ఇక వాస్తవ రూపంలో పెట్టుబడులు..రాష్ట్రమంతటా పరిశ్రమలు : ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టు గోవింద రెడ్డి

శ్రీసత్యసాయి జిల్లా గుడిపల్లి పారిశ్రామిక పార్కులో ప్లాంట్ విస్తరణ ‘యునైటెడ్ ఇండస్ట్రీస్ ఆటోమేటివ్ ప్లాస్టిక్ ప్రైవేట్ లిమిటెడ్’విస్తరణతో రూ.130 కోట్ల పెట్టుబడులు..760 మందికి ఉపాధి అవకాశాలు కియా అనుబంధ పరిశ్రమ విస్తరణ పనులకు భూమి పూజ చేసిన ఛైర్మన్.

గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నిర్వహణతో రాష్ట్ర పారిశ్రామిక రూపురేఖలు మరో మలుపు తిరగనున్నట్లు ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టు గోవింద రెడ్డి వెల్లడించారు. పారిశ్రామికవేత్తలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయ, సహకారాలతో పెట్టుబడులు వాస్తవరూపంలోకి వస్తున్నాయన్నారు. ఇప్పటివరకూ కోవిడ్ విపత్తు, ఆర్థిక లోటులోనూ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో.. సంక్షేమ పథకాలను ప్రజల ముంగిటకు తీసుకెళ్లడంలో విజయవంతం అయ్యామన్నారు. ఇక రాష్ట్రమంతటా పరిశ్రమల స్థాపన, విస్తరణతో చర్చలు కాస్త ఆచరణ దిశగా ముందడుగు వేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా గుడిపల్లి పారిశ్రామిక పార్కులో కియా అనుబంధ పరిశ్రమ ‘యునైటెడ్ ఇండస్ట్రీస్ ఆటోమేటివ్ ప్లాస్టిక్ ప్రైవేట్ లిమిటెడ్’ విస్తరణ పనులకు సోమవారం ఏపీఐఐసీ ఛైర్మన్ భూమి పూజ నిర్వహించారు. ‘యునైటెడ్ ఇండస్ట్రీస్ ఆటోమేటివ్ ప్లాస్టిక్ ప్రైవేట్ లిమిటెడ్’విస్తరణ పనులు అక్టోబర్ కల్లా పూర్తై ప్లాంట్ అందుబాటులోకి వస్తుందని ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టు గోవింద రెడ్డి స్పష్టం చేశారు. ఈ పరిశ్రమతో మరో రూ.130 కోట్ల పెట్టుబడులు వాస్తవ రూపంలోకి రానున్నట్లు పేర్కొన్నారు. తద్వారా సుమారు 760 మంది యువతకు ఉపాధి లభించనుందని ఆయన తెలిపారు. విస్తరణ పనుల భూమి పూజ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి జిల్లా ఏపీఐఐసి జోనల్ మేనేజర్ మురళీ మోహన్ పాల్గొన్నారు.