హిందూ పురాణాల ప్రకారం కొబ్బరి కాయకు ఎంతో ప్రాధాన్యత ఉంది. కొబ్బరికాయ మీదున్న పీచును జుట్టుతో పోలుస్తారు. అంతే కాకుండా గుండ్రంగా ఉండే టెంకాయను మనిషి ముఖంతో, కొబ్బరికాయలో ఉండే నీటిని రక్తంతో పోలుస్తారు. ఇక టెంకాయను కొట్టిన తరువాత అందులో ఉండే లేత కొబ్బరిని మనస్సుగా భావిస్తారు. అయితే కొబ్బరిని దేవుడికి కొట్టినప్పుడు మనసులో వున్న కల్మషం, అహంకారం, ఈర్ష్యాద్వేషాలు అన్ని తొలగాలన్నదే దీనివెనుకున్న ఆంతర్యం. అయితే శాస్త్ర ప్రకారం కొబ్బరికాయ కొట్టడంలో కొన్ని నియమాలు ఉన్నాయి.
@ భగవంతుడి నివేదనకు కొబ్బరికాయను కొట్టబోయే ముందు దానిని స్వచ్చమైన నీటితో కడిగి ఆ తర్వా పీచు ఉన్న ప్రదేశాన్ని చేతబట్టుకుని, దేవుడిని స్మరించుకుని కొట్టాలి.
@ సరిగ్గా రెండు భాగాలుగా పగలాలనే నిబంధన ఏమీ లేదు అటు ఇటుగా పగిలినా పర్లేదు.
@ టెంకాయ కొట్టి దానిని విడదీయకుండా అభిషేకం చేస్తారు చాలామంది. అలా చేస్తే ఆ కాయ నైవేద్యానికి పనికిరాదు
@ కొబ్బరికాయను నీటిని ఒక పాత్రలోనికి తీసుకుని, కాయను వేరు చేసి వేరే ఉంచాలి. పాత్రలోని కొబ్బరినీటిని మాత్రమే అభిషేకించాలి. వేరుగా ఉంచిన కొబ్బరికాయ రెండు ముక్కల్ని నైవేద్యంగా సమర్పించాలి
పువ్వు వస్తే మంచిదా
కొన్నిసార్లు పూజ చేస్తున్నప్పుడు కొబ్బరికాయ కొడితే అందులోపల పువ్వు వస్తుంది. పువ్వు వస్తే తమ కోర్కె తీరుతుందని, పాజిటివ్ ఎనర్జీ వస్తుందని భావిస్తారు భక్తులు. ఇది జరుగుతుందో లేదో కానీ మంచి జరుగుతుందనే విశ్వాసమే సగం పాజిటివ్ ఎనర్జీని తెస్తుందంటారు పండితులు. కొత్తగా పెళ్లైన దంపతులు సమర్పించే కొబ్బరికాయలో పువ్వు వస్తే త్వరలోనే సంతానయోగం ఉందని అర్థం
కొబ్బరికాయ కుళ్లితే ఏమవుతుంది
పువ్వు వస్తే సంతోషపడే భక్తులు కొబ్బరికాయ కుళ్లితే మాత్రం ఏదో జరిగిపోతుందని కంగారు పడిపోతుంటారు. కీడు సంభవిస్తుందని, చెడు జరుగుతుందని ఆందోళనకు చెందుతారు. అయితే అంత ఆందోళన చెందాల్సిన పనిలేదంటారు పండితులు. పూజ సమయంలో కొబ్బరికాయ కుళ్లితే దానిని పక్కనపెట్టేసి దేవుడికి నమస్కరించి మరో కాయ తీసుకోవాలి. భగవద్గీతలో చెప్పినట్టుగా, భక్తితో అర్పించిన పండుగానీ, పువ్వుగానీ, ఆకుగానీ, ఆ స్వామి స్వీకరి స్తాడు. ఇక్కడ భక్తి ముఖ్యంగానీ తెచ్చిన వస్తువు కాదు. వాహనాలకు కొట్టిన కొబ్బరికాయ చెడిపోతే దిష్టిపోయినట్టే అని భావించి మళ్లీ వాహనాన్ని శుభ్రం చేసి మరో కొబ్బరికాయ కొడితే సరిపోతుంది.
గమనిక: కొందరు పండితులు, కొన్ని పుస్తకాలు ఆధారంగా సేకరించిన సమాచారం ఇది. దీనిని ఎంత వరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.