కర్ణాటకలో ఉచితాల ప్రభావం -కూలీలు దొరక్క అగచాట్లు

బియ్యం ఫ్రీ, బస్సు ప్రయాణం ఫ్రీ, కరెంట్ ఫ్రీ, తాగు నీరు ఫ్రీ.. కూర్చోబెట్టి రూ, 2,000 ఫ్రీ.. అంతా ఫ్రీ..ఫ్రీ.. ఫ్రీ.. ఈ ఫ్రీ జమానా వినడానికి బాగానే ఉన్నా… సరికొత్త సమస్యలు మాత్రం సృష్టిస్తోంది. ఇల్లు కదలకుండా కడుపునిండే అవకాశం రావడంతో పనులు చేసేందుకు కార్మికులు ఇష్టపడటం లేదు. ఇప్పుడు వచ్చేది లేదనో, తర్వాత చూద్దామని చెప్పో..హాయిగా నీడపట్టున ఎంజాయ్ చేస్తున్నారు. కర్ణాటకలో ఈ పరిస్థితి కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది…

కాఫీ తోటల్లో లేబర్ ప్రాబ్లమ్..

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత పథకాలను అమలుకు తెచ్చింది. వాటికోసమే కాంగ్రెస్ కు ఓటేసిన జనం హాయిగా ఇంట్లో పడుకుంటున్నారు. కర్ణాటక రాష్ట్రంలో 30 లక్షల మంది వ్యవసాయాధారిత కార్మికులు ఉండగా. అేందులో ఐదు లక్షల మంది కాఫీ తోటల్లో పనిచేస్తున్నారు.ప్రస్తుత ప్రభుత్వం నెలకు పది కిలోల బియ్యం ఉచితంగా ఇవ్వడంతో పాటు మహిళల ఖాతాలో రూ. 2 వేలు, మహిళలకు ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల కరెంట్ ఫ్రీగా ఇవ్వడంతో కాఫీ ప్లాంటేషన్లలో పనికి వెళ్లేందుకు చాలా మంది ముందుకు రావడం లేదు. అసలే కాఫీ తోటల్లో నైపుణ్యం ఉన్న కార్మికుల కొరత ఉంది. ఇప్పుడది మరింతగా పెరిగింది. ఇదే పరిస్థితి కొనసాగితే తోటను ఎండిపోవడమేనని భారత కాఫీ బోర్డ్ ప్రతినిధులు చెబుతున్నారు.

ఇతర రాష్ట్రాల కార్మికులతో ఇబ్బందులు

స్థానిక కార్మికులు పనికి రావడం ఆపేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారు పని చేసేందుకు అంగీకరిస్తున్నారు. అయితే తోటల్లో పనిచేసే నైపుణ్యం వారికి లేకపోవడంతో పనిలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ చర్యల కారణంగా తాము నిండా మునిగే ప్రమాదం వచ్చి పడిందని కాఫీ ఉత్పత్తిదారుల సంఘం అంటోంది. పోల్ గ్యారెంటీ అమలుకు వచ్చినప్పటి నుంచి కాలాబురాగీ, హసన్ ప్రాంతంలో కార్మికులు చాలా మంది ఇళ్లలో హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు.

డిమాండ్లు పెడుతున్న కార్మికుల

ఒకప్పుడు ఇచ్చిన కూలీ తీసుకుని సంతోషంగా వెళ్లే కార్మికులు ఇప్పుడు నేరుగానే యాజమాన్యాల ముందు డిమాండ్లు పెడుతున్నారు. కనీస వేతనాన్ని రూ. 360 నుంచి రూ. 460కి పెంచాలని వారు కోరుతున్నారు. పైగా ఎనిమిది గంటల పని రూల్స్ ను తప్పకుంటా పాటించాలంటున్నారు. వాటితో పాటు బోనస్, పీఎఫ్ సౌకర్యం కూడా కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఉపాధి హామి పథకం కింద నెలకు రూ. 14 వేల వరకు వేతనం వస్తోందని, తాజా పరిస్థితులతో తమకు కనీసం రూ.20 వేలు రావాలని కొన్ని కార్మిక సంఘాలు కోరుతున్నాయి. ఈ విషయంలో అడ్డం పొడవు వాదించే కార్మిక సంఘాలు కూడా ఉన్నాయి. బియ్యం, కరెంట్ ఇస్తే సరిపోతుందా.. మిగతా ఆర్థిక అంశాల సంగతేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. పిల్లలకు ఫీజులు, ఇంటి ఖర్చులు ఎవరిస్తారని ప్రశ్నిస్తున్నారు. మరి కార్మిక లోకం వేస్తున్న ప్రశ్నలకు సిద్దరామయ్య సమాధానం ఎలా ఉంటుందో చూడాలి. ఎందుకంటే కర్ణాటకలో ఫ్రీ స్కీములకు ఆయనే ఆద్యుడు..