పగటిపూట నిద్ర మంచిదేనా – ఎంతసేపు నిద్రపోవాలి!

మారుతున్న జీవన శైలి కారణంగా చాలామంది నిద్ర లేమి సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. దాదాపు 50శాతం మంది రాత్రిపూట నిద్రపోవడం లేదు. దీంతో పగటిపూట ఎంతసేప నిద్రపోయినా అలసిపోయినట్టు కనిపిస్తున్నారు. ఇంకొందరు రాత్రిపూట నిద్రపోయినా కానీ పగటివేళలో ఓ కునుకు తీస్తారు. ఇంతకీ పగటిపూట నిద్ర మంచిదా కాదా?

పగటి పూట నిద్ర మంచిదే..
చాలామంది మధ్యాహ్నం కొద్దిసేపు పడుకుంటే రిఫ్రెష్‌ అవుతారు. పగలు, రాత్రి తేడాలేకుండా పనిచేసే వ్యక్తులకు మధ్యాహ్న నిద్ర మంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. నిద్రలో ఉత్పత్తి అయ్యే సైటోకిన్స్ అనే ప్రొటీన్ వల్ల… కాసేపు నిద్రపోయి లేస్తే మళ్లీ శరీరం శక్తిని పుంజుకుంటుంది. ఒత్తిడి తగ్గి పూర్తిగా రిఫ్రెష్ అవుతారు. అనారోగ్యానికి గురైనప్పుడు మధ్యాహ్నం నిద్రపోతే తొందరగా కోలుకుంటారని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇంకా పగటి పూట నిద్ర జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది, గుండెను ఆరోగ్యంగా ఉంచుతుందని కొన్ని పరిశోధనలు వెల్లడించాయి.

అరగంట కన్నా ఎక్కువ సేపు వద్దు
పగటిపూట నిద్ర మంచిదే అని చెబుతున్న కొన్ని అధ్యయనాలు 30 నిమిషాల కంటే ఎక్కువ సమయం పాటు కునుకు తీసినా ప్రమాదమే అని హెచ్చరిస్తున్నాయి. మధ్యాహ్నం పూట గంటలతరబడి నిద్రపోయేవారు గుండె జబ్బులు, మధుమేహం బారిన పడే ప్రమాదం ఉందంటున్నారు. అందుకే 30 నిమిషాల కంటే తక్కువ సేపు మధ్యాహ్నం కునుకు తీసే వారిలో బీపీ పెరిగే ప్రమాదం తక్కువగా ఉంటుంది. అరగంట కన్నా ఎక్కువ సేపు నిద్రపోయేవారు తొందరగా బరువు పెరిగే ప్రమాదం ఉందని..ఫలితంగా బీపీ, షుగర్ లెవల్స్ పెరిగిపోతాయని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. మరీ ముఖ్యంగా మధ్యాహ్న నిద్ర గంటకన్నా ఎక్కువ ఉంటే ఊబకాయం, బద్దకం పెరుగుతాయి.

రాత్రిపూట సరైన నిద్ర అవసరం
మధ్యాహ్నం గంటలతరబడి నిద్రపోవాలన్న ఫీలింగ్ నుంచి బయటపడాలంటే రాత్రివేళ సరైన నిద్ర అవసరం. అర్థరాత్రి వరకూ ఫోన్లు, టీవీలతో సమయం గడిపేసి లేటుగా నిద్రపోతే ఆ ప్రభావం రోజంతా మీపై ఉంటుంది. పగటిపూట ఎంతసేపు నిద్రపోయినా ఆ అలసట తీరినట్టు అనిపించదు. అందుకే నిద్రపోయేందుకు బెడ్ రూమ్ కి వెళ్లిన తర్వాత కళ్లుమూసుకుని శ్వాశపై దృష్టి సారిస్తే శరీరం రిలాక్సై తొందరగా నిద్రలోకి జారుకుంటారని నిపుణులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా రాత్రిపూట భోజనం చేసిన తర్వాత నుంచి ఫోన్లు, టీవీలకు దూరంగా ఉండాలి.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం…