వైసీపీ తరపున వంద మంది కొత్త అభ్యర్థులు ? – జగన్ సాహసం చేస్తున్నారా ?

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక్క సారిగా అలజడి ప్రారంభమయింది. ఎప్పట్నుంచి కసరత్తు చేస్తున్నారో తెలియదు కానీ హఠాత్తుగా 11 స్థానాలకు ఇంచార్జుల్ని మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇది ప్రారంభం మాత్రమేనని కనీసం 80- 90 భై స్థానాల్లో మార్పు ఉంటుందని వైఎస్ఆర్‌సీపీ వర్గాలు చెబుతున్నాయి. దీనికి కారణం ఎమ్మెల్యేల అసంతృప్తి ప్రభుత్వంపై పడకుండా ఉండటానికేనని చెబుతున్నారు.

బీఆర్ఎస్ ఓటమి కారణాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఒకటి

తెలంగాణలో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకే ప్రాధాన్యం ఇచ్చారు. అదే అభ్యర్థులను మార్చిన చోట మంచి ఫలితాలు వచ్చాయి. ఈ ఫలితాలను పూర్తిగా విశ్లేషించుకున్న తర్వాత ఇప్పటి వరకూ నియోజకవర్గాల్లో వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను ఉపేక్షించారు కానీ.. ఇక ఉపేక్షించకూడదని మార్పులకు శ్రీకారం చుట్టాల్సిందేననని నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు. అనుకున్నదే తడవులుగా ఐ ప్యాక్ టీం ఇచ్చే సర్వే రిపోర్టులు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఇంచార్జుల మార్పుపై దృష్టి సారించారు. ఈ సారి బీసీ వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటున్నారు. అందుకే బలమైన నేతలు ఉంటే.. వారికే ప్రాధాన్యం ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

సీనియర్ నేతలైనా మొహమాటాలు లేనట్లే !

సర్వేల్లో వ్యతిరేక ఫలితాలు వస్తున్న చోట్ల సీనియర్ నేతలు, గతంలో పోటీ చేసిన వారి కన్నా కొత్త వారికి అవకాశం కల్పించేందుకు వైసీపీ హైకమాండ్ ప్రయత్నిస్తోంది. ఇంచార్జుల్ని మార్చిన 11 నియోజకవర్గాల్లో పలువురు కొత్త ఇంచార్జులు ఉన్నారు. పదకొండు స్థానాల్లో టిక్కెట్లు ఆశిస్తున్న పలువురు సీనియర్లకు మొండి చేయి చూపించినట్లయింది. అద్దంకిలో బాచిన చెంచు గరటయ్య కుమారుడు కృష్ణచైతన్య ఇంచార్జ్ గా ఉన్నారు. హఠాత్తుగా ఆయనను తప్పించి హనిమిరెడ్డిని నియమించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డిలకు టిక్కెట్ లేనట్లే. ముందు ముందు పలువురు సీనియర్లకు గట్టి షాక్ ఇవ్వబోతున్నట్లుగా చెబుతున్నారు.

ఫిబ్రవరిలోనే ఎన్నికల షెడ్యూల్ – అందుకే హడావుడి

ఫిబ్రవరిలోనే ఎన్నికల షెడ్యూల్ వస్తుందని వైసీపీ వర్గాలు గట్టిగా నమ్ముతున్నాయి. అందుకే ఇంచార్జుల్ని మార్చాలనుకున్న చోట శరవేగంగా మార్చేసి.. పనితీరున అంచనా వేయాలనుకుంటున్నారు. పరిస్థితుల్ని అంచనా వేసిన తర్వాత.. టిక్కెట్లను ఖరారు చేస్తారు. ఇంకా ఎక్కువ సమయం లేదని.. కేవలం రెండు నెలలే ఉన్నందున వేగంగా నిర్ణయాలు తీసుకోవాలని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. కనీసం యాభై మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు గడ్డు పరిస్థితి ఉందని.. నియోజవర్గాలు మార్చనున్నారని చెబుతున్నారు. అసంతృప్తికి గురయ్యే వారిని బుజ్జగిస్తే క్లీన్ ఇమేజ్ తో వైసీపీ ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంటుంది.