విద్య అంటేనే అత్యుత్తమ వ్యాపారంగా మారిపోయింది..
ఇక పరీక్షల విషయానికొస్తే..తెల్లారగానే టీవీల్లో ..1..2..3..4..9..10… టాప్ టెన్ లో ర్యాంకులన్నీ మావే అంటూ హడావుడి మామూలుగా ఉండదు
మరి ఫీజులు కట్టకుండా..పరీక్షలు రాయకుండా చదువు చసాగుతుందా అంటే సాధ్యం కానేకాదు..కానీ మేం చెప్పిన విషయం ఇప్పటిది కాదు అప్పట్లో మహామహులు విద్యను అభ్యసించిన తక్షశిల విశ్వవిద్యాలయం గురించి..
ఇప్పుడంటే ఉన్నత చదువుల కోసం విదేశాల బాటపడుతున్నారు కానీ వందల సంవత్సరాల క్రితం విదేశీయులంతా వచ్చి మన దేశంలో చదువునేర్చుకున్నారు. మన దేశం మీద దాడులు చేసి, మన గ్రంధాలను ఎత్తుకెళ్ళాయి. మన విజ్ఞాన సంపదను దోచుకెళ్లారు. అలాంటి విశ్వవిద్యాలయాల్లో తక్షశిల ముఖ్యమైనది. దాదాపు వెయ్యేళ్ల పాటు ఓ వెలుగు వెలిగింది ఈ యూనివర్శిటీ.
తక్షశిల విద్యాభ్యాసం విభిన్నం
గురుకులాల్లో ప్రాధమిక విద్యాభ్యాసం పూర్తయ్యాక 16 వ ఏట విద్యార్ధులు ఈ విద్యాలయంలోకి ప్రవేశించేవారు. నేటి విద్యతో పోల్చుకుంటే తక్షశిలలో విద్యాభ్యాసం పూర్తి భిన్నంగా ఉండేది…అసలు ఇప్పటి విద్యకు అప్పటి విద్యకు సంబంధమే లేదు. ఈ యూనివర్శిటీలో చేరేందుకు ఎలాంటి అప్లికేషన్లు పెట్టాల్సిన అవసరం లేదు. గురువుగారు నిర్వహించిన ఇంటర్యూలో ఆయన్ని మెప్పిస్తే యూనివర్శిటీలో సీటొచ్చినట్టే. ఒకవేళ గురువుకి నచ్చకపోతే ఎలాంటి రికమండేషన్స్ పనిచేయవు. మీకు నచ్చిన కోర్సులో చేరడం కాదు..మీకు ఏం వచ్చో చూసి దాని ఆధారంగా మీరు చదవాల్సిన సబ్జెక్టు కేటాయిస్తారు. చదువుకి కాలపరిమితి, ఫీజులు ఉండవు..చేరినప్పటి నుంచి వచ్చేవరకూ చదవాల్సిందే. అసలిక్కడ సంవత్సరాలు కొలమానం కాదు. నేర్చుకున్న విద్యే కొలమానం. చదువుకున్నంతకాలం ఉచితభోజనం, ఉచిత వసతి సదుపాయం. ఒక గురువు దగ్గర అభ్యాసం పూర్తయ్యాక మరో గురువు దగ్గరకు వెళ్లి సర్వశాస్త్రాలు అవగాహన చేసుకోవాలి. బోధన పూర్తయ్యాక పరీక్షలు, పట్టాలు, మార్కులు అస్సలు ఉండవు.
తక్షశిలలో అత్యంత ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు…అదే వర్శిటీలో ఆచార్యుడిగా అవకాశం లభిస్తుంది. చాణక్యుడు తక్షశిలలో విద్యనభ్యసించి ఆచార్యుడిగా చేరింది ఇలాగే.
ఫీజులు కట్టించుకోపోతే నిర్వహణ సాధ్యమా
విద్యార్థులకు జ్ఞానాన్ని అందించడమే ఈ విశ్వవిద్యాలయం పరమావధి అయినప్పటకీ నిర్వహణకు డబ్బు ఉండాలి కదా. అయినప్పటికీ విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసేవారు కాదు. నగరంలో ఉండే ధనికులు కొందరు కొంత మొత్తాన్ని తమంతట తాముగా సహాయం చేసేవారు. ఆ ధనంతోనే విశ్వవిద్యాలయం నడిచేది. లాభాపేక్ష లేదు కాబట్టి ఆ కొంత మొత్తంతోనే అద్భుతమైన మేధావులను తయారు చేసింది తక్షశిల యూనివర్శిటీ.
ఎందరో మహానుభావులు చదివిన విశ్వవిద్యాలయం తక్షశిల
ప్రపంచంలోనే గొప్ప విశ్వవిద్యాలయం అయిన తక్షశిలలో ఎందరో ప్రముఖులు విద్యనభ్యసించారు. ఆర్యచాణక్యుడు మొదలు ఆయుర్వేద వైద్యనిధి-ప్రసిద్ధ ఆయుర్వేద గ్రంథం చరకసంహిత రచయిత చరకుడు, ప్రపంచం మొత్తంమీద ఒక భాషకు వ్యాకరణం రాయడం అనే దానిని తన గ్రంథాలతోనే ప్రారంభించిన పాణిని తక్షశిలలో చదువుకున్నవారే. ఇంకా…అశోకుడు, చంద్రగుప్త మౌర్యుడు, విష్ణుశర్మ, బింబిసారుడు, కోసల దేశాధీశుడు ప్రసేనజిత్తు ఈ యూనివర్శిటీలోనే చదువుకున్నారు. అలెగ్జాండర్ భారతదేశ దిగ్విజయ యాత్ర సందర్భంలో తక్షశిల విశ్వవిద్యాలయాన్ని సందర్శించాడు. స్వదేశం తిరిగి వెళ్తునప్పుడు హైందవ మత సంబంధ గ్రంథాలను, పండితులను తన వెంట తీసుకుని వెళ్ళాడని చెబుతారు.
ప్రపంచవారసత్వ కేంద్రంగా గుర్తింపు
వేదాలు, ఉపనిషత్తులు, తత్కశాస్త్రం, సంగీతం, నృత్యం, యుద్ధ తంత్రం, రాజనీతి శాస్త్రం సహా సుమారు 68 అంశాలను బోధించేవారు. ఈ విశ్వవిద్యాలయాన్ని 1980 లో UNESCO ప్రపంచ వారసత్వ కేంద్రంగా గుర్తించింది. ప్రస్తుతం ఈ తక్షశిల విశ్వవిద్యాలయం ఉన్న ప్రదేశం పాకిస్తాన్ లో ఉంది.