డ్రాగన్ ఫ్రూట్.. మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అందుకే రైతులు సాగుచేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడిప్పుడే ఈ సాగువల్ల ఉపయోగాలు తెలుసుకుంటున్నారు. ఏడాదో రెండేళ్లో కాదు ఒక్కసారి పెట్టుబడి పెడితే ఏకంగా 30 ఏళ్ల పాటూ తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదంటున్నారు..
ఒక్కసారి విత్తితే 30 ఏళ్లు దిగుబడి
డ్రాగన్ ఫ్రూట్‌కు … తైవాన్ దేశంలో పండే ఈ పంటకు మన దేశ నేలలు అనుకూలంగా ఉన్నాయని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. విత్తిన ఏడాదిన్నర లోపు పంట చేతికి వస్తుంది. మొదటి సంవత్సరం నుంచే మంచి లాభాలు రావడం మొదలవుతుంది. ఎకరాకు నాలుగు టన్నుల డ్రాగన్‌ఫ్రూట్ దిగుబడి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ పంట సాగులో ఎరువులుగా పశువుల పేడ మాత్రమే వాడటం వల్ల మరింత ఎక్కువ దిగుబడి వస్తుంది. పైగా ఒక్కసారి విత్తనాలు వేస్తే అదే విత్తనం ద్వారా దాదాపు 30 ఏళ్లు పంట దిగుబడి వస్తుంది.
ఖర్చు చాలా తక్కువ
డ్రాగన్ ఫ్టూస్ సాగు చేయడానికి ఖర్చుకూడా చాలా తక్కువే అని చెప్పుకోవాలి. ఒక్కసారి రూ.5 లక్షల వరకు ఖర్చు చేస్తే 30 సంవత్సరాల వరకు ఏటా పంట దిగుబడి పొందొచ్చు. జంతువులు ఈ పండ్లు తినవు. చీడపీడల బెడద కూడా చాలా తక్కువ. రైతులకు అన్ని విధాలు లాభం చేకూర్చే పంట. పూర్తిగా సేంద్రియ పద్ధతిలో ఈ పంట సాగవడంతో ఈ పండు రుచి చాలా బావుంటుంది. మార్కెట్లో వీటి ధర కిలో దాదాపు 200, 250 రూపాయలు పలుకుతోంది. పైగా ఈ సాగు ద్వారా లాభాలే తప్ప నష్టాలు అస్సలు ఉండవు.
ఇలా సాగుచేయాలి
పంట సాగు చేయడానికి ముందు భూమిని చదును చేసుకోవాలి. భూసార పరీక్షలు చేయించాలి. నేలలో ఉదజని 7 శాతం ఉంటే సరిపోతుందని వ్యవసాయశాఖ అధికారులు పేర్కొంటున్నారు. మూడుసార్లు భూమిని దున్నిన తర్వాత 10 ఫీట్ల దూరంలో సాలు తోలాలి. అడ్డం నాలుగు ఫీట్ల దూరంలో 7 ఫీట్ల ఎత్తున్న సిమెంట్ స్తంభాలను నాటుకోవాలి. సిమెంట్ స్తంభంపై భాగంలో రౌండుగా ఉండే ఒక సిమెంట్ బిళ్లను అమర్చాలి. ఎకరానికి 500 సిమెంట్ స్తంభాలను ఏర్పాటు చేసుకోవాలి. మొక్కలను నాటే ముందు పాదు దగ్గర పశువుల పేడ వేయాలి. మొక్కలు కింద పడిపోకుండా కట్టాలి. మొక్కలను నాటడానికి రెండు నుంచి మూడు ఫీట్ల లోతులో పాదు చేసుకోవాలి. ఒక్కో స్తంభానికి నాలుగు మొక్కలు నాటుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎలాంటి పురుగు మందులు వాడవలసిన అవసరం లేదు. ఒక్కసారి సాగు చేశాక తిరిగి చూడాల్సిన అవసరం లేదు. మందులు వేయాల్సిన పనిలేదు. నీటి అవసరం చాలా తక్కువే.
ఔషధ గుణాలు
డ్రాగన్ ఫ్రూట్లో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. పోషక విలువలు, విటమిన్ – సి, విటమిన్ – బి3తో ఐరన్, మెగ్నీషియంలతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు, కార్బోహైడ్రేట్లు అత్యధికంగా ఉంటాయి. పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. మధుమేహ వ్యాధి, రక్త పోటు నియంత్రణలో కూడా బాగా ఉపయోపడుతుందని వైద్యులు చెబుతున్నారు.
గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.