డయాబెటిస్..చక్కెర వ్యాధి అని పేరులో తీపి ఉంటుంది కానీ ఒక్కసారి ఎంటరైందంటే ఆరోగ్యంతో చెడుగుడు ఆడేసుకుంటుంది. అయితే రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకుంటే డయాబెటిస్ తగ్గుతుంది. అందుకు అవసరమైన , ఆరోగ్యకరమైన జీవనశైలి అలవర్చుకోవాలి. వాటితో పాటూ నిత్యం ఈ జ్యూస్ తాగితే శరీరంలో జీవక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటూ ఇన్సులిన్ స్థాయిలను సహజంగా నిర్వహించేలా చేస్తుంది. రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.
కాకరకాయ-నేరేడుపండు జ్యూస్
-ఈ రెండు కాంబినేషన్ తో జ్యూసా..అని అవాక్కవకండి..నిజంగా ఈ జ్యూస్ మీ శరీరంలో చక్కెర నిల్వలను కంట్రోల్ చేయడంతో పాటూ జీర్ణ రుగ్మతలు, చర్మ సమస్యలు, శరీరంలోని టాక్సిన్లను తొలగించడం వంటి ఎన్నో పనులను చేస్తుంది. కాకరకాయ, నేరేడు..ఈ రెండింటిలో అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. కాకరకాయలో పాలీ పెప్టైడ్ పి ఉంటుంది. ఇది ఇన్సులిన్ అసమతుల్యతను పరిష్కరించి..అధిక చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. శరీరంలో మంట, వాపు వంటివి రాకుండా అడ్డుకుంటుంది. నేరేడు పండు విషయానికి వస్తే దీనిలో విటమిన్ ఏ, విటమిన్ సి, బయోటిన్, జింక్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. దీన్ని కాకరకాయ రసంతో కలిపి తీసుకుంటే చక్కెర స్థాయిలు నియంత్రించడానికి సహాయపడుతుంది. ఇందులో ఉండే పోషకాలు, ఫైబర్లు జీవక్రియ ఆరోగ్యాన్ని పెంచుతాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఈ జ్యూసును క్రమం తప్పకుండా తీసుకుంటే చర్మ సమస్యలు, జుట్టు రాలిపోవడం కూడా తగ్గుతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.
రెండింటినీ కలపి జ్యూస్ ఇలా తయారు చేసుకోండి
కాకరకాయను శుభ్రంగా కడిగి పైన పొట్టు తీసేయాలి..చిన్న చిన్న ముక్కలుగా కోసి మిక్సీలో వేయాలి. ఓ ఐదారు నేరేడు పండ్లు తీసుకుని వాటిలో విత్తనాలు తీసేసి మిక్సీలో వేయాలి. వీటితో పాటూ స్పూన్ నిమ్మరసం, రాళ్ల ఉప్పు వేయాలి. అదనపు రుచి కోసం అల్లం, కొత్తమీర కూడా కలపొచ్చు. ఈ రసాన్ని మొత్తం వడకట్టి తాగేయాలి. ఈ జ్యూస్ రోజుకో గ్లాస్ తాగితే చాలు డయాబెటిక్ అదుపులో ఉంటుంది. ఇతర అనారోగ్య సమస్యలకు కూడా ఇది ఔషధంగా పనిచేస్తుంది, చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది. జుట్టు ఊడిపోతోందని బాధపడేవారికి కూడా ఈ జ్యూస్ తాగడం మంచి చిట్కా.
కాకరకాయ జ్యూస్ వల్ల మరెన్నో ఉపయోగాలు
కాకరకాయ జ్యూస్ తరచూ తీసుకుంటే గుండె సంబంధిత సమస్యలు రిస్క్ పూర్తిగా తగ్గుతుంది.
కాకర తీసుకోవడం వల్ల కాన్సర్ కణాలు పెరగకుండా చూసుకుంటుంది
బరువు తగ్గాలనుకునే వాళ్లకి ఇది చాలా బెస్ట్ జ్యూస్ అని చెప్పొచ్చు
యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండడం వల్ల జీర్ణ క్రియను అరుగుదల విధానాన్ని అభివృద్ధి చేస్తాయి
కాకరకాయలో పీచు ఎక్కువగా ఉండడం వల్ల మలబద్దకం సమస్య ఉన్నవారికి చక్కని పరిష్కారం ఇది
కాకరకాయలు మాత్రమే కాదు..కాకర ఆకులు తీసుకోవడం వల్ల కూడా రోగనిరోధక శక్తి పెరుగుతుంది, అంటువ్యాధులు దరిచేరకుండా రక్షణ కల్పిస్తుంది
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. వైద్య నిపుణులను సంప్రదించిన తర్వాతే మీరు వీటిని అనుసరించడం మంచిది.