పెరిగిన ముస్లిం జనాభా..తగ్గిన హిందూ జనం..

దేశంలోని ముస్లింల సంఖ్యపై ఇప్పుడు తీవ్ర చర్చ జరుగుతోంది. ముస్లింల రిజర్వేషన్ ను అమలు చేయనివ్వబోమని బీజేపీ అంటోంది. ఈ దిశగా కొన్ని రాష్ట్రాలపై కూడా బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బీజేపీని ముస్లిం వ్యతిరేకిగా చిత్రీకరించేందుకు చేస్తున్న ప్రయత్నాలను కూడా కమలం పార్టీ తిప్పికొడుతోంది. ముస్లిం సోదరులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని బీజేపీ నేతలు హామీ ఇస్తున్నారు. ఈ క్రమంలో దేశంలో మతాల వారీగా జనాభాపై కూడా లెక్కలు బయట పడుతున్నాయి..

ప్రధాని ఆర్థిక సలహా మండలి అధ్యయనం

ప్రధానమంత్రి కార్యాలయంలో ఉండే ఆర్థిక సలహా మండలి… స్వతంత్రంగా పనిచేస్తుంది. ప్రపంచంలోని వివిధ మతాలతో భారత జనాభాను సరిపోల్చి ఆ విభాగం ఒక అధ్యయనాన్ని ప్రచురించింది. భారత్లో మైనార్టీలను కాపాడటమే కాకుండా వారి పరిపుష్టికి కూడా అవకాశం లభిస్తోందని ఆర్థిక సలహా మండలి తేల్చింది.దేశంలో ముస్లిం జనాభా పెరుగుతుంటే, హిందూ, పార్సీ, జైన్ మతస్తుల సంఖ్య తగ్గుతోందని అధ్యయనం గుర్తించింది.

43 శాతం పెరిగిన ముస్లింలు..

1950 నుంచి 2015 వరకు వేర్వేరు మతాల జనాభాలో వచ్చిన మార్చులను ఆర్థిక సలహా మండలి అధ్యయనం చేసింది. దాని ప్రకారం దేశంలో ముస్లింల జనాభా 43 శాతం పెరిగింది. మెజార్టీ వర్గమైన హిందువుల జనాభా 7.82 శాతం తగ్గింది. 1950లో 84.68 శాతం ఉన్న హిందువులు 2015 నాటికి 78.06 శాతానికి తగ్గారు. దక్షిణాసియాలోని పొరుగుదేశాలైన బంగ్లాదేశ్, పాకిస్థాన్, శ్రీలంక, భూటాన్, అఫ్ఘానిస్థాన్లో మైనార్టీల జనాభా తగ్గుతుంటే.. భారతదేశంలో మాత్రం అది పెరుగుతోందని అధ్యయనం గుర్తించింది. ఇండియాలోని భిన్నత్వంలో ఏకత్వానికి ఇదీ నిదర్శనమని కూడా విశ్లేషిస్తున్నారు.మైనార్టీలకు రాజ్యాంగ హక్కులను కల్పిస్తున్న బహుకొద్ది దేశాల్లో ఇండియా కూడా ఒకటని అధ్యయనం ప్రస్తావించింది.

కాంగ్రెస్ తప్పిదమేనంటున్న గిరిరాజ్ సింగ్..

దేశంలో హిందువుల జనాభా తగ్గిపోవడానికి కాంగ్రెస్ పార్టీ తప్పుడు విధానాలే కారణమని కేంద్రమంత్రి, బెగుసరాయ్ ఎంపీ గిరిరాజ్ సింగ్ ఆరోపించారు. కాంగ్రెస్ పాలనా కాలంలో రోహింగ్యాలను, ఇతర ముస్లింలను దేశంలోకి అనుమతించి వారిని నియంత్రించడంలో విఫలమయ్యారని బీజేపీ ఆగ్రహం చెందింది. భారత దేశాన్ని ఇస్లామిక్ రాజ్యంగా మార్చేందుకు కాంగ్రెస్ ఆ పార్టీ మిత్రపక్షాలు ప్రయత్నిస్తున్నాయని బీజేపీ ప్రధాన ఆరోపణ. వాళ్లకు దేశ సార్వభౌమాధికారంతో పనిలేదని, ఓటు బ్యాంకు రాజకీయాలు చాలని గిరిరాజ్ సింగ్ అన్నారు. దేశంలో క్రైస్తవ జనాభా కూడా ఐదు శాతం పెరిగిందని అధ్యయనం నిగ్గు తేల్చింది. సిక్కుల జనాభా 1.24 శాతం పెరిగింది. బుద్ధుల జనాభా కూడా కొంచెం పెరిగింది. అయితే హిందువులు, జైన్లు, పార్సీలు మాత్రం తగ్గారు.