మానవ ప్రయత్నం, భగవంతుడి ఆశీర్వాదం – సురక్షితంగా బయట పడిన 41 మంది కార్మికులు

కృషితో నాస్తి దుర్భిక్షం అంటారు. ప్రయత్నిస్తే ఏదైనా సాధ్యమంటారు. ఆ సామెత ఇక్కడ వంద శాతం అతికినట్లు ఉండకపోయినా ఆ 41 మందిని కాపాడే ప్రయత్నం మాత్రం అలాంటిదేనని చెప్పక తప్పదు. 140 మంది కోట్ల భారతీయుల ప్రార్థనలు ఫలించి ఉత్తరాఖండ్ సొరంగంలో చిక్కుకున్న కూలీలంతా సురక్షితంగా బయట పడ్డారు. వారి కుటుంబ సభ్యులు, బంధువులే కాకుండా దేశ ప్రజలు మొత్తం ఊపిరి పీల్చుకున్నారు..

వేడుక జరుపుకుని మిఠాయీలు పంచి…

17 రోజుల పాటు సొరంగంలో గడిపి, బయట పడాలన్న దృఢనిశ్చయంతో నిరీక్షించిన వారిని మంగళవారం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో బయటకు తెస్తుంటే ఆ ఉద్వేగమే వేరుగా కనిపించింది. రాత్రి ఏడు గంటల ప్రాంతంలో ర్యాట్ హోల్ మైనింగ్ ద్వారా ఆఖరి అవరోధాన్ని తొలగించి కార్మికులను బయటకు తీసిన నేపథ్యంలో అక్కడ కరతాళ ధ్వనులు, నినాదాలతో నిండిపోయింది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలకు ఈ ఆపరేషన్ ఓ కనీవినీ ఎరుగని విజయంగా చెప్పుకోవాల్సిందే. ఒక్కరినీ స్ట్రెచ్చర్లపై బయటకు తెస్తుంటే వారిలోని ఆనందం ఉద్వేగంగా మారింది. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన సందర్భం కూడా అదే కావచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి. స్థానిక ప్రజలు నిన్నటి రోజును దీపావళిగా జరుపుకున్నారు. సొంరంగం నుంచి బయటకు వచ్చిన కార్మికులను చూసిన వెంటనే ఆనందంతో మిఠాయిలు పంచుకున్నారు.

ప్రధాని మోదీ పలుకరింపు ..

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి రోజంతా సొరంగం బయటే వేచి ఉన్నారు. కేంద్ర మంత్రి వీకే సింగ్ కూడా అక్కడకు చేరుకుని పనులను పర్యవేక్షించారు. వీఐపీ రాక రెస్క్యూ పనులకు అడ్డంకిగా పరిణమించకుండా చూసుకున్నారు.రాత్రికి కార్మికులు బయటకు వచ్చిన వెంటనే వారిని పూలమాలతో సత్కరించి సీఎం స్వయంగా ఆలింగనం చేసుకున్నారు. అది వారికి ధైర్యం నింపే తొలి ప్రయత్నంగా చెప్పుకోవాలి. ప్రధాని నరేంద్ర మోదీ గంటకో సారి రెస్క్యూ పనుల వివరాలను తెలుసుకున్నారు. కార్మికులు బయటకు రాగానే వారితో ఫోన్లో మాట్లాడారు. జరిగిన దాన్ని ఒక పీడకలగా భావించి ముందుకు సాగాలని సలహా ఇచ్చారు. రెస్క్యూ సిబ్బంది టీమ్ వర్క్ ను ఆయన అభినందించారు. అన్ని ఏజెన్సీలు ఒకటిగా పనిచేయడమో ఉద్వేగ భరిత క్షణమని ఆయన అభిప్రాయపడ్డారు.

అసలేం జరిగింది..ఎలా జరిగింది..

ఈ నెల 12న దీపావళి పండుగ నాడు తెల్లవారుజామున సిల్క్యారా టన్నెల్‌లో కొంత భాగం కూలడంతో 8 రాష్ట్రాలకు చెందిన 41 మంది కూలీలు చిక్కుకుపోయారు. అప్పటి నుంచి కేంద్ర, రాష్ట్ర విపత్తు నివారణ దళాలు, ఐటీబీపీ, బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌ సహాయక చర్యలు మొదలుపెట్టాయి. టన్నెల్‌లో 57 మీటర్ల వరకు శిథిలాలు పేరుకున్నట్లు గుర్తించారు. వీటిని తొలుస్తూ.. 800 మిల్లీమీటర్ల వ్యాసం ఉన్న పైప్‌లైన్‌ వేసి దానిలో నుంచి కూలీలను తీసుకురావాలని అధికారులు ప్రణాళిక రచించారు. క్లిష్టమైన డ్రిల్లింగ్‌నూ చేయగల అమెరికన్‌ ఆగర్‌ యంత్రాన్ని తెప్పించారు. దాదాపు 47 మీటర్ల మేర తవ్వాక.. సొరంగం నిర్మాణంలో ఉపయోగించిన ఇనుప పట్టీలు అడ్డుపడి ఆగర్‌ యంత్రం బ్లేడ్లు పూర్తిగా విరిగిపోయాయి.మరో యంత్రాన్ని ఇండోర్‌ నుంచి తెప్పించినా ప్రయోజనం లేదని తేలడంతో అధికారులు సొరంగంపైన ఉన్న కొండను నిలువునా తవ్వాలని నిర్ణయించారు. 86 మీటర్లకు గాను సోమవారం 36 మీటర్ల మేర డ్రిల్లింగ్‌ చేశారు. హైదరాబాద్‌ నుంచి హుటాహుటిన ప్లాస్మా కట్టర్‌ను రప్పించి సొరంగంలో పది మీటర్ల శిథిలాల్లోని అడ్డంకులు, ఆగర్‌ యంత్రం భాగాలను తొలగించారు. అనంతరం బొగ్గు గనుల్లో సన్నటి మార్గాలను తవ్వడంలో నిపుణులైన 12 మంది ర్యాట్‌ హోల్‌ మైనర్స్‌ను రంగంలోకి దింపారు. సోమవారం రాత్రి పని ప్రారంభించిన వీరు 24 గంటల్లోపే పూర్తిచేశారు. మొత్తం 57 మీటర్లకూ అడ్డంకులు తొలగడంతో పైప్‌లైన్‌ను పంపి కూలీలను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.