ఖగోళ, జోతిష్య శాస్త్రాల్లో సూర్య, చంద్ర గ్రహణాలకు చాలా ప్రాధాన్యం ఉంది. గ్రహణాలను ప్రత్యక్షంగా చూసేందుకు ఖగోళ శాస్త్రవేత్తలు ఆసక్తిగా ఎదురుచూస్తే.. జోతిష్య శాస్త్రాన్ని పాటించే వారు గ్రహణాలను అరిష్టంగా పరిగణిస్తారు. శ్రీ శోభకృత్ నామసంవత్సరంలో తొలి గ్రహణం ఏప్రిల్ 20 గురువారం సంభవిస్తుంది.
ఈ ఏడాది మొత్తం నాలుగు గ్రహణాలున్నాయి..రెండు సూర్యగ్రహణాలు, రెండు చంద్రగ్రహణాలు. మొదటగా ఏర్పడుతున్న గ్రహణం సూర్యగ్రహణం. భూమి, సూర్యుడికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు ఆ నీడ సూర్యుడ్ని కప్పేస్తే గ్రహణం సంభవిస్తుంది. ఆ గ్రహణాన్ని సూర్య గ్రహణం అంటారు. ఆ సమయంలో చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కప్పివేస్తే సంపూర్ణ సూర్యగ్రహణమని, కొద్ది భాగం కప్పేస్తే పాక్షిక గ్రహణం అని అంటాం. గ్రహణం నిప్పులు చెరుగుతూ అగ్ని వలయంలా కనిపిస్తే హైబ్రిడ్ సూర్య గ్రహణం అంటారు.
ఏప్రిల్ 20న హైబ్రిడ్ సూర్యగ్రహణం
ఈ ఏడాది ఏప్రిల్ 20 గురువారం ఏర్పడేది హైబ్రిడ్ సూర్యగ్రహణం. చంద్రుని నీడ భూమి ఉపరితలంపై కదులుతున్నప్పుడు సంపూర్ణ సూర్యగ్రహణం నుంచి కంకణాకారంలోకి అంటే రింగ్ లా మారుతుంది. దీనినే హైబ్రిడ్ సూర్యగ్రహణం అంటారు.ఈ సూర్యగ్రహణం ఏప్రిల్ 20 గురువారం ఉదయం 7.04 గంటలకు ప్రారంభమై.. మధ్యాహ్నం 12.09 గంటల వరకు కొనసాగుతుంది. ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదని శాస్త్రవేత్తలు తెలియజేశారు. దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలోని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ తదితర దేశాల్లో మాత్రమే కనిపిస్తుందని పేర్కొన్నారు.
హైబ్రిడ్ సూర్యగ్రహణాన్ని ఎక్కడ చూడొచ్చు
ఈ గ్రహణాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా, ఆస్ట్రేలియాలోని గ్రావిటీ డిస్కవరీ సెంటర్ అండ్ అబ్జర్వేటరీ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి. అయితే, ఈ అరుదైన సూర్యగ్రహణంలో ప్రపంచంలోని నాలుగు లక్షల మంది కంటే తక్కువ మంది, సంపూర్ణ గ్రహణం లేదంటే.. కంకణాకార గ్రహణాన్ని చూడగలుగుతారని అంచనా. సంపూర్ణ సూర్యగ్రహణం ఆస్ట్రేలియా ఎక్స్మౌత్ ద్వీపకల్పంలో కేవలం ఒకే ఒక నిమిషం మాత్రమే కనిపిస్తుందని చెప్పారు శాస్త్రవేత్తలు.
భారతదేశంలో గ్రహణం లేకపోతే నియమాల సంగతేంటి
ఏప్రిల్ 20న ఏర్పడే సూర్యగ్రహణం భారతదేశంలో ఎక్కడా కనిపించదు కాబట్టి సూతకాలం వర్తించదు అంటారు. అయితే గ్రహణ ప్రభావం మనదేశంలో లేకపోయినా ఆ సమయాన్ని మాత్రం అశుభంగానే పరిగణిస్తారు జ్యోతిష్య శాస్త్రవేత్తలు. అందుకే ఈ గ్రహణం పట్టినప్పటి నుంచి విడిచినంత వరకూ ఎలాంటి శుభకార్యక్రమాలు చేయకూడదని చెబుతారు. అవకాశం ఉన్నవారు నదీస్నానం, సముద్రస్నానం ఆచరించి నవగ్రహారాధన చేస్తే ఇంకా మంచిది. అయితే సాధారణంగా గ్రహణ సమయంలో గర్భిణిలు కదలకుండా కనీసం రెప్పకూడా వేయకుండా పడుకుని ఉండాలంటారు కదా..అలాంటి నియమాలు ఇప్పుడు వర్తించవు.