జగన్ సర్కార్‌కు బీజేపీ సహకరిస్తోందా ? అసలు నిజం ఇదిగో

భారతీయ జనతా పార్టీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. ప్రజల కోసమే జగన్ ప్రభుత్వానికి కేంద్రం సహకరిస్తోందని చెప్పిన ఓ మాటను పట్టుకుని కొన్ని వర్గాల మీడియా విస్తృతంగా దుష్ప్రచారం చేస్తోంది. జగన్ ప్రభుత్వానికి బీజేపీ అండగా ఉంటోందన్నట్లుగా చెబుతున్నారు. బీజేపీ విషయంలో ఏపీలో జగన్ కు అంటగట్టి .. వైసీపీతో కలిపేసి విస్తృతంగా ప్రచారం చేయడానికి..ఓ వర్గం మీడియా ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటుంది. కానీ అసలు నిజం మాత్రం వారికీ తెలుసు. కానీ చెప్పరు. భావ వ్యక్తీకరణలో ఉన్న చిన్న చిన్న లోటుపాట్లను తీసుకుని ఓ వర్గం మీడియా విస్తృత ప్రచారం చేస్తోంది. ఫలితంగా బీజేపీ, వైసీపీ అనే ప్రచారం జరుగుతోంది.

వైసీపీకి సహకరిస్తున్నామని సోము వీర్రాజు చెప్పారా ?

బీజేపీ వైసీపీకి సహకరిస్తోందని సోము వీర్రాజు ఒక్క మాట కూడా చెప్పలేదు. ఆయన చెప్పింది.. కేంద్రం.. .రాష్ట్రానికి సహకరిస్తోందనే. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి కోసం. ప్రజలకు సంక్షేమ పథకాలు అందడం కోసం.. ఇతర అంశాలు అంటే పారిశ్రామికసంస్థలు.. జాతీయ రహదారులు.. అభివృద్ధిపనుల విషయంలో సహకిరిస్తోందని చెప్పారు కానీ..రాజకీయంగా సహకరించామని చెప్పలేదు. కానీ మీడియా మాత్రం అసలు ప్రభుత్వానికి రాజకీయాలకు అంట గట్టేసి.. సోము వీర్రాజు వ్యాఖ్యలకు విపరీత అర్థాలు తీసేసి విస్తృత ప్రచారం చేస్తున్నారు. వైసీపీ, బీజేపీ ఒకటే అంటున్నారు.

రాజ్యాంగాన్ని ఉల్లంఘించాలని కోరుకుంటున్నారా ?

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి రాజ్యాంగంలో కొన్ని స్పష్టమైన అంశాలు ఉంటాయి. కేంద్రం .. రాష్ట్రాల విషయంలో కొన్ని బాధ్యతలు నిర్వర్తించాలి. నిధులను సమానంగా పంచాలి. రాజ్యాంగం ప్రకారం వాటికి ఇచ్చేవి ఇవ్వాలి. కేంద్రం అలాంటి బాధ్యతల్ని చాలా స్పష్టంగా నిర్వర్తిస్తోంది. అసలు నిధులన్నీ ఆపేయాలన్నట్లుగా ఏపీలో ఇతర పార్టీలు.. నేతల తీరు ఉంది. చట్టం ప్రకారం ఇవ్వాల్సిన రుణ పరిమితుల మేరకు రుణాలు ఇస్తారు. అసలు అప్పే ఇవ్వకుండా ఆపేస్తే ఏమవుతుంది. రాష్ట్రం దివాలా తీస్తుంది. అప్పుడు ఎవరికి నష్టం జరుగుతుంది. ప్రజలకు కాదా ? ప్రభుత్వం దివాలా తీసిందంటే.. మొదట తీవ్రంగా నష్టపోయేది ప్రజలు. అలాంటి పరిస్థితి ఉద్దేశపూర్వంగా తీసుకు రాకపోతే బీజేపీ వైసీపీకి సహకరిస్తున్నట్లేనా ? బీజేపీ వైసీపీ ఒకటే అని అర్థమా ?. సోము వీర్రాజు చెప్పింది కూడా ఇదే. ఆయన ప్రజల కోసం సహకరిస్తున్నామంటే.. రాజ్యాంగ పరంగా విధులు నిర్వహిస్తున్నామనే కానీ.. వైసీపీ చేసే అడ్డగోలు పనులకు సహకరిస్తున్నామని చెప్పడం కాదు.

వైసీపీది ప్రజా కంఠక పాలన.. బీజేపీ పోరాటంలో తగ్గేది లేదు !

భారతీయ జనతా పార్టీ ఆంధ్ర నేతలు ప్రభుత్వంపై పోరాటంలో ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. వైసీపీతో కుమ్మక్కయ్యారని కొంతమందిపై ప్రచారం చేస్తూ ఉంటారు. కానీ వారిలో ఎవరైనా సరే.. ఏపీ ప్రభుత్వం వద్ద.. వైసీపీ వద్ద ఫలానా ప్రయోజనం పొందారని ఆరోపించరు. అలాంటి చాన్సే లేదు. ఎందుకంటే బీజేపీ నేతలు.. ఏపీ ప్రభుత్వం దగ్గర కానీ ఆ పార్టీ నేతల వద్ద కానీ ఎలాంటి పనులు చేయించుకోరు.. ఆశించరు. మరి ఆ ప్రభుత్వంపై బీజేపీ ఎందుకు ఆపేక్ష చూపుతుంది. అంతా తప్పుడు ప్రచారం చేసి బీజేపీ ఎదగకుండా చేసే కుట్రనే.

రెండు ప్రాంతీయ పార్టీలు కలిసి ఆడుతున్న కుట్ర ఇది !

ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ కేంద్రంలో బీజేపీతో సన్నిహితంగా ఉంటుంది. రాష్ట్రంలో తాము, బీజేపీ ఒకటేనని చెప్పుకుంటుంది. ప్రతిపక్షంలో ఉన్న పార్టీ కూడా బీజేపీపై ఎలాంటి పోరాటం చేయదు. రెండు పార్టీలు తాము బీజేపీకి దగ్గరే అని ప్రచారం చేసుకుంటూ ఉంటాయి. తమలో ఎవరికి సీట్లు వచ్చినా ఢిల్లీలో బీజేపీకే అనే అభిప్రాయం కల్పిస్తారు. ఈ రెండు పార్టీలు కుట్ర పూరితంగా .. బీజేపీ మరో ప్రత్యామ్నాయంగా ఎదగకుండా చేస్తున్న కుట్ర ఇది. ఈ కుట్రల్ని చేధించడానికి బీజేపీ నేతలు చేసే ప్రయత్నాలు ఫలించిన రోజున. ప్రాంతీయ పార్టీలు తట్టాబుట్టా సర్దుకోవాల్సి వస్తుంది.