ప్రయాణం సులభతరం కావాలి. ప్రయాణం సౌకర్యవంతం కావాలి. ప్రయాణం వేగవంతం కావాలి. ప్రయాణం ఓ అనుభవాన్ని, అనుభూతిని ఇవ్వాలి…ఇదీ 2014 తర్వాత కేంద్రంలోని మోదీ సర్కారు సంకల్పం. ఆ దిశగా అమిత వేగంతో అత్యంత సురక్షితంగా జనాన్ని గమ్యస్థానాలకు చేర్చే వందే భారత్ రైళ్లను దశల వారీగా ప్రారంభిస్తున్నారు..
4000 వేల నగరాలు, పట్టణాలు
దేశంలో లక్ష జనాభా దాటిన పట్టణాలు, నగరాలు 4 వేల వరకూ ఉన్నాయి. అందులో ఏడు నగరాలు మూడు కోట్ల జనాభాను దాటినవి ఉన్నాయి. వాటన్నింటినీ వందే భారత్ తో కనెక్ట్ చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఓ మహానగరం నుంచి మరో మహానగరానికి రైలు వేసే క్రమంలో లక్ష జనాభా దాటిన పట్టణాల్లో విధిగా ఆపేందుకు షెడ్యూల్ రూపొందిస్తున్నారు. దీని కోసం రైల్వే స్టేషన్ల ఆధునీకరణ, రైల్వే లైన్ల వివిధీకరణ ప్రక్రియ కొనసాగిస్తోంది. మొత్తం 500 రైల్వే స్టేషన్లను అత్యాధునిక హంగులతో సిద్దం చేస్తున్నారు. వాటిని ఇకపై అమృత్ భారత్ స్టేషన్లని పిలుస్తారు. రైల్వే బడ్జెట్ ను మునుపటి కంటే ఎనిమిది రెట్లు ఎక్కువ చేయడంతో వసతుల కల్పన కూడా సులభమైంది.
కోటి దాటిన వందేభారత్ ప్రయాణికులు
భారతీయ రైల్వేలో ఒక్క రోజు ప్రయాణించే వారి లెక్క చూస్తే కొన్ని దేశాల జనాభా కంటే ఎక్కువగానే ఉంటుంది. ఆదివారం ప్రారంభించిన తొమ్మిది రైళ్లతో కలిపి దేశంలో ఇప్పుడు 34 వందే భారత్ ట్రైన్స్ ఉన్నాయి. త్వరలోనే సంఖ్య సెంచురీ కొడుతుందని చెబుతున్నారు. మొదటి పాతిక రైళ్లలో ప్రయాణికుల సంఖ్య కోటి పది లక్షలు దాటిందని రైల్వే శాఖ గణాంకాలు చెబుతున్నాయి. వందే భారత్ రైళ్లతో పర్యాటకం కూడా వృద్ధి చెందింది. ప్రయాణ సమయం తగ్గడం కారణంగా పర్యాటకులు తమ షెడ్యూల్ ను అడ్జెస్ట్ చేసుకుని ఎక్కువ ప్రదేశాలను సందర్శించే అవకాశం వచ్చింది. చెన్నై – మదురై – తిరునల్వేలి వందే భారత్ ట్రైన్ వేయడం వల్ల చెన్నై వచ్చే పర్యాటకులకు, మదురై – తిరుచ్చి – శ్రీరంగం వెళ్లే వారికి, అటు కన్యాకుమారి, ఇటు తిరువనంతపురం, శబరిమల వెళ్లే వారికి కూడా ఉపయోగకరంగా ఉంటుందని చెబుతున్నారు.
తెలుగు రాష్ట్రాలకు కూడా..
రెండు తెలుగు రాష్ట్రాలకు కొత్త వందే భారత్ రైళ్లు వచ్చాయి. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటే విజయవాడ – చెన్నై సెక్షన్లో కొత్త వందే భారత్ రైలు వేశారు. అలాగే హైదరాబాద్లోని కాచిగూడ నుంచి బెంగళూరులోని యశ్వంత్ పూర్ కు మరో వందే భారత్ ను ప్రధాని మోదీ స్వయంగా వర్చువల్ గా ప్రారంభించారు. ఈ రెండు రైళ్లను ప్రయాణికులు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు. తెలంగాణలో ఇప్పటికే రెండు వందే భారత్ రైళ్లు నడుస్తుండగా, కాచిగూడ – యశ్వంత్ పూర్ మూడోదిగా చెబుతున్నారు.