న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్.. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటోన్నారు. భారత పరిశ్రమల సమాఖ్య, యూఎస్-ఇండియా బిజినెస్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరయ్యారు. రెండు దేశాలకు చెందిన ప్రతినిధులను కలుసుకున్నారు. వాషింగ్టన్ డీసీలోని పీటర్సన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎకనమిక్స్‌లో ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
ఈ ముఖాముఖిలో నిర్మల సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా, కెనడాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల గురించి ప్రస్తావించారు. దీనికి తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందిన పరిస్థితుల వల్ల తలెత్తిన సంక్లిష్ట పరిస్థితులను భారత్ విజయవంతంగా అధిగమించిందని చెప్పారు. ఇంట్లో విషాద పరిస్థితులు నెలకొన్నప్పటికీ తమ ముందు ఉన్న సవాళ్లను స్వీకరించడం అనేది భారతీయుల లక్షణమని పేర్కొన్నారు.
భారత్‌లో నివసించే ముస్లింలపై దాడులు కొనసాగుతున్నాయని, వారు తీవ్ర వివక్షతకు గురవుతోన్నారంటూ వస్తోన్న వార్తలను నిర్మల సీతారామన్ తోసిపుచ్చారు. ముస్లింల జనాభా వేగంగా పెరగుతోన్న దేశాల్లో భారత్ ప్రపంచంలో రెండో స్థానంలో ఉందని గుర్తు చేశారు. ముస్లింలు వివక్షత, దాడులకు గురవుతుంటే ముస్లింల జనాభా ఎలా పెరుగుతుందని ప్రశ్నించారు. ముస్లింలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జీవిస్తోన్నారని పేర్కొన్నారు.
దీనికి భిన్నమైన పరిస్థితులు పాకిస్తాన్లో నెలకొన్నాయని నిర్మల సీతారామన్ చెప్పారు. అక్కడ నివసించే మైనారిటీల పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోందని, వారి సంఖ్య తగ్గుతోందని అన్నారు. చిన్న చిన్న ఆరోపణల వల్ల మరణశిక్షను సైతం ఎదుర్కొంటోన్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. పాకిస్తాన్లో నివసించే మైనారిటీల (హిందువులు) కంటే భారత్‌లో నివసించే మైనారిటీలు (ముస్లింలు) ఎంతో మెరుగైన జీవితాన్ని గడుపుతున్నారని వ్యాఖ్యానించారు. పాకిస్తాన్లో కూడా ముస్లింల జనాభా పెరుగుదల భారీగా తగ్గుతోందని, దీనికి భిన్నంగా భారత్‌లో వారి సంఖ్య పెరుగుతోందని నిర్మల సీతారామన్ స్పష్టం చేశారు. పూర్తిస్థాయి ఇస్లామిక్ దేశమైన పాకిస్తాన్లో మైనారిటీలైన హిందువులకు రక్షణ ఉండట్లేదని చెప్పారు. దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం ఉందని ఆమె సూచించారు. భారత్‌లో 2014 తరువాత ముస్లింల జనసంఖ్య తగ్గడం గానీ, మరణాలు పెరగడం గానీ జరిగాయా? అని ఎదురు ప్రశ్నలు వేశారు.