శఠగోపం గుడిలోని దేవుడు లేదా దేవత విగ్రహానికి ప్రతీక అంటారు పండితులు. గుడికి వెళ్లిన ప్రతి భక్తునికి ఆలయంలో ఉండే దేవతా విగ్రహాలను తాకే వీలుండదు. అందుకే ఆలయ పూజారి భక్తులకు తీర్థప్రసాదాలిచ్చిన తర్వాత శఠారిని తీసుకొచ్చి భక్తుల తలపై పెట్టి ఆశీర్వచనం ఇస్తారు. ఇంతకీ శఠగోపం అంటే ఏంటి? అదెందుకు తీసుకోవాలి?
కోర్కెలు భగవంతుడికి విన్నవించుకోవడం
శఠగోపం అంటే అంత్యంత రహస్యమైనది అని అర్థం. దీనిని వెండి , రాగి, కంచుతో తయారు చేస్తారు. దీనిపై శ్రీ మహావిష్ణువు పాదాలుంటాయి. అంటే మన కోరికలను భగవంతుడికి ఇక్కడే తెలపాలి. పూజారికి కూడా వినిపించకుండా మన కోర్కెలను భగవంతునికి రహస్యంగా విన్నవించుకోవాలి. మనిషికి శత్రువులైన కామమూ, క్రోధమూ, లోభమూ, మోహమూ, మదమూ, మాత్సర్యముల వంటి వాటికి ఇక నుంచి దూరంగా ఉంటామని తలూస్తూ తలవంచి తీసుకుంటారు. శఠగోపం తలమీద ఉంచినపుడు శరీరంలో ఉన్న విద్యుత్, దాని సహజత్వం ప్రకారం శరీరానికి లోహం తగిలినపుడు విద్యుదావేశం జరిగి మనలోని అధిక విద్యుత్ బైటికెళుతుంది. తద్వార శరీరంలో ఆందోళనా, ఆవేశమూ తగ్గుతాయి. శఠత్వం అంటే మూర్ఖత్వం అని, గోపం అంటే దాచిపెట్టడం అని కూడా ఉంది. భగవంతుడు మనిషిలో గోప్యంగా ఉన్న మూర్ఖత్వాన్ని, అహంకారాన్ని తొలగించి జ్ఞానిగా చేస్తాడనేది ఆధ్యాత్మికుల భావన. నేను, నాది అనే భ్రమను తొలగించడానికి శఠగోపం పెడతారు.
కుండలినీ శక్తి మేల్కొంటుంది
శఠగోపం లో పరమాత్ముడు కొలువై ఉంటాడని వేద పండితులు చెబుతారు. సహస్రార చక్రానికి తాకించిన శఠగోపం తలపై పెట్టడం వలన మనలోని కుండలిని శక్తి ప్రేరేపించబడుతుంది. అంతేకాకుండా శఠగోపం పెట్టినప్పుడు మన మనసులో ఉన్న కోరికలు నెరవేరాలని బలంగా కోరుకుంటే మనం కోరుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయి అని భక్తుల విశ్వాసం.అందువల్ల దేవాలయానికి వెళ్ళినప్పుడు భక్తులందరూ తప్పనిసరిగా తలపై శఠగోపం పెట్టించుకుంటారు.
శఠగోపంను శఠారి అనిపిస్తారు. ఇక్కడ మరో అర్థం చెబుతున్నారు. శఠం అంటే మోసగాళ్లు, అరి అంటే శత్రువు. అంటే మోసగాళ్లకు శత్రువు అని అర్థం. భక్తుల తలపై శఠగోపం పెట్టగా.. చెడు తలంపులు, ద్రోహం వంటి లక్షణాలు నశించి మంచి ప్రవర్తన అలవడుతుందని అంతరార్థం ఉంది. అందుకే ఆలయానికి వెళ్లినవారు శఠగోపం తప్పనిసరిగా పెట్టించుకోవాలని చెబుతారు…
గమనిక: పండితులు చెప్పినవి, కొన్ని పుస్తకాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా రాసిన కథనం. దీనిని ఎంతవరకూ విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం…