ప్రతి ఒక్కరి జాతకంలో శని దోషం లేకుండా ఉండదు. జీవిత కాలంలో మూడుసార్లు ఎలినాటి శని వస్తుంది. వచ్చిందంటే ఏడున్నరేళ్లు రకరకాల సమస్యలు ఎదుర్కోక తప్పదు. ఇక ఏలినాటి శని కాకుండా అష్టమ శని, అర్ధాష్టమ శని వెంటాడుతుంటాయి. మిగిలిన గ్రహాలు కూడా నీచ స్థానంలో ఉంటే ఆ ఫ్రభావం కూడా జాతకుడి ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆదాయం, ఉద్యోగం, బంధాలపై ప్రభావం చూపిస్తుంది. అయితే వీటన్నింటికీ చెక్ పెట్టే ఆలయమే తమిళనాడు లో ఉన్న సూర్యనార్ దేవాలయం అని చెబుతారు పండితులు.
సూర్యనార్ ఆలయం
సూర్యభగవానుడు ఇతర గ్రహాలతో కలసి వెలసిన ప్రాంతమే కుంభకోణంలో సూర్యనార్ దేవాలయం. ఇక్కడ నవగ్రహాల్లో సూర్య భగవానుడిది కీలకస్థానం. ఈ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేస్తే ఏలినాటి శనితో పాటు ఇతర గ్రహదోషాల నుంచి కూడా విముక్తి పొందచ్చంటారు పండితులు. సాధారణంగా నవగ్రహాల ఆలయంలో శివుడు ప్రధానంగా ఉంటే తమిళనాడు రాష్ట్రం కుంభకోణంలో ఉన్న సూర్యనార్ ఆలయంలో మాత్రం సూర్యుడే ప్రధానం.
ఆలయాన్ని అభివృద్ధి చేసిన విజయనగర రాజులు
సూర్యనార్ ఆలయాన్ని క్రీస్తుశకం 11వ శతాబ్దంలో కుళోత్తుంగ చోళ మహారాజు నిర్మించినట్టు చరిత్ర చెబుతోంది. అనంతరం విజయనగర రాజులు, ఇతర రాజవంశాలు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. ఐదు అంతస్తుల రాజగోపురాన్ని పూర్తిగా గ్రానైట్‌తో నిర్మించారు. ఈ ఆలయంలో ఇతర గ్రహాధిపతులకు ప్రత్యేకమైన చిన్న ఆలయాలు కూడా ఉన్నాయి. ఆలయ ప్రాంగణంలో విశ్వనాథ, విశాలాక్షి, నటరాజ, శివగామి, వినాయక, మురుగన్ విగ్రహాలు ఉన్నాయి. వీటితో పాటు ప్రధాన ఆలయ మందిరానికి అతి సమీపంలోనే బృహస్పతి ఆలయం ఉంది. రథసప్తమిని అత్యంత వైభవంగా నిర్వహిస్తారిక్కడ.
నవగ్రహాలు తపస్సు చేసిన ప్రదేశం
కాలవముని అనే యోగి కుష్ఠువ్యాధితో బాధపడుతుండేవాడు. ఆ బాధ నుంచి తనను రక్షించాలని నవగ్రహాలను ప్రార్థించాడు. ఆయన ప్రార్థనకు అనుగ్రహించిన గ్రహాధిపతులు కాలవమునిని వ్యాధి నుంచి విముక్తి చేస్తారు. ఈ విషయం తెలుసుకున్న బ్రహ్మ …మంచి, చెడులకు సంబంధించిన ఫలితాలను ఇవ్వడమే గ్రహాల పని మీ విధిని ఎందుకు అతిక్రమించారని ఆగ్రహం చెందుతాడు. భూలోకంలోనే శ్వేతపుష్పాల అటవీప్రాంతంలోనే ఉండమని శపిస్తాడు. అక్కడ నవగ్రహాలన్నీ శివుడికోసం ఘోర తపస్సు చేస్తాయి. వారి తపస్సుకి మెచ్చిన శివుడు నవగ్రహాలకు శాపవిముక్తి చేసి తపస్సు చేసిన ప్రదేశంలోనే వారికి మహా శక్తులు ప్రసాదించాడు. అదే సూర్యనార్ క్షేత్రం. అందుకే ఇక్కడకు వచ్చిన భక్తులకు నవగ్రహాల బాధలుండవని విశ్వాసం.
శనిదోశం నుంచి విముక్తి
కుజ దోషం, ఏలినాటి శనిదోషం, జాతకచక్రంలో రాహు,కేతు దోషాలు లాంటివి సూర్యనార్ ఆలయాన్ని దర్శించుకుని పూజిస్తే తొలగిపోతాయని పండితులు చెబుతారు. సూర్యభగవానుడితో పాటు గురుడుని 11 ఆదివారాలు పూజిస్తే ఏలినాటి శనితో పాటు ఇతర గ్రహ దోషాలు తొలగిపోతాయంటారు. ఇందుకోసం ప్రత్యేకంగా నాడి పరిహారం, నవగ్రహ హోమాలు, సూర్య అర్చన వంటి పూజలు నిర్వహిస్తారు. తులాభారంలో భాగంగా తమ బరువుకు సమానమైన గోధుమ, బెల్లం తదితర వ్యవసాయ ఉత్పత్తులను ఈ ఆలయానికి సమర్పించుకుంటారు. పూజానంతరం ఆలయం చుట్టూ 9 సార్లు ప్రదక్షిణం చేస్తారు.
గమనిక: కొందరు పండితులు, కొన్ని పుస్తకాలు ఆధారంగా సేకరించిన సమాచారం ఇది. దీనిని ఎంత వరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.