AC Power Bill: ఎండలకు ఏసీ బిల్లు మోగిపోతోందా..ఈ చిట్కాలు పాటిస్తే ఎక్కువ కరెంటు కాలదు!

దేశంలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగిపోతున్నాయి. ఉదయం తొమ్మిది నుంచి ఉక్కపోతలు మొదలైపోతున్నాయి. తాజాగా ‘‘సివియర్ హీట్‌వేవ్’’ హెచ్చరికలను కూడా భారత వాతావరణ విభాగం జారీచేసింది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు ఎక్కువగా నమోదు కావొచ్చని ఐఎండీ అంచనా వేస్తోంది. సాధారణంగా మే, జూన్ నెలల్లో హీట్‌వేవ్‌లు వస్తుంటాయి…ఈ సారి ఏప్రిల్లోనే ఎండలు ఠారెత్తిస్తున్నాయి. విపరీతంగా పెరుగుతున్న ఎండల నుంచి ఏసీలు కొంత ఉపశమనం. చల్లగా ఉందని అలా ఏసీలో కూర్చుంటే ఆ తర్వాత వచ్చిన కరెంట్ బిల్లు చూసి చెమట్లు పట్టకతప్పదు. మరి ఏం చేయాలి..ఏసీలో ఉండాలి..బిల్లు తక్కువ రావాలి..ఇది సాధ్యమేనా అంటే.. కొన్ని చిట్కాలు పాటిస్తే సాధ్యమే అంటున్నారు నిపుణులు

ఎప్పుడూ 24 నుంచి 27 డిగ్రీల మధ్యే ఉంచాలి
మంచి ఎండలోంచి రాగానే ఆ ఉక్కపోతను తాళలేక ఏసీని 18 పెట్టేస్తారు…ఇలా చేస్తే తొందరగా చల్లబడుతుందనుకుంటారు . కానీ అస్సలు ఈ పని చేయకూడదంటున్నారు సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ పరిశోధకులు. ఏసీని ఎప్పుడూ 24 నుంచి 27 డిగ్రీల మధ్యే ఉపయోగించాలి. దీని వల్ల ఏసీలు ఎక్కువ రోజులు వస్తాయి. వినియోగించే విద్యుత్ కూడా తగ్గుతుంది. 27 డిగ్రీల నుంచి ఒక్కో డిగ్రీ తగ్గిస్తూ వెనక్కి వెళ్లినప్పుడు ఏసీ సామర్థ్యం సగటున మూడు నుంచి పది శాతం తగ్గుతున్నట్లు తేలింది. కాకపోతే కాస్త నెమ్మదిగా కూల్ అవుతుంది అంతే.

ఇన్‌స్టలేషన్‌లో పొరపాట్లు
ఏసీల బిల్లులు పెరగడానికి ఇన్‌స్టలేషన్‌లో చేసే తప్పులూ కూడా ఒక కారణమని ఎలక్ట్రానిక్స్ సంస్థ టీసీఎల్ పేర్కొంది. ఇన్‌స్టలేషన్‌లో తప్పుల్లో ఇంటికి సరిపడా ఏసీని ఎంచుకోకపోవడం నుంచి ఏసీని సరిగ్గా అమర్చకపోవడం వరకూ ఉంటాయి..ఇలాంటి పొరపాట్లు చేస్తే ఏసీ తొందరగా కూల్ అవదు.. బిల్లు పేలిపోతుంది.

గది విస్తీర్ణానికి తగినట్లుగా ఏసీని ఎంపిక చేసుకోవాలి
గది విస్తీర్ణం ఎంత ఉందో చూసుకుని దాని ఆధారంగ ఏసీని ఎంపిక చేసుకోవాలి. చిన్న గదికి ఎక్కువ టన్నులుండే సామర్థ్యమున్న ఏసీతో విద్యుత్ అదనంగా ఖర్చు అవుతుంది. అదే సమయంలో తక్కువ సామర్థ్యముండే ఏసీలు పెద్ద గదులకు సరిపోవు. అందుకే ముందు మన ఇంటి పరిమాణాన్ని దృష్టిలో ఉంచుకుని ఏసీని ఎంచుకోవాలి

ఎండలో పెట్టకూడదు
ఏసీని ఎండ తగిలేలా అమర్చడం వల్ల కూడా కరెంటు బిల్లు పెరగడానికి ఓకారణంగా చెప్పొచ్చు. అవుట్ డోర్‌ ఏసీ యూనిట్‌లో కండెన్సర్ కాయిల్, కండెన్సర్ ఫ్యాన్ ఉంటాయి. బయటగాలిని కండెన్సర్ కాయిల్‌లోకి పంపేందుకు ఈ ఫ్యాన్ ఉపయోగపడుతుంది. అయితే ఈ కండెన్సర్ కాయిల్ మీద ఎండ పడితే, గాలిని చల్లబరిచే ఏసీ సామర్థ్యం తగ్గుతుంది. ఫలితంగా కూల్ అయ్యేందుకు ఎక్కువ సమయం, ఎక్కువ విద్యుత్ ఖర్చవుతుంది.

పదే పదే తలుపులు తీయరాదు
ఏసీ ఆన్ చేసిన తర్వాత గది తలుపులు పదే పదే తీయడం, వేయడం చేయరాదు. అలా చేస్తే తొందరగా కూల్ అవదు..ఎక్కువ విద్యుత్ వృధా అవుతుంది. ముఖ్యంగా చిన్న పిల్లలు ఉండే ఇంట్లో ఇలాంటివి జరుగుతుంటాయి..ఏసీ వేసినతర్వాత కూడా పిల్లలు ఆడుతూ అటు ఇటూ తిరుగుతూ ఉంటారు..దీంతో రూమ్ చల్లబడేందుకు ఎక్కువ సమయం పడుతుంది. ఇంట్లోకి నేరుగా ఎండపడే ప్రదేశాలుంటే వాటిని జాగ్రత్తగా క్లోజ్ చేయాలి.

ఫ్యాన్ వేయాలి
సాధారణంగా ఏసీ నడిచేటప్పుడు చాలామంది ఫ్యాన్ వేయరు..కానీ ఫ్యాన్ వేయడం మంచిదంటున్నారు నిపుణులు. ఫ్యాన్ కూడా వేసుకుంటే గది ఉష్ణోగ్రత సాధారణం కంటే కాస్త తక్కువగా అనిపిస్తుందని తద్వారా ఏసీ వల్ల తొందరగా కూల్ అవుతుంది..విద్యుత్ ఆదా అవుతుందని చెబుతున్నారు.

ఫిల్టర్లు శుభ్రం చేయాలి
ఎయిర్ ఫిల్టర్‌లోని దుమ్ము, ధూళిని శుభ్రపరచాలి. వీటి కారణంగా ఏసీలో నుంచి గాలి సరిగా రాదు. ఫలితంగా గది త్వరగా చల్లపడకపోవడమే కాక కరెంట్ బిల్ అందుకోలేనంత ఎక్కువగా వస్తుంది. కాబట్టి కనీసం రెండు నెలలకోసారి అయినా ఎయిర్ ఫిల్టర్లని శుభ్రం చేసుకోవడం మంచిది.

ఈ సూచనలు పాటిస్తే ఏసీకి రిపేర్లు తక్కువగా వస్తాయి…కరెంటు బిల్లు కూడా ఎక్కువ రాదని నిపుణులు చెబుతున్నారు