పశ్చిమ బెంగాల్ అంటే హింసకు మారుపేరుగా మారుతోంది. తృణమూల్ కాంగ్రెస్ అధికారానికి వచ్చిన తర్వాత ఆ హింస మరింతగా పెరిగింది. అధికారంలో కొనసాగేందుకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తమ పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టి హింసను ప్రేరేపిస్తున్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు ఆమె అన్ని రకాల అడ్డదారులు తొక్కుతున్నారు. హత్యలు చేసినా తప్పులేదు గెలిస్తే చాలన్నట్లుగా ఆమె ప్రవర్తిస్తున్నారు.
పంచాయతీ ఎన్నికల్లో హింస
మూడంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థలో జరిగిన ఎన్నికల్లో రక్తం ఏరులై ప్రవహించింది. ప్రతీ గ్రామంలో హింసాత్మక ఘటనలు జరిగాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకుని తృణమూల్ కార్యకర్తలు హత్యలకు దిగారు. నామినేషన్లు వేయకుండా ప్రత్యర్థులను అడ్డుకున్న ఘటనలు కోకోల్లలు. నామినేషన్ల దశలోనే పదుల సంఖ్యలో హత్యలు జరిగాయి. పోలింగ్ రోజున బ్యాలెట్ పెట్టెలు లాగి కింద పడేయ్యడం, ఎత్తుకెళ్లడం లాంటి ఘటనలు నమోదయ్యాయి.కొన్ని చోట్ల భయంతో పోలింగ్ అధికారులు పారిపోయారు. ప్రత్యర్థులపై దాడులు చేసిన తృణమూల్ కార్యకర్తలు వారి కాళ్లు చేతులు విరగ్గొట్టారు. చివరకు కౌంటింగ్ సమయంలో కూడా ప్రత్యర్థి ఏజెంట్లపై దౌర్జన్యకాండ కొనసాగింది. దీదీ నేతృత్వంలో ప్రజాస్వామ్యం ఖునీ అయ్యిందని విపక్షాలు ఆరోపించాయి..
బాగా పంజుకున్న బీజేపీ..
ఎన్నికల ఫలితాలు తృణమూల్ కాంగ్రెస్ కు అనుకూలంగా మారిన మాట వాస్తవం. మొత్తం 65 వేల వరకు పంచాయతీ స్థానాలకు పోలింగ్ జరిగితే తృణమూల్ 30 వేల వరకు గెలుచుకుంది. అందులో మెజార్టీ స్థానాల్లో దౌర్జన్యకాండ నమోదైంది. ప్రత్యర్థి పార్టీల సానుభూతిపరులు పోలింగ్ కేంద్రాలకు రాకుండా అడ్డుకున్న ఘటనలూ ఉన్నాయి. వచ్చిన వారిని కొట్టి వెనక్కి పంపేశారు. ఎలాంటి హింసకు, ప్రలోభాలకు దిగకుండా ఎన్నికల్లో పాల్గొన్న బీజేపీ 8 వేలకు పైగా పంచాయతీ స్థానాల్లో విజయం సాధించింది. గెలిచిన ప్రతీ చోట భారీ మెజార్టీ సాధించింది. ఈ క్రమంలో సీపీఎం, కాంగ్రెస్ పార్టీలను బీజేపీ బాగా వెనక్కి నెట్టేసింది. ఆ రెండు పార్టీలు కలిపి కూడా 4 వేల 500 స్థానాలు సాధించలేకపోయాయి.
బీజేపీకి పెరిగిన సీట్ల శాతం
గత ఎన్నికలతో పోల్చితే బీజేపీ పరిస్థితి బాగా మెరుగు పడింది.2018 పంచాయతీ ఎన్నికల్లో తృణమూల్ కు 80 శాతం సీట్లు రాగా ఈ సారి అది 68 శాతానికి పడిపోయింది. బీజేపీకి 2018లో 11.2 శాతం సీట్లు వచ్చాయి. ఇప్పుడది 17 శాతానికి పెరిగింది. కొన్ని చోట్ల బీజేపీ అభ్యర్థులను తృణమూల్ గూండాలు ఓటు వేయనివ్వలేదు. బీజేపీకి బలమైన పంచాయతీల్లో కూడా పోటీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. అక్కడ ఎన్నికలు సజావుగా జరిగి ఉంటే బీజేపీ అభ్యర్థులు గెలిచేవారు. అప్పుడు కమలం పార్టీ బలం బాగా పెరిగేది. ఏదేమైనా బెంగాల్ లో అధికారానికి బీజేపీ ఎంతో దూరం లేదన్నది పంచాయతీ ఎన్నికలు నిరూపించాయి .