టేస్ట్ బావుందని లాగించేస్తే అనారోగ్యాన్ని ఆహ్వానిస్తున్నట్టే!

నాలుకపై ఉండే టేస్ట్ బడ్స్‌ మంచి రుచిని కోరుకుంటాయి. నాలుకను సంతృప్తి పరచడమే ధ్యేయంగా జంక్‌ ఫుడ్‌ లాగించేస్తుంటాం. బర్గర్‌లు, ఫ్రైడ్‌ ఫుడ్స్‌ ఆకర్షిస్తూ ఆకలిని చంపేస్తాయి. జంక్ ఫుడ్‌ను క్రమం తప్పకుండా తింటే ఊబకాయం, ఇతర ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. జంక్ ఫుడ్స్ ఆరోగ్యానికి మంచివి కావని తెలిసినా వాటిని చూస్తే మాత్రం తినకుండా ఉండలేం. అయితే జంక్ ఫుడ్స్‌ను ఎప్పుడో ఒకసారి తింటే పర్వాలేదు కానీ, అదే పనిగా రోజూ తింటే మాత్రం అంతే సంగతులు అంటున్నారు డాక్టర్లు.

ఒత్తిడి, డిప్రెషన్ పెరుగుతాయి
జంక్ ఫుడ్స్‌లో పోషకాలు చాలా తక్కువ. పైగా వీటిని ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంటుంది. దానికి కారణం అందులో ఉండే టేస్టీ సాల్ట్స్, ఫ్యాట్స్, షుగర్స్. ఇవి మెదడు పనితీరు మందగించేలా చేస్తాయి. తద్వారా ఒత్తిడి, డిప్రెషన్ వంటివి పెరుగుతాయి. జంక్ ఫుడ్ అతిగా తింటే.. కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ లెవల్స్ కూడా పెరుగుతాయి. జంక్ ఫుడ్స్ నుంచి వచ్చే కొవ్వులు శరీరంలో పేరుకుపోయి.. ఒబెసిటీ సమస్యని పెంచుతుంది. దాంతో బరువు పెరిగి గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. వీటిలో ఎక్కువగా వేయించిన పదార్ధాలే ఉంటాయి. వీటిలో ప్రాసెస్ చేసిన ఉప్పు శాతం ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు ఇందులో ఉండే చెడు కొవ్వులు, సోడియం వంటివి రక్తపోటుని పెంచి కిడ్నీల పనితీరుని దెబ్బతీస్తాయి.
తరచుగా జంక్ ఫుడ్స్ తినడం ద్వారా రోగనిరోధక వ్యవస్థ దెబ్బతింటుంది. దాంతో రకరకాల జబ్బులు బారిన పడాల్సి వస్తుంది. పలురకాల లివర్ సమస్యలు, మధుమేహం, జీర్ణ సంబంధిత సమస్యలకు జంక్ ఫుడ్డే కారణం.

ఆరోగ్యాన్ని చెడగొట్టే కొవ్వులు
జంక్ ఫుడ్‌లో మన ఆరోగ్యాన్ని చెడగొట్టే కొవ్వులు, చక్కెరలు, లవణాలు ఎక్కువగా ఉంటాయి. ఇదే సమయంలో పోషక విలువలు.. విటమిన్లు, ఖనిజాలు చాలా తక్కువగా ఉంటాయి. ఫలితంగా జంక్‌ ఫుడ్‌ తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. క్రమం తప్పకుండా జంక్‌ ఫుడ్స్‌ తీసుకోవడం వల్ల ఊబకాయం, చర్మంపై ప్రభావం, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, ఆకలి లేకపోవడం, శ్వాసకోశ వ్యవస్థపై హానికరమైన ప్రభావం వంటి ఎన్నో దుష్ప్రభావాలు ఉంటాయి.

యువకులకు ప్రమాదం
ఇటీవల వెల్లడైన పరిశోధన ప్రకారం అధిక మొత్తంలో బర్గర్లు, పిజ్జా, హై ఎనర్జీ డ్రింక్స్ తీసుకోవడం వల్ల యువకులు ఫిట్‌గా ఉంటారు కానీ వారి స్పెర్మ్ కౌంట్ తగ్గుతోంది. ఇది దీర్ఘకాలంలో తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. అమెరికన్, డానిష్ పరిశోధకుల బృందం హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఒక పరిశోధన చేసింది. ఇందులో జంక్‌ ఫుడ్‌ తినే వ్యక్తుల సగటు స్పెర్మ్ కౌంట్ క్షీణించినట్లు కనుగొన్నారు.

గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.