నిత్యం విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే ఏం కోరుకున్నా జరుగుతుందా!

విష్ణు సహస్రనామాలను భీష్మపితామహుడు పాండవులకు చేసిన మహోపదేశం. కురుక్షేత మహాసంగ్రామం ముగిసిన తర్వాత భీష్ముడు అంపశయ్యపై ఉన్నాడు. సుమారు నెల రోజులు గడిచిపోయిన తర్వాత పాండవులతో మాట్లాడుతూ శ్రీకృష్ణుడు హఠాత్తుగా మధ్యలో ఆపేశాడు. పాండవులు కంగారుపడి ఏమైంది అని శ్రీకృష్ణుడిని అడిగారు. దీనికి సమాధానంగా కృష్ణుడు

‘మాంధ్యాతి భగవాన్ భీష్మః తపోమే తద్గతం మనః’

అంటే…కురుక్షేత్రంలో అంపశయ్యపై ఉన్న భీష్ముడు నన్ను స్మరించుకుంటున్నాడు.. అందుకే నామనస్సు అక్కడికి మళ్లిందని చెప్పాడు.
భీష్ముడు ఆస్తికాగ్రేసరుడు, ధర్మాలను అవపోషణ పట్టినవాడు అని చెప్పి పాండవులను వెంటబెట్టుకుని వెళ్లాడు. ఈ సమయంలోనే శ్రీకృష్ణుని భీష్ముడు స్తుతిస్తూ విష్ణు సహస్రనామాలను ఉపదేశం చేశాడు. ఈ స్తోత్ర పారాయణం సకల వాంఛితార్థ ఫలదాయకమని నమ్మకం. స్తోత్రం ఉత్తర పీఠిక (ఫలశ్రుతి) లో ఈ శ్లోకం ‘ధర్మార్థులకు ధర్మం, అర్థార్థులకు అర్థం, కామార్థులకు కామం, ప్రజార్థులకు ప్రజను ప్రసాదించును’ అని పేర్కొన్నాడు.

అశుభం అనేది ఉండదు
నిత్యం విష్ణు సహస్రనామ పారాయణం చేసేవారికి, వినేవారికి, చదివేవారికి ఏవిధమైన అశుభాలు ఉండవు. బ్రాహ్మణులకు వేదవిద్య, గోవులు, క్షత్రియులకు విజయం, వైశ్యులకు ధనం, శూద్రులకు సుఖం లభిస్తుంది. ధర్మం కోరుకువారికి ధర్మం, ధనం కోరుకున్నవారికి ధనం లభిస్తుంది. భక్తితో వాసుదేవుని నామాలను కీర్తించేవారికి కీర్తి, శ్రేయస్సు దక్కి అనారోగ్యాన్ని హరిస్తుంది.

విష్ణు సహస్రం ఎప్పుడైనా జపించవచ్చు
విష్ణు సహస్రనామం ఓ చోట స్థిరంగా కూర్చుని మాత్రమే చదవాల్సిన అవసరం లేదు. మంత్రజపం చేసేవారు స్థాణువులాగా ఉండి చేయాలి కానీ నామం మాత్రం అటూ ఇటూ తిరుగుతూ, నిలబడి, కూర్చొని, పనిచేసుకుంటూ చేయవచ్చు. స్వప్న, సుషుప్తులకు అధిదేవత పరమశివుడు. కాబట్టి రాత్రి నిద్రపోయే ముందు పదకొండుసార్లు శివనామం స్మరించాలి. జాగృతికి అధిదేవత శ్రీ మహావిష్ణువు. అందువల్ల ఉదయం లేస్తూనే శ్రీహరీ శ్రీహరీ శ్రీహరీ అంటూ పదకొండుసార్లు స్మరించాలని పండితులు చెబుతారు. శాస్త్రంలో మంచం మీద కూర్చుని, పడుకుని మంత్రం జపించడం, తినడం , తాగడాన్ని అంగీకరించదు. కానీ విష్ణు సహస్రనామానికి ఆ నిబంధన లేదు. మంచంమీద నుంచి లేస్తూనే విష్ణు సహస్రనామం ప్రారంభించవచ్చు..దీనికి ఎలాంటి నిబంధనలు లేవు. జాతకంలో గ్రహాలు బలహీనంగా ఉన్నప్పుడు విష్ణు సహస్రనామం పఠిస్తే ఉత్తమ ఫలితాలు పొందుతారని శాస్త్ర వచనం.

గమనిక: కొందరు పండితులు, కొన్ని పుస్తకాలు ఆధారంగా సేకరించిన సమాచారం ఇది. దీనిని ఎంత వరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.