ఒడిశా ముఖ్యమంత్రిగా నవీన్ పట్నాయక్ రెండున్నన దశాబ్దాలుగా కొనసాగుతున్నారు.సుపరిపాలన అందించే నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. గిరిజనులు, భూమి పుత్రులు ఎక్కువగా ఉండే రాష్ట్రంలో అందరికీ అవకాశాలు కల్పిస్తారని, సంక్షేమం – అభివృద్ధి బాగానే జరుగుతుందని విశ్లేషణలు వినిపిస్తాయి. అయితే విద్యాధికుడైనప్పటికీ అవివాహితుడైన నవీన్ పట్నాయక్ కు వారసులు లేరు. తన రాజకీయ వారసత్వం ఎవరి చేతిలో పెడతారో ఇంతవరకు చెప్పలేదు. దీనిపై అనేక రకమైన కథనాలు వినిపిస్తుండగానే ఇప్పుడు జరిగిన ఒక సంఘటన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పేదిగా ఉంది.
పార్టీలో చేరిన మాజీ ఐఎఎస్ పాండ్యన్
అధికార వర్గాల్లో ముఖ్యమంత్రి పట్నాయక్ కు అత్యంత సన్నిహితుడిగా భావించే మాజీ ఏఎఎస్ అధికారి వీ.కార్తికేయన్ పాండ్యన్ ఇప్పుడు బిజు జనతా దళ్ లో చేరారు. 2011 నుంచి ఆయన ముఖ్యమంత్రికి ప్రైవేటు సెక్రటరీగా ఉన్నారు.సమర్థ పరిపాలకుడిగా పేరు పొందిన పాండ్యన్ ముఖ్యమంత్రి అభిమానాన్ని పొంది చాలా రోజులైంది. ఈ ఏడాది అక్టోబరు 23న పాండ్యన్ స్వచ్ఛంద పదవీ విరమణ పొందారు. వెంటనే ఆయనకు ట్రాన్స్ ఫార్మల్ ఇనిషియేటివ్ (5టీ) పేరుతో ఒక నామినేటెడ్ పదవి కట్టబెట్టారు. పైగా కేబినెట్ ర్యాంక్ కూడా ప్రకటించారు. నిన్న ఆయన లాంఛనంగా బీజేడీలో చేరారు. దానితో పట్నాయక్ వారసుడు ఎవరన్న చర్చకు తెరపడినట్లేనని, ఆయన తర్వాత పాండ్యనేనని ఒడిశా రాజకీయ పరిణామాలను నిశితంగా పరిశీలించే వారు చెబుతున్నాయి.
పాండ్యన్ రాజ్యాంగేతర శక్తిగా మారారా..?
పాండ్యన్ ను పార్టీలో చేర్చుకోవడం పట్ల విపక్ష కాంగ్రెస్, బీజేపీ అభ్యంతరం చెప్పాయి. చాలారోజుగా పాండ్యన్ పై విపక్షాలు కారాలు మిరియాలు నూరుతున్నాయి. సీఎం పట్నాయక్ తన ప్రభుత్వాన్ని పాండ్యన్ కు ఔట్సోరింగ్ కు ఇచ్చారని ఆరోపిస్తున్నాయి.పాండ్యన్ పట్ల పట్నాయక్ చూపుతున్న ప్రేమను వ్యతిరేకిస్తూ వాళ్లు కేంద్రప్రభుత్వానికి కూడా ఫిర్యాదు చేశారు. పైగా నోటీసు పీరియడ్ లేకుండానే పాండ్యన్ వాలంటరీ రిటైర్మెంట్ ను ఎలా ఆమోదిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు.
ఇంతకీ పాండ్యన్ ఎవరూ..
ఆయన 2000 సంవత్సరం బ్యాచ్ ఐఏఎస్ అధికారి. 2002వ సంవత్సరం కాలహందీ జిల్లా ధర్మఘర్ సబ్ కలెక్టర్ గా నియమితులయ్యారు. 2005లో మయూర్భంజ్ జిల్లా కలెక్టర్ గా పదోన్నతి పొందారు. 2007లో గంజాం కలెక్టర్ గా బదలీ అయ్యారు. ముఖ్యమంత్రి కూడా గంజాం జిల్లా వాసి కావడంతో పాండ్యన్ ఆయనకు క్లోజ్ అయ్యారు. 2011లో ముఖ్యమంత్రి కార్యాలయంలో పోస్టింగ్ పొందిన పాండ్యన్ చక్రం తిప్పడం మొదలు పెట్టారు. 2019లో పట్నాయక్ ఐదో సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పాండ్యన్ కు తిరుగులేకుండా పోయింది. ముఖ్యమంత్రికి కీలక సలహాలు ఇవ్వడంతో పాటు పాలనలో ఆయన ప్రాధాన్యం పెరిగింది. ఉద్యోగానికి రాజీనామా చేసి బీజేడీలో చేరొచ్చు కదా అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించేంతగా ముఖ్యమంత్రికి పాండ్యన్ క్లోజ్ అయిపోయారు. ఇప్పుడు పార్టీలో చేరడంతో తర్వాత ఏమి జరుగుతుందనేదే పెద్ద ప్రశ్న అవుతుంది. 2024లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు ఎలాంటి బాధ్యత అప్పగిస్తారో చూడాలి…