ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రి బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి పుష్పశ్రీవాణి పేర్లు ఆ జాబితాలో కనిపిస్తున్నాయి. తొలివిడత జాబితాలో చోటు దక్కకపోవడం, నిన్న మొన్నటి సిఎం జగన్‌ సభలో దొర ప్రస్తావన లేకపోవడం వంటి పరిణామాలు రాజన్నదొర భవితవ్యం ఇబ్బందుల్లో పడిందంని చెబుతున్నారు.

సర్వేల్లో ప్రతికూల పవనాలే కారణమా?

వైసిపి అధిష్టానం సొంతంగా కొన్ని , ఇతర సంస్థలతో రానున్న ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు, సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరుపై రహస్యంగా సర్వేలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సర్వేల్లో డిప్యూటీ సిఎం రాజన్నదొరకు ప్రతికూల పవనాలు వీస్తున్నాయనే వాదనలు గుప్పుమన్నాయి. రోజూ స్థానికంగా ఉన్నప్పుడు ఉదయం 11 గంటల తర్వాతే ప్రజలకు అందుబాటులో ఉంటారని, నియోజకవర్గ పార్టీపై నియంత్రణ లేకపోవడం, మండలాలు, పట్టణంలో నాయకుల మధ్య నెలకొన్న గ్రూపు రాజకీయాలను చక్కదిద్దడంలో వైఫల్యం, డిప్యూటీ సిఎం, మంత్రి హోదాలో జిల్లా రాజకీయాలను ప్రభావితం చేసే రీతిలో వ్యవహరించకపోవడం, పూర్తిగా ఉమ్మడి జిల్లా అగ్రనేత కనుసన్నల్లో పని చేస్తుండడం వంటి అంశాలు పార్టీ అంతర్గత సర్వేల్లో ప్రతికూలతకు కారణాలనే చర్చ పార్టీ శ్రేణుల్లో జరుగుతోంది. ప్రధానంగా మున్సిపాలిటీలో పార్టీలో నెలకొన్న గ్రూపు రాజకీయాలు రోజురోజుకూ ముదిరి పాకాన పడుతున్న తీరు పార్టీకి పెద్ద తలనొప్పిగా మారడం కూడా దొర నాయకత్వంపై ప్రభావం చూపే పరిస్థితి కనిపిస్తోంది.

పుష్పశ్రీవాణికి ఆశీస్సులు

ఇటీవల కాలంలో కురుపాం నియోజకవర్గంలో సిఎం జగన్‌ పర్యటించారు. అక్కడ నిర్వహించిన సభలో సిఎం జగన్‌ మాజీ మంత్రి పుష్పశ్రీవాణి గురించి ప్రస్తావించారు. రానున్న ఎన్నికల్లో వైసిపి అభ్యర్థిగా పుష్పశ్రీవాణిని మళ్లీ గెలిపించాలని జగన్‌ కోరారు. కానీ సాలూరు నియోజకవర్గ పరిధిలో జరిగిన గిరిజన యూనివర్సిటీ శంకుస్థాపన సభలో మాత్రం రాజన్నదొర ఊసెత్తని పరిస్థితి కనిపించింది. దీంతో ఆయనకు టిక్కెట్ లేదని దాదాపు ఖరారైందని అంటున్నారు.