ఆహారంలో ఇవి భాగంగా చేసుకుంటే మతిమరుపు తగ్గుతుంది!

వయసు పెరుగుతోంది అన్నీ మర్చిపోతున్నాం అన్నది అప్పటి మాట..కానీ ఈ జనరేషన్లో చిన్న పిల్లలు కూడా ఇదే మాట అంటున్నారు. ఏమైనా అంటే మరిచిపోయా అని చెబుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా వేధిస్తున్న ఈ సమస్యకు ఆహారంలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే చాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. సరైన పోషకాలు మెదడుకు అందకపోవడం, తీవ్రమైన ఒత్తిడి, ధూమపానం, మద్యపానం, పలు రకాల మందుల వాడకం తదితర కారణాల వల్ల మెదడు పనితీరు తగ్గుతుంది. ముఖ్యంగా ఈ ఆహార పదార్థాలను తీసుకుంటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

ఆవు నెయ్యి
ఆవు నెయ్యికి జ్ఞాపక శక్తిని పెంచే గుణాలుంటాయి. ప్రతి రోజు ఆవు నెయ్యి అన్నం మొదటి ముద్దలో వేసుకుని తింటే మెదడు పనితీరు వేగవంతం చేస్తుంది. తాజా నెయ్యి కంటే కూడా నిల్వ ఉన్న ఆవు నెయ్యి తీసుకోవటం వలన మెరుగైన ఫలితాలు కలుగుతాయి. చేతిలో ఆవు నెయ్యి వేసుకొని రోజు రెండు పూటలా తీసుకోవాలి. ఇలా చేస్తే మతిమరుపు పోయి జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

వాల్ నట్స్
మనం తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ సమృద్ధిగా ఉన్న ఆహారం తీసుకోవాలి. ఇవి మన మెదడు పనితీరును మెరుగు పరుస్తాయి. అలాంటి వారికి డ్రై ఫ్రూట్ చక్కటి ప్రత్యామ్నాయంగా చెప్పొచ్చు. అందులోనూ మెదడు ఆకారంలో ఉండే వాల్ నట్స్ బ్రెయిన్ ను షార్ప్ చేస్తాయి.

కోడి గుడ్డు
ఆరోగ్యకరమైన మెదడు పనితీరు కోసం ప్రతి రోజు ఒక కోడి గుడ్డు తినాలి. ఉడక బెట్టిన కోడి గుడ్లు ఉదయం అల్పాహారంగా తీసుకుంటే గుడ్డులో ఉండే కొలైన్ జ్ఞాపక శక్తిని పెంచుతుంది.

మిరియాలు
మిరియాలు రోజూ తీసుకుంటే బ్రెయిన్ షార్ప్ గా పనిచేస్తుంది. అలాగే భోజనం చేసిన తరువాత కాసిని సొంపు గింజలను తింటే వాటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి.

ఉసిరికాయ పచ్చడి
ఉసిరికాయ ప్రతిరోజూ తింటే బ్రెయిన్ షార్ప్ గా పనిచేస్తుంది. అన్ని సీజన్లలో ఉసిరికాయ లభించదు కాబట్టి ఉసిరికాయ పచ్చడి తిన్నా జ్ఞాపక శక్తి పెరుగుతుంది.

నీళ్లు బాగా తాగాలి
సరిపడా నీళ్లు తాగాలి ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే నీరు సమృద్ధిగా తాగాలి. నీరు సరిపడా తాగితే ఆరోగ్యంతోపాటు మెదడు కూడా చురుగ్గా పనిచేస్తుంది. తద్వారా జ్ఞాపకశక్తి కూడా మెరుగుపడుతుంది.

ఆకుకూరలు
ఆకుకూరలు ఆరోగ్యానికే కాకుండా మెదడు చురుగ్గా పని చేయడంలోనూ సహాయపడతాయి. ఇందులో అధిక మొత్తంలో ఉండే పొటాషియం ఆలోచనాశక్తిని, జ్ఞాపకశక్తిని పెంచుతుంది. పొటాషియంతోపాటు మెగ్నీషియం, ఫోలేట్, విటమిన్ ఇ, కె వంటి పోషకాలు మెదడుపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడకుండా కాపాడతాయి.

పసుపు
మెదడు చురుకుదనాన్ని పెంచే శక్తి పసుపుకి ఉందని పలు అధ్యయనాల్లో బయటపడింది. దీనిలోని కర్క్యుమిన్ అనే పదార్థం అల్జీమర్స్ వ్యాధి తీవ్రతను తగ్గించడంలో సహాయ పడుతుంది. గోరువెచ్చటి పాలలో చిటికెడు పసుపు కలుపుకుని తాగితే ఆరోగ్యంతోపాటు, జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది.

వీటితోపాటు బ్లూబెర్రీలు, యాపిల్స్‌, నిమ్మ, దానిమ్మ, తేనె, డార్క్ చాక్లెట్, గింజలు వంటి ఆహారాలను ప్రతి రోజూ క్రమం తప్పకుండా తింటుంటే జ్ఞాపకశక్తి పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

గమనిక: పలు పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం