ఏపీ లిక్కర్ పాలసీపైనా ఈడీ నజర్ తప్పదా?

లిక్కర్ కేంద్రం దేశంలోని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న దందా చర్చనీయాంశమవుతోంది. ప్రజల్ని అడ్డగోలుగా దోపిడీ చేసి ఆ సొమ్మును సొంత ఖజానాలోకి పంపుకుంటున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో నేతల పాపం పండగా.. ఇప్పుడు చత్తీస్ ఘడ్ స్కాం వెలుగులోకి వచ్చింది. దేశంలో అత్యంత వివాదాస్పదమైన లిక్కర్ పాలసీల్లో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ది కూడా ఒకటి. ఏపీ లిక్కర్ పాలసీపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. వేల కోట్ల స్కాం అని సామాన్యుల్లోనూ చర్చ జరుగుతోంది. ఢిల్లీ గుట్టు బయట పెట్టిన ఈడీ ఇప్పుడు చత్తీస్ ఘడ్‌ వరకూ వచ్చింది. ఇక తర్వాత ఏపీ సంగతి తేలుస్తారా అన్న ఊహాగానాలు వినిపస్తున్నాయి.

చత్తీస్‌ఘడ్త , ఏపీ లిక్కర్ పాలసీలు దాదాపుగా ఒకటే..!

చత్తీస్ ఘడ్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత లిక్కర్ వ్యాపారం స్వరూపం మారిపోయింది. ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో మద్యం వ్యాపారం మొత్తం ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుంది. మొత్తం 800 లిక్కర్ షాపుల ద్వారా సర్కారే రోజు మద్యం విక్రయిస్తుంది. చత్తీడ్ గఢ్ స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ ఆధ్వరంలో మొత్తం వ్యాపారం నిర్వహిస్తారు. పైకి అంతా ప్రభుత్వం కానీ మద్యం వ్యాపారంలో ప్రతీ భాగం ప్రైవేటుతో నిండిపోయి ఉంటుంది. అంటే డిస్టిలరీల్లో మద్యం సేకరణ నుంచి… లైసెన్సులు, ఎక్సైజ్ శాఖ అధికారులు, సీసాల తయారీదారులు, నగదు వసూలు శాఖల వరకు అన్ని చోట్ల ప్రైవేటు ఎజెంట్లు ఉంటారు. మద్యం సేకరణ సమయంలోనే ప్రైవేటు లిక్కర్ వ్యాపారుల నుంచి కేసుకు రూ.150 వరకు కమిషన్ పొందినట్లు ఈడీ చెబుతోంది. అలాగే స్కామ్ స్టర్లు మద్యం తయారు చేయించి.. ప్రభుత్వ లెక్కల్లో చూపించకుండా ప్రభుత్వ మద్యం షాపుల్లో విక్రయించారు. నగదు రూపంలోనే విక్రయాలు జరపడం ద్వారా అవి ప్రభుత్వ రికార్డుల్లోకి వెళ్లకుండా చూసుకున్నాడు. 2019 నుంచి 2022 మధ్య ఇలాంటి అక్రమ సారా వ్యాపారం రాష్ట్రంలోని మొత్తం మద్యం విక్రయాల్లో 40 శాతం వరకు ఉంటుందని ఈడీ గుర్తించింది.

ఏపీ లిక్కర్ పాలసీలోనూ అవే ఆరోపణలు !

ఏపీలోనూ లిక్కర్ పాలసీలో అదే దందా సాగుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. మూడు వేలకుపైగా ఉన్న మద్యం దుకాణాలు. ఆరేడు వందల వరకూ ఉన్న బార్లన్నీ వైసీపీ నేతల కనుసన్నల్లోనే ఉంటాయి. అంతే కాదు అక్కడ కావాల్సిన మద్యం దొరకదు. వారు అమ్మే మద్యం మాత్రమే కొనుగోలు చేయాలి. ప్రముఖ బ్రాండ్లు అసలు ఏపీలో దొరకవు. ఊరూ పేరూ లేని ఎక్కడా వినని.. ఫర్ సేల్ ఇన్ ఏపీ ఓన్లీ బ్రాండ్లు మాత్రమే దొరుకుతాయి. అవన్నీ వైసీపీ నేతల సొంత డిస్టిలరీల్లో తయారైనవనే దానికి గతంలో ఆధారాలు కూడా బయట పడ్డాయి. అదే సమయంలో చత్తీస్ ఘడ్‌లో జరిగినట్లుగా.. సొంత మద్యాన్ని అమ్ముతున్నారు.. అలాగే పూర్తిగా నగదు లావాదేవీలే నిర్వహిస్తున్నారు. ఏపీలో మద్యం దుకాణాల్లో డిజిటల్ పేమెంట్స్ పెట్టాలని విపక్షాలు ఎన్ని సార్లు డిమాండ్ చేసినా పట్టించుకోలేదు. చివరికి కేంద్రం ఆదేశించినా తూతూ మంత్రంగా పది దుకాణాల్లో మాత్రమే డిజిటల్ పేమెంట్లు పెట్టి ప్రచారం చేసుకున్నారు. కానీ ఇప్పటికీ ఏపీ మద్యం దుకాణాల్లో నగదు లావాదేవీలు మాత్రమే జరుగుతున్నాయి.

ఈడీ దృష్టి పెడితే బద్దలైపోయే స్కాం వెలుగులోకి వస్తుందా ?

ఏపీ మద్యం దుకాణాల విషయంలో.. పాలసీల విషయంలో.. ఈడీ దృష్టి పెడితే… వేల కోట్ల స్కాం బద్దలయ్యే అవకాశం ఉందన్న అభిప్రాయం సహజంగానే వస్తుంది. ఇప్పటి వరకూ ఏపీ లిక్కర్ స్కాం గురించి పట్టించుకున్న వారు లేరు. జాతీయ స్థాయిలో ఫిర్యాదులు వెళ్లలేదు. బీజేపీ ప్రజల తరపున వేస్తున్న చార్జిషీట్లలో మద్యం స్కాం.. లిక్కర్ ధరలు.. వంటి అంశాలలపై ఉంటాయి. వీటన్నింటినీ క్రోడీకరించి.. కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తే.. అసలు గుట్టు బయటకు వచ్చే చాన్స్ ఉంది. ఈ దిశగా ఏపీ బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది.