‘శని’ ఉందని ఎలా తెలుస్తుంది – పరిహారాలేంటి!

ఏ గ్రహం గురించి తెలిసినా తెలియకపోయినా శనిగ్రహం గురించి మాత్రం దాదాపు తెలియని వారుండరు. శనికి భయపడని వారూ ఉండరు. ప్రతి ఒక్కరి జాతకంలో శనిని ఎదుర్కోక తప్పదు. అయితే శని ఉందని ఎలా తెలుస్తుంది? శనిదోషం తగ్గించుకునేందుకు ఏం చేయాలి?

30 ఏళ్లకు ఓసారి శని తప్పదు
శని మేష రాశి నుంచి మీన రాశివరకూ 12 రాశుల్లో సంచరిస్తాడు. అయితే మిగిలిన గ్రహాలు నెలకో రాశి మారుతాయి కానీ శనిమాత్రం నెమ్మదిగా సంచరిస్తాడు. రెండున్నరేళ్లు ఒక్కోరాశిలో ఉంటూ 12 రాశుల్లో ప్రయాణం పూర్తిచేయడానికి 30 సంవత్సరాలు పడుతుంది. ప్రతి ఒక్కరికీ జీవితకాలంలో దాదాపు మూడుసార్లు శని ప్రభావం తప్పదు. మీ రాశినుంచి 12,1,2 స్థానాల్లో శని సంచరించే కాలాన్ని ఏల్నాటి శని అంటారు. ఈ మూడు రాశుల్లో మొత్తం ఏడున్నర సంవత్సరాలుంటుంది…అంటే ఏడున్నరేళ్లు..దీనిని ఏలినాటి శని అంటారు.

12 రాశిలో సంచరిస్తే
శని 12 వ రాశిలో సంచరించేటప్పుడు వ్యవహారాల్లో చిక్కులు, వ్యాపారాల్లో ఒడిదొడుకులు, ఊహించని మార్పులు, అనారోగ్యం, తరచూ ప్రయాణాలు

జన్మ రాశిలో సంచరిస్తే
జన్మరాశిలో శని సంచరిస్తున్నప్పుడు ఆరోగ్యభంగం, నీలాపనిందలు, భాగస్వాములతో వైరం, మనశ్శాంతి లోపం, ధనవ్యయం. రుణబాధలు,వృత్తి, వ్యాపారాల్లో చికాకులు. స్థానచలన సూచనలు.

రెండో రాశిలో సంచరిస్తే
రెండవ రాశిలో సంచరిస్తున్నప్పుడు ఆశలు కల్పించి నిరాశ కల్పిస్తాడు శని. అన్ని పనులు అయినట్టే అనిపిస్తాయి కానీ ఆడేసుకుంటాడు. ఇంకా రుణబాధలు, అనారోగ్యం, మానసిక ఆందోళనలు తప్పవు

జీవితంలో మొదటిసారి వచ్చే ఏల్నాటి శనిని మంగు శని అంటారు…ఈ ఏడున్నరేళ్లు నరకమే. రెండోసారి వచ్చే ఏల్నాటి శనిని పొంగుశని అని అంటారు..ఇది యోగదాయకంగా ఉంటుంది. మూడోసారి వచ్చే శనిని మృత్యుశని అంటారు. అంటే మీ జీవితకాలంలో మూడోసారి శని వస్తే అనారోగ్య సమస్యలు, అపమృత్యుభయం వెంటాడుతుంది.

ఇక జన్మరాశికి 4,8,10 స్థానాల్లో శని సంచరిస్తున్నప్పుడు అర్ధాష్టమ, అష్టమ, దశమ శని సంచారం అంటారు. ఇవి కూడా దోషమే. కేవలం 3, 5, 7,9, 11 స్థానాల్లో శని సంచారం ఎలాంటి దోషం ఉండదు. మరోవైపు శుక్రుడు, గురు గ్రహాలు బలంగా ఉన్నప్పుడు కూడా శని అంతగా బాధించడు.

పరిహారాలివే
శని దోషం ఉన్నవారు శనికి తైలాభిషేకాలు, జపాదులు చేయించుకుంటే కొంత ఉపశమనం కలుగుతుంది. శని శ్రమ కారకుడు,వాయు కారకుడు కాబట్టి రోజు వాకింగ్ చేయడం, యోగా చేయడం, కష్టించి పనిచేయడం వల్ల శని ప్రభావం తగ్గుతుంది. శ్రమ కారక జీవులైన చీమలకు పంచదార గాని,తేనే గాని వెయ్యటం వల్ల కూడా శని బాధల నుంచి విముక్తి లభిస్తుంది. చీమలు శ్రమైక జీవనానికి ఉదాహరణ. అందుకే చీమల్ని ఆదర్శందగా తీసుకోవాలంటారు.

గమనిక: కొందరు పండితుల నుంచి, కొన్ని పుస్తకాలు ఆధారంగా సేకరించిన సమాచారం ఇది. దీనిని ఎంత వరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.