తెలంగాణ కాంగ్రెస్‌లో చేరిక హైప్ అంతా గాలిబుడగేనా ?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నేతల చేరిక సునామీ ఉండబోతోందన్న ప్రచారాన్ని ఉద్ధృతం చేశారు. కానీ ఎవరూ చేరుతున్న దాఖలాలు కనిపించడం లేదు. రాహుల్ గాంధీ అమెరికా నుంచి వచ్చిన తర్వాత చేరికలు ఉటాయని చెబుతున్నారు. కానీ ఆయన అమెరికా నుంచి వచ్చిన తర్వాత కూడా ఎవరూ వారి వైపు చూడటం లేదు. దీంతో అసలు కాంగ్రెస్ కు మీడియాను ఉపయోగిచుకుని హైప్ ఎక్కించుకుని తీరా ఎవరూ చేరకపోయే సరికి… డీలా పడుతున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.

సవాలక్ష కండిషన్లు పెడుతున్న పొంగులేటి , జూపల్లి

తమకు అవసరం లేదని బీఆర్ఎస్ పార్టీ గెంటేసిన పొంగులేటి, జూపల్లిలను చేర్చుకోవడానికి కాంగ్రెస్ నేతలు చేయని ప్రయత్నాలు లేవు. నేరుగా ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీ టీమ్ వచ్చి వారితో చర్చలు జరిపింది. వారి కోరికలేమిటో తెలుసుకుంది. వారు గొంతెమ్మ కోరికలు కోరినట్లుగా తేలింది. మొత్తం తమ జిల్లాలను తమ చేతుల్లో పెట్టాలని వారు కోరుతున్నారు. అయితే ఇప్పటి వరకూ ఉన్న నేతలంతా ఏం చేయాలని.. హైకమాండ్ తల పట్టుకుంది. కొత్తొక వింత.. పాతొక రోత అన్నట్లుగా ఉంటుందని డిమాండ్లన్నింటికీ ఓకే చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది.

ఖమ్మం కాంగ్రెస్ లో ఇప్పటికే చిచ్చు !

పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కాంగ్రెస్ లో చేర్చుకుంటారనే ప్రచారం ఊపందుకునేసరికి.. ఖమ్మంలో కాంగ్రెస్ నేతలు రచ్చ ప్రారంభించారు. అసలు పొంగులేటి ఎవడంటూ రేణుకాచౌదరి తెర మీదకు వచ్చారు. పొంగులేటి రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వస్తే రావొచ్చు కానీ.. టిక్కెట్ల విషయంలో మాత్రం కల్పించుకుంటే ఊరుకునేది లేదని తెగేసి చెబుతన్నారు. ఖమ్మం పార్లమెంట్ సీటు తనదేనని అంటున్నారు. దీంతో ఒకరు వస్తే మరొకరు బయటకు పోయే పరిస్థితి తెలంగాణ కాంగ్రెస్ లో ఉంది.

ఖమ్మంలో బీజేపీ అగ్రనేతల సభలు

జూన్ 15 నుంచి 30 మధ్య పదిహేను రోజుల వ్యవధిలో బీజేపీ అగ్ర నేతలు నరేంద్ర మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా తెలంగాణలో పర్యటించబోతున్నారు. ముఖ్యంగా వీరు ఖమ్మంపై దృష్టి పెట్టారు. అమిత్ షా.. ఖమ్మంలో బహిరంగసభలో గురువారం ప్రసంగించనున్నారు. ఒక రోజు తెలంగాణలోనే ఉండి.. పార్టీ పరిస్థితులపై సమీక్ష చేయనున్నారు. కొత్తగా చేరే నేతలపై దృష్టి పెట్టనున్నారు. ఓ వైపు కాంగ్రెస్ చేరుతారంటూ హడావుడి చేస్తన్నా… చేరుతారో లేదో తెలియదు కానీ.. సైలెంట్ గా తన పని తాను పూర్తి చేసుకోవాలని బీజేపీ అనుకుంటోంది.