రాజస్థాన్ ముఖ్యమంత్రి కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాట్ పీకల్లోతు కష్టాల్లో చిక్కుకున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే పేపర్ లీకేజీ సహా పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వేళ ఎన్నికల అఫిడవిట్ విషయంలోనూ ఆయనకు కష్టాలు తప్పేలా లేవు. అది కూడా స్వయంకృతంగానే భావించాల్సి ఉంటుంది..
క్రిమినల్ కేసులను దాచిపెట్టి…
అశోక్ గెహ్లాట్ పై ఎన్నికల సంఘంలో తాజాగా ఒక ఫిర్యాదు నమోదైంది. సదర్పురా అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న ఆయన ఎన్నికల అఫిడవిట్లో పొందు పరచకుండా రెండు క్రిమినల్ కేసుల వ్యవహరాన్ని దాటి పెట్టారని ఆరోపణలు వచ్చాయి. నిజానికి ఆయన నామినేషన్ పత్రాల్లో ఎలాంటి లోపాలు లేవని రిటర్నింగ్ అధికారి సంజయ్ కుమార్ బాసు ధృవపరిచారు. అయితే తప్పడు అఫిడవిట్ సమర్పించారని మాత్రం ఫిర్యాదు అందింది..
రెండు పెండింగ్ కేసుల వ్యవహారం…
జైపూర్ కు చెందిన పవన్ పారేఖ్ అనే వ్యక్తి కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి సహా పలువురు అధికారులకు అశోక్ గెహ్లాట్ పై ఆన్ లైన్లో ఫిర్యాదు చేశారు. రెండు క్రిమినల్ కేసుల వ్యవహారాన్ని సీఎం దాచి పెట్టడం ఫోర్జరీ కిందకే వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. 2015 సెప్టెంబరు 8న జైపూర్ లోని గాంధీ నగర్ పోలీస్ స్టేషన్లో గెహ్లాట్ పై నమోదైన ఎఫ్ఐఆర్ వివరాలను అఫిడవిట్లో పొందుపరచలేదన్నది తొలి ఆరోపణ. దీనికి సంబంధించి 2015 నవంబరు 21 దర్యాప్తు నివేదిక దాఖలైందని, ఈ నెల 24న గెహ్లాట్ కోర్టులో హాజరు కావాల్సి ఉందని ఫిర్యాదుదారు వివరాలు వెల్లడించారు. దొమ్మికి సంబంధించిన కేసు అది. భూకబ్జాకు సంబంధించిన మరో కేసును కూడా ముఖ్యమంత్రి తన అఫిడవిట్లో ప్రస్తావించలేదని ఫిర్యాదుదారు ఆరోపిస్తున్నారు. ప్రజాప్రతినిధ్య చట్టంలోని సెక్షన్ 125ఏ ప్రకారం గెహ్లాట్ శిక్షార్హులవుతారని, ఆయన్ను ఎన్నికల్లో పోటీ చేయకుండా నామినేషన్ తిరస్కరించాలని ఫిర్యాదుదారు అభ్యర్థించారు. ఫిర్యాదు వచ్చిన మాట వాస్తవమేనని సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని ఎన్నికల అధికారులు అంటున్నారు.
పార్టీలోనూ కష్టకాలం…
ఎన్నికల వేళ గెహ్లాట్ కు కాంగ్రెస్ పార్టీలోనూ అసమ్మతి పెరిగిపోతోంది. సచిన్ పైలట్ తిరుగుబాటు సందర్భంగా తనకు మద్దతిచ్చిన వారికి, కాంగ్రెస్ అధ్యక్ష పదవి తీసుకోవాలని అధిష్టానం కోరినప్పుడు అడ్డం తిరిగితే సమర్థించిన వారిలో ఎక్కువ మందికి గెహ్లాట్ టికెట్ ఇప్పించుకున్నారు.వారిలో చాలా మంది పట్ల నియోజకవర్గాల్లో వ్యతిరేకత పెరుగుతోందని విజయావకాశాలు లేకపోయినా గెహ్లాట్ వారికి టికెట్ ఇప్పిచారని పార్టీలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. దానితోనే రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఇంకా నిరసనలు కొనసాగిస్తున్నాయి. గ్రూపులుగా విడిపోయి పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. వారిని దారికి తీసుకురావడం గెహ్లాట్ వల్ల కావడం లేదు. ఈ పరిస్థితుల్లోనే ఆయనపై అఫిడవిట్ గోల్ మాల్ చేసినట్లు ఫిర్యాదు అందింది. మరో సమస్య వచ్చి ఆయన నెత్తిన పడింది..