లోక్ సభకు ఒక దశ ఎన్నికలు పూర్తయ్యాయి. రెండో దశ ఈ నెల 26న నిర్వహిస్తారు. మొదటి దశలో బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తోందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో బీజేపీలో జోష్ పెరిగింది. కాంగ్రెస్ నిరుత్సాహ పడిపోయింది. బీజేపీ నేతలు విజయోత్సాహంతో మాట్లాడుతుంటే… కాంగ్రెస్ నేతలు నిరాశతో అర్థం పర్థం లేని స్టేట్ మెంట్స్ ఇస్తున్నారు.
రాహుల్ హామీలపై ప్రధాని ఫైర్…
కాంగ్రెస్ అధికారానికి వస్తే దేశం అథోగతి పాలవుతుందని ప్రధాని మోదీ అంటున్నారు. ప్రతీ ఎన్నికల ప్రచార బహిరంగసభలోనూ ఆయన కాంగ్రెస్ తీరును ఎండగడుతున్నారు. సంపద పునర్ విభజనపై రాహుల్ కామెంట్స్ ను ఆయన తప్పుపడుతున్నారు. దేశంలో అరాచకం సృష్టించడమే కాంగ్రెస్ విధానమని ఆయన అంటున్నారు. కాంగ్రెస్ అధికారానికి వస్తే ప్రతీ ఒకరి ఆస్తిని లెక్కగడతామని అంటోందని, అదెలా సాధ్యమని ఆయన ప్రశ్నిస్తున్నారు. “మన సోదరీమణుల దగ్గర ఎంత బంగారం ఉందే లెక్కచూస్తారు. ఆదివాసీ మహిళల దగ్గర ఎంత వెండి ఉందో తూకం వేస్తారు. ప్రభుత్వోద్యోగుల సంపద ఎంతో రికార్డులు తీస్తారు. అంతటితో ఆగరట. మన చెల్లెళ్ల దగ్గర ఉన్న బంగారాన్ని అందరికీ పంచుతారట,” అని మోదీ వ్యాఖ్యానించారు…
చొరబాటుదారులకు బంగారాన్ని పంచుతారు…
ప్రజల సంపదను, బంగారాన్ని లాగేసుకునే కాంగ్రెస్ పార్టీ దాన్ని సీమాంతరంగా వచ్చిన చొరబాటుదారులకు పంచుతుందని ఆరోపించారు. ఎక్కువమంది పిల్లలుండే వారికి ఇస్తుందని చెప్పారు. పరోక్షంగా ఆయన ముస్లింల ప్రస్తావన చేశారు. అధికారానికి రాగానే ఆర్థిక, వ్యవస్థాగత సర్వే నిర్వహించి ఎవరి సంపద ఎంతో నిగ్గు తేల్చుతామని రాహుల్ గాంధీ అన్న మాటలను మోదీ గుర్తుచేశారు. సంపదను పునర్ విభజన చేస్తామన్న స్టేట్ మెంటును తప్పుపడుతున్నారు. దీనిపై దేశ ప్రజలనే ప్రధాని మోదీ కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. ” రాహుల్ చెప్పిన మాటలతో మీరు ఏకీభవిస్తారా. ప్రజల ఆస్తులను స్వాధీనం చేసుకునే హక్కు ప్రభుత్వానికి ఉందా. మన తల్లి, చెల్లి సంపద అయిన బంగారాన్ని లాగేసుకునే హక్కు ఎవరికైనా ఉందా. మంగళసూత్రాన్ని కూడా లాగేసుకోవాలనుకుంటున్నారే. అది మన మహిళల మాంగల్యం కాదా, గౌరవ చిహ్నం కాదా. పవిత్రమైన ఒక వస్తువును తీసుకుంటామంటే చూస్తూ ఊరుకోవాలా..” అని మోదీ ప్రశ్నించారు..
సమాధానం చెప్పలేక కాంగ్రెస్ ఉక్కిరిబిక్కిరి…
రాహుల్ గాంధీ వెనుకాముందు చూసుకోకుండా మాట్లాడిన మాటలకు కాంగ్రెస్ నేతలంతా ఇప్పుడు ఇరకాటంలో పడిపోయారు. మోదీ అబద్ధాలు చెబుతున్నారంటూ జైరాం రమేష్ లాంటి వారు చేసిన ఎదురుదాడి కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. తమ మేనిఫెస్టోలో అలాంటి ప్రతిపాదనేదే లేదని కాంగ్రెస్ పార్టీ అంటోంది. అయితే రాహుల్ గాంధీ అలాంటి మాటలు మాట్లాడలేదని మాత్రం చెప్పలేకపోతోంది. నిజానికి మేనిఫెస్టోలో లేని పౌరసత్వ సవరణ చట్టాన్ని అధికారానికి వచ్చిన తొలినాళ్లలోనే వెనక్కి తీసుకుంటామని కాంగ్రెస్ సీనియర్ నేత పీ.చిదంబరం ప్రకటించారు. మేనిఫెస్టోలో లేకపోయిన ఆ చట్టం తమ అజెండాలో ఉందని ఆయన అంటున్నారు. చిదంబరం తరహాలోనే రాహుల్ కూడా స్టేట్ మెంట్ ఇచ్చి ఉండొచ్చు కదా అన్న ప్రశ్నకు కాంగ్రెస్ సమాధానం చెప్పలేకపోతోంది.