ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశంలో శాంతి స్థాపనకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తోంది. ప్రజల్లో స్నేహసంబంధాలు పెంచుతూ, హింసను అరికట్టేందుకు కంకణం కట్టుకుంది. ఉగ్రవాదం, తీవ్రవాదం, అతివాదం అత్యంత ప్రమాదకరమైనవని గుర్తిస్తూ వాటిని అణచివేసేందుకు చర్యలు తీసుకుంటోంది. ఆ దిశగా ప్రజల్లో మార్పు తెచ్చే దిశగా అవసరమైన మౌలిక, సామాజిక వసతులను కల్పించేందుకు ముందుకు వస్తోంది.
ఆర్థిక మూలాలపై చర్యలు తీసుకుంటే ప్రయోజనం
మావోయిస్టులు, ఇతర తీవ్రవాద గ్రూపుల ఆర్థిక మూలాలను పెకిలించి వేసేందుకు కేంద్రం సమగ్ర కార్యాచరణ రూపొందిస్తోందని భారత హోంమంత్రి అమిత్ షా తెలిపారు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చేపట్టిన ఉమ్మడి చర్యలతో ఆ పని సాధ్యమవుతోందని కూడా కేంద్రం ఆశిస్తోంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, జాతీయ భద్రతా సలహాదారు పాల్గొన్న ఢిల్లీ సమావేశంలో మావోయిస్టుల చర్యలు ప్రత్యేకంగా ప్రస్తావనకు వచ్చాయి. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా , మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
రెండేళ్లలో మావోయిస్టు తీవ్రవాదానికి చరమగీతం
వచ్చే రెండేళ్లలో మావోయిస్టుల హింసాకాండ ఆగిపోయే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు అమిత్ షా తెలిపారు. గత రెండేళ్లలో వారి ఆట కట్టించేందుకు అనేక చర్యలు తీసుకున్నామని కేంద్రం అంటోంది. నిజానికి గత నాలుగు దశాబ్దాలతో పోల్చితే 2022లో అత్యంత తక్కువగా మావోయిస్టు హింస నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. పదేళ్లలో మావోయిస్టు హింస 52 శాతం తగ్గింది. మావోయిస్టు దాడుల్లో మరణాల సంఖ్య 69 శాతం తగ్గుదల నమోదు చేసుకుంది. భద్రతా బలగాల మరణాలు 72 శాతం, పౌరుల మరణాలు 68 శాతం తగ్గాయి
ప్రజల్లో మార్పు దిశగా…
మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో అభివృద్దికి కేంద్రం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. మౌలిక వసతులు కల్పిస్తే జనం మావోయిజం వైపుకు వెళ్లే అవకాశాలు పూర్తిగా తగ్గిపోతాయని గుర్తించి. అక్కడ రోడ్ల నిర్మాణం, టెలీకాం సేవలను విస్తత పరుస్తోంది. సామాజిక, ఆర్థిక పరిస్థితులను మెరుగు పరిచే దిశగా స్కిల్ డెవలప్ మెంట్, విద్యు రంగాలకు ఎక్కువ నిధులు కేటాయిస్తోంది. స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్ కింద 14 వేల ప్రాజెక్టులను ప్రారంభించడం ఒక రికార్డుగానే చెప్పుకోవాలి.అందుకోసం రూ. 3,296 కోట్లు కేటాయించగా, ఇప్పటి వరకు 80 శాతం పనులు పూర్తయ్యాయి. మావోయిస్టు దాడులు జరిగే అవకాశం ఉన్న పోలీస్ స్టేషన్లను శత్రు దుర్భేద్యమైన కోటలుగా మార్చేందుకు రూ. 992 కోట్లు కేటాయించారు. గత తొమ్మిదేళ్లలో మోదీ ప్రభుత్వం భద్రతా చర్యలకు చేసే వ్యయం రెట్టింపైంది.