భయపడడం కూడా ఆరోగ్యమేనా – ఏం చెబుతున్నారో అర్థమవుతోందా!

హారర్ మూవీస్ చూసి భయపడేవాళ్లు కొందరు..ఎంజాయ్ చేసేవారు కొందరు. ఫీలింగ్ ఏదైనా కానీ హారర్ మూవీస్ చూడడం ఆరోగ్యానికి మంచిదే అంటున్నాయి కొన్ని పరిశోధనలు.

దెయ్యం సినిమాలు చూడడం అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది. ఎలాంటి భయం లేకుండా చూసేవారు కొందు.. పక్కన ఎవరైనా తోడుగా ఉంటే చూసేవారు మరికొందరు.. అమ్మో హారర్ మూవీస్ చూడడం అంటే చాలా భయం అని ఆ వైపే వెళ్లని వాళ్లు ఇంకొందరు. నిజానికి భయానక సినిమాలు చూడటం ఆరోగ్యానికి మంచిదట. ఆశ్చర్యంగా ఉందా? కొన్ని పరిశోధనల్లో హారర్ సినిమాలు చూడటం మంచిదే అని తేలింది. ఇంతకీ ఏం ప్రయోజనం అంటే..

భయానికి కేలరీలు కరుగుతాయి
చాలామంది కేలరీలు తగ్గించుకోవాలని తెగ తాపత్రయపడుతుంటారు. అయితే 90 నిముషాల హారర్ సినిమా చూస్తే ఎలాంటి శారీరక శ్రమ లేకుండా కేలరీలు బర్న్ అవుతాయట. దాదాపుగా 200 కేలరీలు బర్న్ చేయవచ్చంటున్నాయి పరిశోధనలు. సినిమా చూస్తున్నంత సేపు భయపడినా ఆ తర్వాత వారిలో ఆందోళన, గతంలో ఉన్న నిరాశ తగ్గిపోవడంతో పాటూ మానసిక స్థితి మెరుగుపడుతుందట.

రోగనిరోధక శక్తి పెరుగుతుంది
హారర్ సినిమా చూస్తున్నంత సేపు రక్తంలో తెల్ల రక్త కణాలు పెరుగుతాయట. ఇది తక్కువ టైంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. చాలా ఒత్తిడిని ఎదుర్కొనే వారు హారర్ సినిమాలు చూడటం వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. హారర్ సినిమా చూస్తున్నప్పుడు విడుదలయ్యే న్యూరోట్రాన్స్‌మీటర్లు బ్రెయిన్ పనితీరును మెరుపరుస్తాయి.

ఎలాంటి సమస్యనైనా ఎదుర్కోగలరు
హారర్ సినిమాలు చూసేవారు జీవితంలో దేనికీ భయపడరు..దేన్నైనా ఎదుర్కొనగలిగే ధైర్యం వస్తుందట. పట్టుదలతో పాటూ ఎంత పెద్ద సమస్య నుంచి అయినా బయటపడే ఆలోచనను కల్పిస్తాయని పరిశోధనలో వెల్లడైంది. జీవితంలో ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి. వాటికి కొందరు విపరీతంగా భయపడిపోతుంటారు. హారర్ సినిమాలు జీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారా మార్గాలు చూపిస్తాయట.

గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం