ఖమ్మం జిల్లా సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు బలప్రదర్శన చేసినా బీఆర్ఎస్ హైకమండ్ పట్టించుకోవడం లేదు. ఇతర అసంతృప్త నేతల్ని బుజ్జగిస్తున్నారు. కానీ తుమ్మల నాగేశ్వరరావు పార్టీలో ఉన్నా లేకపోయినా ఎలాంటి సమస్యా లేదన్నట్లుగా వ్యవహరిస్తూండటంతో.. ఇక పార్టీ మారడం ఖాయమన్న నిర్ణయానికి తుమ్మల అనుచరులు వస్తున్నారు.
మంత్రిగా విఫలమైన తుమ్మల
కేసీఆర్ కూడా తుమ్మల పార్టీ మారితే జరిగే నష్టంపై అంచనాలు వేస్తున్నదే తప్ప ఆయనతో మాట్లాడేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు కనిపించడం లేదని అంటున్నారు. ఉమ్మడి జిల్లాలో 2014, 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ఒక్క సీటే గెలిచిందని, ఇప్పుడు అంతకు మించిన నష్టం ఏమీ ఉండదని కేసీఆర్భావిస్తున్నట్టు చర్చ సాగుతోంది. భద్రాద్రి జిల్లా ఎమ్మెల్యేలను.. అభ్యర్థులను కేసీఆర్ సమవేశానికి పిలిచారు కానీ.. తుమ్మలను పరిగణనలోకి తీసుకోలేదని అంటున్నారు. తుమ్మలను పార్టీలో చేర్చుకుని మంత్రి పదవి ఇచ్చి.. జిల్లాపై పెత్తనం ఇస్తే.. తర్వాత ఎన్నికల్లో ఆయన కూడా ఓడిపోయారని..ఆయన వల్ల పార్టీకి పెద్దగా లాభం లేదని బీఆర్ఎస్ పెద్దలు ఓ అంచనాకు వచ్చారంటున్నారు. అందుకే భారీ పదవులు ఆశ చూపి పార్టీలో ఉండాలని ఆయనపై ఒత్తిడి తేవాల్సిన అవసరం లేదని ఫిక్సయినట్లుగా చెబుతున్నారు.
కాంగ్రెస్ లో చేరక తప్పదా ?
తుమ్మల బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరడం లాంఛనమేనని ఆయన అనుచరులు అంటున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే నెల మొదటి వారంలో తుమ్మలను పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తారని తెలుస్తోంది. తర్వాత ఢిల్లీ పెద్దల సమక్షంలో చేరిక ఉంటుందని చెప్తున్నారు. తాను పాలేరు నుంచే పోటీ చేస్తానని తుమ్మల చెబుతూ వస్తున్నారు. బీఆర్ఎస్ లిస్ట్ ప్రకటించిన తర్వాత కూడా ఆయన అదే మాటపై ఉన్నారు. అయితే కాంగ్రెస్‌లో చేరితే ఖమ్మం నుంచి పోటీ చేయాలని ఆ పార్టీ ముఖ్య నేతలు ఆయనకు సూచించనున్నట్టు తెలుస్తున్నది. పాలేరు నుంచి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని బరిలోకి దింపాలని భావిస్తున్నారు.
కూకట్ పల్లిలో పోటీ చేయాలంటున్న కాంగ్రెస్
తుమ్మల తాను పాలేురలో పోటీ చేస్తానంటున్నరు. అయితే ఈ సారి ఎమ్మెల్యేగా బరిలోకి దిగాలనుకుంటున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా పాలేరులో పోటీకి రెడీ అవుతున్నారు. సహజంగానే అక్కడ రెడ్డి సామాజికవర్గం నేతలు గెలుస్తూ ఉంటారు. కమ్మంలో కమ్మ సామజికవర్గం గెలుస్తూ ఉంటారు. ఈ కారణంగా తుమ్మలను ఖమ్మంలో పోటీ చేయాలని కాంగ్రెస్ కోరుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ కొత్తగా ఆయనను కూకట్ పల్లిలో బరిలోకి దిగాలని కోరుతోంది. దీంతో మొత్తంగా తుమ్మల రాజకీయం తేడాగా మారుతోంది.