దేశంలోని రాజకీయ పార్టీలు రెండు ప్రధాన కూటములుగా ఏర్పడ్డాయి. బీఆర్ఎస్, జేడీయూ సహా పది పదకొండు పార్టీలు మినహా మిగతావన్నీ ఏదోక కూటమిలో చేరిపోయాయి. ఒక రోజు రెండు కూటముల మీటింగు తాలూకు ఊపు తగ్గిన తర్వాత రెండు వర్గాలు ఇప్పుడు బలాబలాలు లెక్క గడుతున్నాయి.
నిర్ణయాత్మక విజయం ఎంతమందికి…
50 శాతం ఓట్లు సాధించి గెలిచిన లోక్ సభ సభ్యులు ఎంతమంది. ప్రధాని మోదీ కూడా యాభై శాతం ఓట్ షేర్ గురించే మాట్లాడుతున్నారు. ఆ లెక్కన చూస్తే యాభై శాతం ఓట్ షేర్ తో ఎన్డీయే భాగస్వాములు 241 సీట్లు గెలుచుకున్నారు. కొత్తగా ఏర్పాటైన ఇండియా కూటమి పార్టీలు కేవలం 68 స్థానాల్లో గెలిచాయి. 70 శాతం కంటే ఎక్కువ ఓట్లుతో గెలిచిన వారిలో ఎన్డీయేకు ఐదుగురు అభ్యర్థులున్నారని చెప్పక తప్పదు.ఆ విషయంలో ఇండియా కాస్త మెరుగ్గా ఉంది. వారికి ఆ ఖాతాలో తొమ్మిది స్థానాలు దక్కాయి.
డిపాజిట్లు కోల్పోయిన ఇండియా అభ్యర్థులు
ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోవడం పరువు సమస్యగా పరిగణించాలి. 16.66 శాతం కంటే తక్కువ ఓట్లు వస్తే డిపాజిట్ కోల్పోయినట్లు లెక్కగడతారు. ఇండియా కూటమిలో 422 మంది అభ్యర్థులు అలా డిపాజిట్ కోల్పోయి ఉన్నారు. ఎన్డీయేలో కూడా 130 మందికి డిపాజిట్ దక్కలేదు. గట్టి పోటీ అంటే రెండు శాతం కంటే తక్కువ ఓట్లు సాధించిన వారి లెక్క చూస్తే రెండు కూటముల మధ్య నువ్వా – నేనా అన్నట్లుగానే పరిస్థితి ఉంది. రెండు శాతం కంటే తక్కువ ఓట్ల మెజార్టీతో గెలిచిన వారు ఎన్డీయేలో పది మంది ఉంటే, ఇండియా కూటమిలో తొమ్మిది మంది అభ్యర్థులున్నారు. ఐదు శాతం కంటే తక్కువ మెజార్టీ సాధించి వారి గణాంకాలు తీస్తే ఎన్డీయేలో 24 మంది ఉంటే, ఇండియా కూటమిలో 15 మంది ఉన్నట్లు 2019 ఎన్నికల ఫలితాలు చెబుతున్నాయి.
యువతకు ఎన్డీయే అవకాశాలు
మహిళలకు అవకాశాలు కల్పించడంలో రెండు కూటములు తమ పరిస్థితిని మెరుగు పరుచుకోవాల్సి ఉంది. ఎన్డీయేలో 11.09 శాతం మహిళా అభ్యర్థులుంటే, ఇండియా కూటమిలో 13.24 శాతం మంది ఉన్నారు. గెలిచిన లెక్కలు చూస్తే ఎన్డీయేలో 13.51 శాతం మంది మహిళలు విజయం సాధించగా, ఇండియా కూటమిలో 13.28 శాతం మంది గెలిచారు. తక్కువ వయసు ఉన్న వారికి ఎక్కువ టికెట్లు ఇవ్వడంలో ఎన్డీయే ముందుందనే చెప్పాలి. 70 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న అభ్యర్థులు ఎన్డీయేలో తక్కువ మంది ఉంటే ఆ సంఖ్య ఇండియా కూటమిలో కాస్త ఎక్కువగానే ఉంది. ఇండియా కటమిలో 70 ఏళ్లు దాటిన అభ్యర్థులు 8.87 శాతం ఉంటే.. ఎన్డీయేలో అది 2.56 శాతం మాత్రమే ఉంది. ఈ క్రమంలో ఆన్ని వయసులు, అన్ని వర్గాలకు అవకాశాలివ్వడం ద్వారా ఎన్డీయే తన విజయవాశాలను మెరుగుపరుచుకుంది. 2024లో కూడా అంతకన్నా మెరుగైన పంథాను పాటిస్తామని బీజేపీ పెద్దలు చెబుతున్నారు..