సీజన్ ఏదైనా జీన్స్ వేసుకోవడం అంటే అమ్మాయిలు-అబ్బాయిలకు భలే ఇంట్రెస్ట్. షర్టులు, టీ షర్టులు మార్చి వారం మొత్తం ఒకే జీన్స్ తో గడిపేసేవారూ ఉన్నారు. అయితే ఏ సీజన్లో జీన్స్ వేసుకున్నా పర్వాలేదు కానీ సమ్మర్లో మాత్రం వీటిని బీరువాలోంచి బయటకు తీయకపోవడమే మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు..ఎందుకంటే..
సమ్మర్లో జీన్స్ వద్దు
డెనిమ్…ఇది ఒక రకమైన ఫ్యాబ్రిక్. మందంగా ఉంటుంది. అందుకే ఎండల్లో వీటిని వేసుకుంటే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉన్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. ఎందుకంటే ఈ వస్త్రం వేడిని అధికంగా గ్రహిస్తుంది…గాలిని లోపలకు వెళ్లకుండా అడ్డుకుంటుంది. ఒంటికి పట్టిన చెమటను కూడా ఆరనివ్వదు. అందుకే ఎండలు మండుతున్నంత కాలం జీన్స్ వేసుకోపోవడమే మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు.
అందం కాదు అనారోగ్యం
జీన్స్ కంఫర్ట్ గా ఉండడం, మంచి లుక్స్ ని ఇవ్వడం నిజమే కానీ అది అనారోగ్యానికి కూడా దారితీస్తుందని తెలుసుకోవాలి. వేసవిలో అధికంగా చెమట పట్టడం వల్ల ఆ తడి ఆరిపోయే అవకాశం లేక, ఆ ప్రాంతంలో రింగ్ వార్మ్ ఇన్ఫెక్షన్, ఈస్ట్ ఇన్ఫెక్షన్లు, జననేంద్రియ ప్రాంతంలో దద్దుర్లు వంటివి వచ్చే అవకాశం ఉంది. ఎక్కడైతే ఈ ఫంగస్ ప్రారంభం అవుతుందో, అక్కడ చర్మం రంగు మారిపోతుంది. పొరలు పొరలుగా ఊడిపోతుంది. పగుళ్లు వస్తాయి. దురద, మంట పుట్టడం వంటివి జరుగుతాయి. అలాగే ఎక్కువసేపు టైట్ జీన్స్ వేసుకోవడం వల్ల తొడల్లో రక్త ప్రసరణ ఆగిపోతుంది. పాదాలు ఉబ్బినట్టు అవుతాయి. దుస్తుల వల్ల వచ్చే చర్మ సమస్యను ‘టెక్స్ టైల్ డెర్మటైటిస్’ అని పిలుస్తారు. ఇది కొన్ని రకాల దుస్తుల వల్ల వస్తుంది. వేసవిలో ఇది వచ్చే అవకాశం ఎక్కువ. ముఖ్యంగా ఎగువ తొడ భాగంలో ఇది వస్తాయి. ఎరుపుగా చర్మం మారడం, పొలుసుల్లా రాలిపోవడం వంటివి జరుగుతాయి.
గర్భాశయం ఇన్ఫెక్షన్‌కు గురయ్యే అవకాశం
బిగుతుగా ఉండే జీన్స్ ధరించడం వల్ల చిన్న వయసులోనే గర్భాశయం ఇన్ఫెక్షన్‌కు గురయ్యే అవకాశం ఉంది. ఎక్కువగా టైట్ జీన్స్ వేసుకునే అమ్మాయిలకు పిల్లలు పుట్టే అవకాశం కూడా తగ్గిపోతుందని వైద్యులు చెబుతున్నారు. జీన్స్ వంటి బిగుతైన దుస్తులకు బదులు పలాజో, వైడ్‌లెగ్ ప్యాంట్స్, వదులుగా ఉండే కాటన్ ట్రౌజర్లు.. సెలెక్ట్ చేసుకుంటే మంచిది. ఇవి చెమటను పీల్చుకోవడంతో పాటు గాలి బాగా ఆడుతుంది.
పురుషులకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం
రోజంతా టైట్ జీన్స్ ధరించే పురుషులకు.. టెస్టిక్యులర్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బిగుతుగా ఉండే దుస్తులు ధరించడం వల్ల వృషణాల ఉష్ణోగ్రత పెరుగుతుంది..ఫలితంగా స్పెర్మ్ కౌంట్ తగ్గుతుంది. ఇది క్రమంగా టెస్టిక్యులర్ క్యాన్సర్ ముప్పు పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలంటే వైద్యులను సంప్రదించడమే మంచిది.