లోక్ సభ ఎన్నికల వేళ మన ప్రజా ప్రతినిధులు ఏం చేస్తున్నారన్న ప్రశ్న తలెత్తడం సాధారణ విషయమే. సంక్షేమం, అభివృద్ధి రెండు రంగాల్లో వాళ్ల పాత్ర ఏమిటి. వాళ్లకు వచ్చిన నిధులేమిటి… వాటిని వాళ్లు ఎలా వినియోగించారు లాంటి ప్రశ్నలకు సమధానాలు వచ్చినప్పుడే సరైన అభ్యర్థిని ఎన్నుకున్నామన్న సంతోషం సగటు ఓటర్లలో కలుగుతుంది. రేపు ఎవరిని ఎన్నుకోవాలన్న ప్రశ్నకు వారికి సమాధానం లభిస్తుంది. కర్ణాటక రాజధాని బెంగళూరు కొంతవరకు నీటి ఎద్దడితో ఇప్పుడు ఇబ్బంది పడుతున్నప్పటికీ బీజేపీ ఎంపీల చొరవతో నగరానికి మహర్దశ పట్టిందనే చెప్పాలి. బెంగళూరు పొలిటికల్ యాక్షన్ కమిటీ నివేదిక ప్రకాశం ఆ నగరంలోని ముగ్గురు లోక్ సభ సభ్యులు గత ఐదేళ్ల కాలంలో ప్రజల అవసరాలు తీర్చేందుకు రూ. 55.88 కోట్ల రూపాయలు వ్యయం చేశారు…
నిత్యం ప్రజల్లోనే ఉండే ఎంపీలు
బెంగళూరు సౌత్ నియోజకవర్గానికి యువనేత తేజస్వీ సూర్య ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బెంగళూరు సెంట్రల్ కు పీసీ మోహన్, బెంగళూరు నార్త్ కు కేంద్ర మాజీ మంత్రి సదానంద గౌడ ఎంపీలుగా ఉన్నారు. నియోజకవర్గ అభివృద్ధి నిధులు (ఎంపీ లాడ్స్) వినియోగంలో ముగ్గురు ఎంపీలు దేశంలోని ఇతర ప్రాంతాల ప్రతినిధుల కంటే మెరుగ్గా ఉన్నారు. ప్రతీ ఒక్కరికీ ఎంపీ లాడ్స్ కింద ఏటా రూ.5 కోట్లు కేటాయిస్తుండగా, కొవిడ్ సమయంలో మాత్రం నిధుల విడుదలకు ఆటంకం ఏర్పడింది. 2020 ఏప్రిల్ 6 నుంచి 2021 నవంబరు 9 వరకు నిధుల విడుదలను కేంద్రప్రభుత్వం నిలిపేసింది. 2021 నవంబరు 10 నుంచి 2022 మార్చి 31 వరకు ప్రతీ ఎంపీకి రూ.2 కోట్లు కేటాయించారు.
ఎలా వ్యయం చేశారు..
ముగ్గురు ఎంపీలు కలిసి ఐదేళ్ల కాలంలో రూ. 55.88 కోట్లు వ్యయం చేయగా, అందులో ప్రజా మౌలిక సదుపాయాల కోసం రూ. 23.47 కోట్లు (42.67 శాతం), తాగు నీరు – పారిశుద్ధ్యం కోసం 16.03 కోట్లు (29.15 శాతం) విద్యా రంగానికి రూ. 7.27 కోట్లు ( 13.22 శాతం) వ్యయం చేశారు. ఎవరెవరు ఎంతెంత ఖర్చుపెట్టారో స్థూలంగా చెప్పాలంటే మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం తేజస్వీ సూర్య రూ.8.86 కోట్ల రూపాయలు వ్యయం చేశారు. కుటుంబ సంక్షేమ కార్యక్రమాలకు రూ.3.79 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అసెంబ్లీ నియోకవర్గాలైన బసనవగూడిలో పనుల కోసం రూ.4.33 కోట్లు, జయనగర్ అభివృద్ధికి రూ. 4.32 కోట్లు వ్యయమైంది.
పార్లమెంటు సమావేశాల్లోనూ కీలకమే…
బెంగళూరు ప్రాంతానికి చెందిన ముగ్గురు ఎంపీలు పార్లమెంటు సమావేశాల్లోనూ కీలకంగానే వ్యవహరించారు. 17వ లోక్ సభ మొత్తం 273 రోజులు సమావేశమైంది. దేశంలోని అందరు ఎంపీల సగటు హాజరు 79 శాతంగా నిర్ధారించారు. తేజస్వీ సూర్య 212 రోజులు సభకు హాజరయ్యారు. మొత్తం 382 ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టినట్లుగా బెంగళూరు పొలిటికల్ యాక్షన్ కమిటీ నివేదిక వెల్లడించింది. పీసీ మోహన్ 224 రోజులు సభకు హాజరయ్యారు. 189 ప్రశ్నలు అడిగారు. కొంతకాలం కేంద్ర మంత్రిగా పనిచేసిన సదానంద గౌడ వంద రోజులు పార్లమెంటుకు హాజరయ్యారు. కేంద్రమంత్రిగా ఎన్నో డిబేట్స్ లో పాల్గొన్న గౌడ.. ఒక్క ప్రశ్న కూడా అడగలేదని తేలింది. బీజేపీ ఈ సారి ఆయనకు టికెట్ ఇవ్వలేదు…